
విధ్వంసకర బ్యాటింగ్‌తో పరిమిత ఓవర్ల ఆటగాడిగా ముద్ర వేసుకున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్.. టెస్ట్ క్రికెట్‌కు సైతం సై అనేలా కనిపిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా కేరళతో ఇవాళ (జనవరి 5) మొదలైన మ్యాచ్‌లో రింకూ (ఉత్తర్‌ప్రదేశ్) ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ 71 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 103 బంతులు ఎదుర్కొన్న రింకూ 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన ఇన్నింగ్స్‌ను అద్భుతంగా మలచుకోవడమే కాకుండా జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 124 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన దశలో దృవ్ జురెల్‌తో (54 నాటౌట్) జతకట్టిన రింకూ 100 పరుగుల అజేయమైన భాగస్వామ్యాన్ని జోడించి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 64 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. రింకూ సింగ్, దృవ్ జురెల్‌తో పాటు ప్రియం గార్గ్ (44), కెప్టెన్ ఆర్యన్ జుయల్ (28), సమీర్ రిజ్వి (26) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఓపెనర్ సమర్థ్ సింగ్ (10), ఆక్ష్‌దీప్ నాథ్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి, నిధీష్, వైశాక్ చంద్రన్, జలజ్ సక్సేనా, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు.