అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణానికి విరాళాల రూపంలో ఇంతవరకూ ఎంత మొత్తం వచ్చిందనే ప్రశ్న చాలామంది మదిలో మెదిలే ఉంటుంది. అలాగే ఎవరు అత్యధిక మొత్తంలో విరాళం సమర్పించారనే దానిపై కూడా చాలామంది ఆలోచించే ఉంటారు. ఇప్పుడు ఆ ప్రశ్నలకు మీడియా దగ్గరున్న సమాధానం తెలుసుకుందాం.
అయోధ్యలో నూతన రామాలయ నిర్మాణానికి దేశంలోని 11 కోట్ల మంది ప్రజల నుంచి రూ.900 కోట్లు సేకరించాలని రామమందిర్ ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2023 డిసెంబర్ ఆఖరువరకూ రామాలయ నిర్మాణానికి ఐదువేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం విరాళాల రూపంలో అందింది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం రామ మందిర నిర్మాణం కోసం ఇప్పటివరకు 18 కోట్ల మంది రామభక్తులు నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలలో సుమారు 3,200 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేశారు. ఈ బ్యాంకు ఖాతాలలో విరాళంగా వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసింది. దానిపై వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణం జరిగింది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఆధ్యాత్మిక గురువు, కథకులు మొరారీ బాపు అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయానికి అత్యధిక విరాళం అందించారు. మొరారీ బాపు నూతన రామాలయ నిర్మాణానికి 11.3 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. దీనికితోడు యూఎస్‌ఏ, కెనడా,యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న అతని అనుచరులు సమిష్టిగా, విడివిడిగా ఎనిమిది కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.
గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద్‌భాయ్ ధోలాకియా రామ మందిర నిర్మాణానికి 11 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అయోధ్యలోని రామాలయానికి తొలి విదేశీ విరాళం అమెరికా నుంచి వచ్చింది. అమెరికాలో ఉన్న రామభక్తుడు (పేరు వెల్లడించలేదు) ఆలయ ట్రస్టుకు విరాళంగా రూ.11,000 పంపారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రచారాన్నిఅప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2021, జనవరి 14న ప్రారంభించారు. రామ మందిరానికి విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి రామ్‌నాథ్ కోవింద్. ఆయన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెక్కు రూపంలో రూ. 5 లక్షలు విరాళంగా అందించారు.
ఇది కూడా చదవండి: నేటి నుంచి రామోత్సవాలు.. 35 వేల కళాకారుల ప్రదర్శనలు!
Comments
Please login to add a commentAdd a comment