అది నిజమే.. కానీ..: రింకూ ‘ఎంగేజ్‌మెంట్‌’లో ట్విస్ట్‌! | Fact Check: Is Rinku Singh Engaged To MP Priya Saroj Her Father Reveal Truth | Sakshi
Sakshi News home page

అది నిజమే.. కానీ..: రింకూ ‘ఎంగేజ్‌మెంట్‌’లో ట్విస్ట్‌!

Published Sat, Jan 18 2025 10:25 AM | Last Updated on Sat, Jan 18 2025 11:37 AM

Fact Check: Is Rinku Singh Engaged To MP Priya Saroj Her Father Reveal Truth

రింకూ సింగ్‌- ప్రియా సరోజ్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రింకూ సింగ్‌(Cricketer Rinku Singh)కు ఎంపీ ప్రియా సరోజ్‌(Priya Saroj)తో నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్ని ప్రియా తండ్రి తుఫానీ సరోజ్‌ ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య రింకూ- ప్రియల పెళ్లి గురించి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని.. అయితే, ఎంగేజ్‌మెంట్‌ మాత్రం కాలేదన్నారు.

పెళ్లి ముచ్చట్లు జరుగుతున్నాయి 
‘‘ప్రియ ప్రస్తుతం తిరువనంతపురంలో ఉంది. రింకూతో ఆమె నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇరు కుటుంబాలు ఈ విషయం గురించి చర్చిస్తున్నాయి. అయితే, రింకూ- ప్రియలపై పెళ్లిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు’’ అని తెలిపారు. రింకూ కుటుంబం నుంచే పెళ్లి ప్రతిపాదన వచ్చిందని తుఫానీ సరోజ్‌ ఈ సందర్భంగా తెలిపారు. 

విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వెలుగులోకి
మరోవైపు.. నిశ్చితార్ధం జరిగిందన్న వార్తలను రింకూ సింగ్‌ కుటుంబ సభ్యులు ఖండించడం గమనార్హం. కాగా ఐపీఎల్‌(IPL)లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్‌ కుర్రాడు రింకూ సింగ్‌. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది సత్తా చాటాడు. అద్భుతమైన షాట్లు, భారీ హిట్టింగ్‌తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. 

ఈ క్రమంలోనే అంతర్జాతీ క్రికెట్‌లోనూ అడుగుపెట్టాడు రింకూ సింగ్‌.  భారత జట్టు తరఫున ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ సింగ్‌... నయా ఫినిషర్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. 

ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్‌ ఇప్పటి వరకు 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌ మెగా వేలం-2025కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు అట్టిపెట్టుకుంది.

ఆ ఫొటోలతో బలపడిన ప్రచారం
అయితే, జీవితంలోనూ రింకూ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే రింకూ సోదరి నేహా సింగ్‌ తమ ఇంట్లో బంధువుల కోలాహలం నిండిన ఫొటోలు షేర్‌ చేసింది. 

తన అన్నయ్యను ప్రేమగా హత్తుకుని ఉన్న ఫొటోలు పంచుకుంటూ ప్రేమను కురిపిస్తున్నట్లుగా ఎమోజీలు జతచేసింది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ వర్గాల్లో రింకూ ఎంగేజ్‌మెంట్‌ వా ర్తలు విపరీతరం సర్క్యులేట్‌ అయ్యాయి.

యువ ఎంపీగా ప్రస్థానం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్‌తో త్వరలో రింకూ ఏడడుగులు వేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రియా సరోజ్‌ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.

కాగా ప్రియా సమాజ్‌వాదీ పార్టీ తరఫున 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. 25 ఏళ్ల వయసులోనే మచిలీషహర్‌ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. 

పార్లమెంట్లో తనదైన శైలిలో స్పీచ్‌లు ఇస్తూ యువ నేతల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రియా తండ్రి తుఫానీ సరోజ్‌ గతంలో మూడుసార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కేరాకట్‌ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.  ఆయనే స్వయంగా కూతురి ఎంగేజ్‌మెంట్‌ గురించి స్పందించడంతో వదంతులకు చెక్‌ పడింది.

చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్‌ చేయండి: సెహ్వాగ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement