ఎంపీతో రింకూ సింగ్‌ నిశ్చితార్థం? ఆమె ఎవరంటే? | Rinku Singh Gets Engaged to MP Priya Saroj: Reports Goes Viral | Sakshi
Sakshi News home page

ఎంపీతో రింకూ సింగ్‌ నిశ్చితార్థం? ఆమె ఎవరంటే?

Published Fri, Jan 17 2025 5:02 PM | Last Updated on Sat, Jan 18 2025 10:34 AM

Rinku Singh Gets Engaged to MP Priya Saroj: Reports Goes Viral

టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌(Cricketer Rinku Singh Engagement) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌(MP Priya Saroj)తో అతడి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రింకూ- ప్రియాల ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చెల్లెలితో రింకూ సింగ్‌

బంధువుల కోలాహలం
ఈ నేపథ్యంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అటు రింకూ గానీ.. ఇటు ప్రియా గానీ నిశ్చితార్థం విషయమై అధికారికంగా స్పందించలేదు. అయితే, రింకూ చెల్లెలు నేహా సింగ్‌(Neha Singh) తన అన్నతో కలిసి ఉన్న ఫొటోలను తాజాగా షేర్‌ చేసింది. 

ఇందులో బంధువుల కోలాహలంతో పాటు.. ఇల్లంతా అలంకరించినట్లుగా ‍కనిపిస్తోంది. దీనిని బట్టి నిశ్చితార్థం జరిగినట్లు నెటిజన్లు అంచనాకు వస్తున్నారు.

పేద కుటుంబంలో జన్మించిన రింకూ
కాగా ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని పేద కుటుంబంలో రింకూ కుమార్‌ సింగ్‌ జన్మించాడు. అతడి తండ్రి ఇంటింటికి గ్యాస్‌ సిలిండర్లు వేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కోసారి రింకూ కూడా తండ్రికి ఆరోగ్యం సహకరించనపుడు సిలిండర్లు వేసేవాడు. ఒకానొక సమయంలో స్వీపర్‌గానూ రింకూ పనిచేశాడు.

కోటీశ్వరుడిగా ఎదిగిన రింకూ
అయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా రింకూ మాత్రం క్రికెట్‌పై ప్రేమను వదులుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలుత ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఎంట్రీ ఇచ్చి నయా ఫినిషర్‌గా ఎదిగాడు. ఆర్థికంగానూ స్థిరపడ్డాడు.

ఇప్పటి వరకు భారత్‌ తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్‌ 30 టీ20లు, రెండు వన్డేలు ఆడి 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌ మెగా వేలం-2025కి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు రిటైన్‌ చేసుకుంది.

ఎవరీ ప్రియా సరోజ్‌?
ఇక ప్రియా సరోజ్‌ విషయానికొస్తే.. వారణాసిలో 1998లో జన్మించిన ఆమె.. న్యూఢిల్లీలోని ఎయిర్‌ ఫోర్స్‌ గోల్డెన్‌ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. అనంతరం.. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.

రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్‌ 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. మచ్లిశహర్‌ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తన ప్రత్యర్థి బీపీ సరోజ్‌పై 35850 ఓట్ల తేడాతో విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 

ప్రియా సరోజ్‌ నికర ఆస్తుల విలువ రూ. 11.3 లక్షలుగా సమాచారం. ఇక ప్రియా తండ్రి తూఫానీ సరోజ్‌ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, రింకూ- ప్రియల నిశ్చితార్థ వార్తలను తూఫానీ సరోజ్‌ తాజాగా ఖండించారు.

చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్‌ చేయండి: సెహ్వాగ్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement