అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమైన రెండవరోజున(బుధవారం) దాదాపు 2.5 లక్షల మంది భక్తులు దర్శనానికి తరలివచ్చారు. మంగళవారం(తొలిరోజు) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ఆకస్మిక పర్యటన, సూచనల ప్రభావం బుధవారం కనిపించింది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తాజాగా యాత్రికుల సౌకర్య కేంద్రాన్ని ప్రారంభించింది. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.
బాలక్ రాముని దర్శనాలు ప్రారంభమై నేటికి (గురువారం) మూడో రోజు. మొదటి రెండు రోజులు భక్తుల రద్దీతో అనేక ఇబ్బుందులు తలెత్తాయి. ఈ నేపద్యంలో ట్రస్ట్ పలు చర్యలు చేపట్టడంతో ప్రస్తుతం ఆలయంలో భక్తుల దర్శనాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. రామభక్తుల దర్శనాలు నిరంతరం కొనసాగుతున్నాయి. బాలరాములోరికి భక్తులు కానుకలు, విరాళాలు విరివిగా సమర్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కొనసాగుతున్న భక్తుల వరద
ప్రాణప్రతిష్ఠ జరిగినంతనే ఐదేళ్ల బాలరాముడు కోటీశ్వరునిగా మారిపోయాడు. తొలిరోజు శ్రీరాముని దర్శనానికి వచ్చిన భక్తులు రూ.3.17 కోట్ల విరాళాలను సమర్పించారని ట్రస్ట్ తెలిపింది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ అనంతరం మంగళవారం ఆలయంలోకి సామాన్య భక్తుల ప్రవేశానికి అనుమతి కల్పించారు. రామాలయానికి వచ్చిన సందర్శకుల సంఖ్యకు సంబంధించి గతంలో ఉన్న రికార్డులన్నీ బద్దలయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం వారు నానా అవస్థలు పడ్డారు. రాములోరి దర్శనం కోసం వచ్చిన భక్తులు విరాళాలు సమర్పించారు.
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ మంగళవారం ఆలయానికి అత్యధిక విరాళాలు అందాయి. ఆన్‌లైన్‌లో విరాళాలు అందించడానికి రామభక్తులు ఎంతో కష్టపడాల్సి వచ్చింది. విరాళాల కోసం ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, పలువురు భక్తులు విరాళాలు అందించారన్నారు. కాగా అయోధ్యకు తరలివచ్చే భక్తులు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విరాళాలు అందించవచ్చు. ఆలయంలోని హుండీలలో కూడా విరాళాలు సమర్పించేందుకు అవకాశం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment