అయోధ్యలోని శ్రీరాముని ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. బాలరాముని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు క్యూ కడుతున్నారు. అయోధ్యను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశంగా మార్చేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయోధ్యను ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనిలో భాగంగా 13 నూతన ఆలయాలను నిర్మించనున్నారు. వీటిలోని ఆరు ఆలయాలు ప్రధాన మందిర సముదాయం లోపల, ఏడు ఆలయాలు వెలుపల నిర్మితం కానున్నాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరీజీ ఈ ప్రణాళిక గురించి తెలియజేశారు. ప్రధాన ఆలయాన్ని పూర్తి చేసే పనులతో సహా అన్ని ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.
ప్రధాన ఆలయంలో మొదటి అంతస్తు వరకూ మాత్రమే నిర్మాణం పూర్తయ్యిందని, రెండో అంతస్తు పనులు జరుగుతున్నాయని, అనంతరం శిఖరం, మధ్య గోపురం పనులు జరగాల్సి ఉందని గిరీజీ వివరించారు. రాముని కుటుంబానికి చెందిన ఐదు ప్రధాన ఆలయాల పనులు కొనసాగుతున్నాయని, రాముడు స్వయంగా విష్ణువు అవతారం అయినందున గణపతి, శివుడు, సూర్య దేవుడు, జగదంబ ఆలయాలు కూడా నిర్మితం కానున్నాయని తెలిపారు.
ప్రధాన ఆలయానికి నలు మూలల్లో ఈ ఆలయాలు ఉండనున్నాయి. హనుమంతునికి ప్రత్యేక ఆలయం కూడా నిర్మితం కానుంది. ఇప్పటికే ఈ ఆలయాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సీతా రసోయి సమీపంలో అన్నపూర్ణ దేవి ఆలయం నిర్మితం కానుంది. ఆలయ సముదాయం వెలుపల వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, శబరి, జటాయువు తదితర ఆలయాలు నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment