అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి? | How to go to Ayodhya What to do for Darshan | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్యకు ఎలా వెళ్లాలి? దర్శనానికి ఏం చేయాలి?

Published Sat, Jan 20 2024 7:28 AM | Last Updated on Sat, Jan 20 2024 5:51 PM

How to go to Ayodhya What to do for Darshan - Sakshi

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని తరువాత అంటే జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. మరి అయోధ్యకు ఎలా వెళ్లాలి? అక్కడ రోజూ జరిగే పూజలేమిటి? రామాలయం సందర్శనలో ఎటువంటి విధివిధానాలు ఆచరించాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

రైలు మార్గం
రైలు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునేవారు దేశంలోని  ఏ ప్రాంతం నుంచి అయినా అయోధ్యకు చేరుకోవచ్చు. న్యూ ఢిల్లీ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకుంటే దాదాపు 10 గంటలపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునేవారు సికింద్రాబాద్ నుంచి రైలులో గోరఖ్ పూర్ వెళ్లాలి. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సు  ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు సికింద్రా బాద్ నుంచి గోరఖ్ పూర్‌కు వెళ్లే రైలు అందుబాటులో ఉంది. ఈ రైలులో 30 గంటల పాటు ప్రయాణం చేయాలి. ఇదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ ప్రతి సోమ, ఆదివారాలలో అందుబాటులో ఉంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లాలనుకునే వారు ప్రతి శుక్ర, ఆది, సోమ వారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది.

రోడ్డు మార్గం
అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో 40 గంటల ప్రయాణం అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర రూ. 6 వేలు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలనుకునే వారు నాగపూర్, జబల్ పూర్, ప్రయాగ్‌రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. 

హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే మొత్తం 1305 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కాగా అయోధ్యకు వెళ్లే భక్తుల కోసం సికింద్రా బాద్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. విమానయాన సంస్థలు  కూడా స్పెషల్ ఫ్లైట్స్ ను నడిపేందుకు సిద్ధమయ్యాయి. 

విమానయానం
విమానాల ద్వారా అయోధ్యకు వెళ్లాలనుకునే రామ భక్తులు హైదరాబాద్‌ శంశాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంశాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ, లేదా గోరఖ్ పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకుని, అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలులో ప్రయాణించే చేరుకోవచ్చు. 

దర్శనం ఎలా?
అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్‌  చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు  చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్‌ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్‌తో పాటు మీ ఫోటోను అప్‌లోడ్ చేయాలి. ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. 

ఆఫ్‌లైన్‌లో..
ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు పొందాలనుకున్నప్పుడు ఆలయం సమీపంలోని కౌంటర్‌ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్‌తో పాటు ఐడీప్రూప్‌ ప్రూఫ్‌ను వెంట తీసుకువెళ్లాలి.
 
సంప్రదాయ దుస్తులలో..
దర్శనం కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్‌ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. 

అయోధ్యలో నిత్యపూజలు
అయోధ్య రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ప్రాణ ప్రతిష్ఠను ‘ప్రత్యక్షం’గా చూడటమెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement