పన్ను ఆదా కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) పథకాల్లోనూ ఇన్వెస్ట్ చేసే వారున్నారు. సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ మేరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ కూడా ఒకటి.
రాబడులు..: టాటా ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ పథకం స్వల్ప కాలంలో మోస్తరు పనితీరే చూపించగా, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో మాత్రం బెంచ్ మార్క్‌తో పోలిస్తే మెరుగైన రాబడులను ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది. గత ఏడాది కాలంలో ఈ పథకం 14.49 శాతం రాబడులు ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 14 శాతం వార్షిక రిటర్నులు ఇచ్చింది. ఐదేళ్లలో 12.13 శాతం, పదేళ్లలో 13.28 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. కాకపోతే ఏడాది, మూడేళ్ల కాలంలో మాత్రం బెంచ్ మార్క్ ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ సెన్సెక్స్ టీఆర్‌ఐతో పోలిస్తే ఒక శాతం నుంచి రెండు శాతం వరకు తక్కువ రాబడులు ఉన్నాయి. కానీ, ఈఎల్‌ఎస్‌ఎస్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు 2–5 శాతం వరకు అధిక రాబడులు టాటా ఇండియా ట్యాక్స్‌సేవింగ్స్‌లోనే ఉన్నాయి. ఈ పథకానికి 20 ఏళ్ల చరిత్ర ఉంది. కానీ, 2014 చివరి వరకు ఈ పథకంలో గ్రోత్ ఆప్షన్ లేదు. రాబడుల చరిత్రను పరిశీలించే వారు ఈ అంశాలను గుర్తు పెట్టుకోవాలి.
పెట్టుబడుల వ్యూహాలు
మార్కెట్ అస్థిరతల నేపథ్యంలో దీర్ఘకాలం కోసం ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఒకింత సురక్షితమనే చెప్పాలి. ఎందుకంటే మూడేళ్ల పాటు ఇందులో చేసే పెట్టుబడులపై లాకిన్ ఉంటుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాతే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. దీంతో ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాలకు రిడెంప్షన్ (పెట్టుబడులను ఉపసంహరించుకోవడం) ఒత్తిళ్లు తక్కువగా ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో దీర్ఘకాల దృష్టితో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగి ఉంటారు. ఇది దీర్ఘకాలంలో రాబడులకూ తోడ్పడుతుంది. ఈ పథకం మల్టీక్యాప్ విధానాన్ని పెట్టుబడులకు అనుసరిస్తుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను వివిధ మార్కెట్ విలువ కలిగిన (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) స్టాక్స్ మధ్య మార్పులు, చేర్పులు కూడా చేస్తుంది.
ఉదాహరణకు 2017లో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో ఈ పథకం తన మొత్తం పెట్టుబడుల్లో 40 శాతాన్ని కేటాయించింది. కానీ, చిన్న, మధ్య స్థాయి షేర్లలో అస్థిరతల నేపథ్యంలో 2018 చివరికి మిడ్, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులను 25 శాతానికి తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు తోడ్పడుతున్నాయి. పథకం పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 35 స్టాక్స్ ఉండగా, టాప్ 10 స్టాక్స్‌లోనే 58.41 శాతం మేర పెట్టుబడులను కలిగి ఉంది. బ్యాంకింగ్ ఫైనాన్షియల్, ఇంధనం, టెక్నాలజీ రంగాలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లోనే 44.5 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి.
పన్ను ఆదా.. దీర్ఘకాలంలో మంచి రాబడులు
Published Mon, Nov 18 2019 6:36 AM | Last Updated on Mon, Nov 18 2019 6:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment