జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అన్ని దేవాలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించనున్నారు. అంతే కాకుండా ఆలయాల్లో రామచరిత మానసను పారాయణం చేయడంతోపాటు రామచరిత మానస ప్రతులను పంపిణీ చేయనున్నారు.
శ్రీ రాంలీలా మహాసంఘ్ నేతృత్వంలో ఢిల్లీలో 22న ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో శ్రీరాముని ఆరాధించే అవకాశం మనకు లభించబోతోందని అన్నారు. అందుకే ఆ రోజును చారిత్రాత్మకంగా మార్చేందుకు రామ్‌లీలా కమిటీలన్నీ తమ ప్రాంతాల్లోని ఆలయాలను రంగురంగుల దీపాలతో, పూలతో అలంకరించాలని నిర్ణయించాయన్నారు.
ఆలయాల వెలుపల పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా అయోధ్యలోని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నామన్నారు. అలాగే రామ్‌చరిత మానస కాపీలను రామ్‌లీలా కమిటీలు పంపిణీ చేస్తాయని తెలిపారు. ఆలయాల్లో 501 నెయ్యి దీపాలు వెలిగించనున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీని దీపావళిలా జరుపుకోవాలని రాజధానివాసులకు శ్రీ రాంలీలా మహాసంఘ్ పిలుపునిచ్చింది.
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానున్న సందర్భంగా సంపూర్ణ అనే సంస్థ ఆదివారం లోధీ గార్డెన్‌లో రాముని పెయింటింగ్ పోటీని నిర్వహించింది. దీనిలో పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. సుమారు వంద మంది చిన్నారులు శ్రీరాముడు, ఇతర దేవతల వేషధారణలతో కార్యక్రమానికి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment