
భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh)- లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)ల పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఏడాది జరగాల్సిన వీరి వివాహం (Wedding Postoponed) వచ్చే సంవత్సరంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన అతడు.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023లో ఐర్లాండ్‌తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.
ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్.. ఆయా ఫార్మాట్లలో 339, 41 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ ఇప్పటికి 58 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ కేకేఆర్ స్టార్.. 1099 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.
ఎంపీతో ప్రేమలో రింకూ
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన రింకూ.. కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 8న వీరి నిశ్చితార్థం జరిగింది. మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామంటూ రింకూ- ప్రియా తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జూన్ 8న నిశ్చితార్థం
ఇక లక్నోలోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రింకూ- ప్రియా ఉంగరాలు మార్చుకున్నారు. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో పాటు జయా బచ్చన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు వీరి ఎంగేజ్‌మెంట్‌కు హాజరయ్యారు.
ఈ క్రమంలో నవంబరు 18న తాజ్ హోటల్లో పెళ్లి వేడుకను జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అమర్ ఉజాలా న్యూస్‌పేపర్ కథనం ప్రకారం.. రింకూ- ప్రియాల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం.
కారణం ఇదే?
టీమిండియా క్రికెటర్‌గా రింకూ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది నవంబరులో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్