అయోధ్యలోని నూతన రామాలయంలో నేడు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న నేపధ్యంలో దేశం మొత్తం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. అయోధ్యలో మారుమోగుతున్న హర్షధ్వానాల ధ్వని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే అద్భుత క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు.
హిందువులే కాదు ఇతర మతాల వారు కూడా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు అమితమైన ఉత్సాహం చూపిస్తున్నారు. 50కి పైగా దేశాలలో వివిధ మాధ్యమాల సాయంతో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకను చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. లండన్ వీధుల్లో జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతుండగా, బ్రిటన్‌లో నిర్వహించిన కారు ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ దేశంలోని సుమారు 250 దేవాలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
నేపాల్‌లో..
నేపాల్‌లోని జనక్‌పూర్‌లో గల జానకీమాత ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. జనక్‌పూర్ మేయర్ మనోజ్ కుమార్ సాహా.. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా అయోధ్యవాసులకు శుభాకాంక్షలు తెలిపారు నేపాల్‌కు భారత్‌తో సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. శ్రీరాముని అత్తమామల స్వస్థలం అయిన జనక్‌పూర్‌లో నేడు దీపోత్సవం జరగనుంది.
ఇది కూడా చదవండి: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి?
కెనడాలో..
కెనడాలోని అంటారియో పరిధిలోగల ఓక్విల్లే, బ్రాంప్టన్ నగరాల్లో నేటి రోజును ‘అయోధ్య రామ మందిర దినోత్సవం’గా ప్రకటించాయి. బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్, ఓక్విల్లే మేయర్ రాబ్ బర్టన్ మాట్లాడుతూ అయోధ్యలో జరిగే శ్రీరామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు సాంస్కృతికంగా, చారిత్మాకంగా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. శతాబ్దాల నాటి కల సాకరమయ్యిందని మేయర్లిద్దరూ పేర్కొన్నారు.
మారిషస్‌లో..
ద్వీప దేశమైన మారిషస్‌లోని అన్ని దేవాలయాలు ‘ప్రాణప్రతిష్ఠ’ సందర్బంగా దీపాలతో వెలుగులు పంచనున్నాయి. 48 శాతం హిందూ జనాభా ఉన్న మారిషస్‌లోని అన్ని దేవాలయాల్లో రామాయణ పారాయణం జరగనున్నది. హైకమిషనర్ హేమండోయిల్ దిలామ్ మాట్లాడుతూ ఈ ఉత్సవం భారతదేశానికే కాకుండా మారిషస్ ప్రజలకు కూడా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. మారిషస్ ప్రభుత్వం నేడు హిందూ ఉద్యోగులకు రెండు గంటల సెలవులు ఇచ్చింది. ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు మారిషస్‌లోని 100 ప్రదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా?
డెన్మార్క్‌లో..
డెన్మార్క్‌లోని హిందూ స్వయంసేవక్ సంఘ్.. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ట వేడుక సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. డానిష్ అంబాసిడర్ పూజా కపూర్ మాట్లాడుతూ ఈ వేడుక సందర్భంగా భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయారన్నారు. దీర్ఘకాలంగా కొనసాగిన రామాలయ వివాదాన్ని పరిష్కరించి, ఆలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి అయోధ్య అక్షతలు పంపిణీ చేశారు.
న్యూజిలాండ్‌లో..
అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా న్యూజిలాండ్ రెగ్యులేషన్ మంత్రి డేవిడ్ సేమౌర్ మాట్లాడుతూ ‘జై శ్రీరామ్... ప్రధాని నరేంద్ర మోదీ సహా భారతీయులందరికీ అభినందనలు. 500 ఏళ్ల తర్వాత రామ మందిర నిర్మాణం సాధ్యమైంది. ప్రధాని మోదీ నాయకత్వమే దీనికి కారణం. ఈ ఆలయం చాలా గొప్పది. రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు నిలిచివుంటుంది. ప్రధాని మోదీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. భారతదేశంలోని కోట్లాదిమంది ప్రజలు మోదీకి అండగా నిలిచారు’ అని పేర్కొన్నారు.
ఫ్రాన్స్‌లో..
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఈఫిల్ టవర్ కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకలకు ముస్తాబయ్యింది. ఫ్రాన్స్‌లోని ప్యాలెస్ డి లా చాపెల్‌లో నేటి మధ్యాహ్నం 12 గంటలకు భారీ రథయాత్ర బయలుదేరనుంది. ఈఫిల్ టవర్ సమీపంలోని ప్యాలెస్ డి ట్రోకాడెరో సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ రథయాత్ర ముగియనుంది. దీనికి ముందు ఉదయం 10.30 గంటలకు లా చాపెల్లే సమీపంలో విశ్వకళ్యాణ యాగం నిర్వహించనున్నారు.
థాయ్‌లాండ్‌లో..
భారతదేశానికి 3,500 కిలోమీటర్ల దూరంలోని థాయ్‌లాండ్‌లోనూ మరో అయోధ్య ఉంది. దీనిని ఆ దేశంలో ‘అయుతయ’ అని పిలుస్తారు. బ్యాంకాక్‌లోని విశ్వహిందూ పరిషత్ సభ్యులు అయుతయతో సహా థాయ్‌లాండ్‌లోని అన్ని హిందూ దేవాలయాలలో రామ మందిర ప్రతిష్టాపన వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. దేశంలోని పలు నగరాల్లో ‘అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ’ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment