
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడు రోజుల పాటు జరిగే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఆలయ ట్రస్ట్ ఏడువేల మందికి పైగా అతిథులను రామ మందిర వేడుకకు ఆహ్వానించింది. వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులున్నారు.
రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నేటి నుండి రామాలయ ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలు..
మొదటి రోజు (జనవరి 16)
నేటి నుంచి రామాలయ ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
రెండవ రోజు (జనవరి 17)
రామ్‌లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి, వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు.
మూడవ రోజు(జనవరి 18)
గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి.
నాల్గవ రోజు(జనవరి 19)
పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. తర్వాత ‘నవగ్రహ’ స్థాపన చేయనున్నారు.
ఐదవ రోజు(జనవరి 20)
రామజన్మభూమి ఆలయ గర్భగుడిని జనవరి 20న సరయూ నీటితో సంప్రోక్షణ చేసి, ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు.
ఆరవ రోజు(21 జనవరి 21)
రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, పవళింపజేస్తారు.
ఏడవ రోజు(జనవరి 22)
ప్రధాన ‘ప్రాణ ప్రతిష్ఠ’ వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుంది. రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. జనవరి 21, 22 తేదీలలో సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోనికి అందరినీ అనుమతించనున్నారు.
ఇది కూడా చదవండి: శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది?