ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భాగంగా అందుబాటులోకి వచ్చే కొత్త అవకాశాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఇన్వెస్ట్ చేయడం సాధారణ ఇన్వెస్టర్లకు సాధ్యమయ్యేది కాదు. నిపుణులైన ఫండ్ మేనేజర్లు ఇలాంటి అవకాశాలను ముందుగానే గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందుకని ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలం పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బిజినెస్ సైకిల్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు.
పెట్టుబడుల విధానం
ఆర్థిక వ్యవస్థలో భాగంగా వివిధ వ్యాపార సైకిల్స్‌లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. అంటే ఒక్కో కాలంలో కొన్ని రంగాల్లోని కంపెనీలకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వస్తుంటాయి. అలా లాభపడే రంగాలు, స్టాక్స్‌ను గుర్తించి ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది. దీన్నే బిజినెస్ సైకిల్ ఆధారిత పెట్టుబడుల విధానం అంటారు. ఆయా ఆర్థిక వృద్ధి దశల్లో భాగంగా ఎక్కువ లాభపడే కంపెనీలను గుర్తించడంలోనే పథకం రాబడులు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఆర్థిక మాంద్యం సమయంలో చాలా రంగాలు సమస్యలను ఎదుర్కొంటాయి. కానీ, అదే సమయంలో కొన్ని రంగాలకు వృద్ధి అవకాశాలు ఏర్పడతాయి. అలాంటి వాటిని ఫండ్ మేనేజర్ గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటారు. విదేశీ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ సైతం ఈ పథకంలో భాగంగా ఉంటుంది.
రాబడులు
గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 36 శాతం రాబడులను అందించింది. ఇదే కాలంలో బెంచ్ మార్క్‌రాబడులు 28 శాతంగానే ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో ఏటా 24 శాతం చొప్పున రాబడులను ఈ పథకం తెచ్చిపెట్టింది. 2021 జనవరి 18న ఈ పథకంలో ఏక మొత్తంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, రూ.1.93 లక్షలుగా మారేది. అంటే ఏటా 25 శాతం సీఏజీఆర్ రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. ఈ విభాగంలో ముందు నుంచీ ఉన్న పథకంగా దీనికి గుర్తింపు ఉంది. ఈ మూడేళ్ల కాలంలో ఫండ్ మేనేజర్లు అనీష్ తవాక్లే, లలిత్ కుమార్, మనీష్ బంతియా తీసుకున్న పెట్టుబడుల నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10,000 సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, 2024 జనవరి 1 నాటికి రూ.5.23 లక్షలు సమకూరి ఉండేది.. ఇందులో పెట్టుబడి భాగం రూ.3.6 లక్షలు. అంటే 26.8 సీఏజీఆర్ రాబడులను అందించింది.
పోర్ట్‌ఫోలియో
ఈ పథకం నిర్వహణలో రూ.7,616 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 54 శాతం పెట్టుబడులు దేశీయ రంగాలపై దృష్టి సారించే కంపెనీల్లోనే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగం పెట్టుబడులు బ్యాంక్‌లు, ఆటోలు, నిర్మాణ రంగ కంపెనీలు, ఇంధన కంపెనీల్లోనే ఉన్నాయి. నిర్వహణ ఆస్తుల్లో 94.34 శాతం ఈక్విటీలకు కేటాయించగా, డెట్‌లో 0.85 శాతం, మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 85 శాతం మేర పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. అంటే రిస్క్ చాలా తక్కువగా భావించొచ్చు. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 12.52 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.84 శాతం చొప్పున ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment