
ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయితే అదేసమయంలో మధ్యప్రదేశ్‌లోని సౌసర్ నగర్‌లో గల 200 ఏళ్ల పురాతన రామాలయంలోనూ శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలోనే ఆలయ కమిటీ జనవరి 16 నుంచి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను ప్రారంభించింది.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భారీ ఆలయాన్ని నిర్మించి, అందులో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని, అదే సమయంలో తాము కూడా ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపనకు నిర్ణయం తీసుకున్నప్పుడు, తాము కూడా అదే రోజున ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించామన్నారు. కమిటీ మేనేజర్ నరేష్ బగానీ మాట్లాడుతూ దాదాపు 200 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి తమ కుటుంబసభ్యులు శ్రీరామ మందిరాన్ని నిర్మించినప్పుడు ఇక్కడికి వచ్చారని చెప్పారు.
ఆలయాన్ని పునరుద్ధరించాలని తమ కుటుంబీకులు నిర్ణయించారని, గత రెండేళ్లుగా ఆలయ నిర్మాణ పనులు కొనసాగాయన్నారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 22 నుంచి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానున్నదని అన్నారు.