
విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy 2024-25)లో తమిళనాడు బ్యాటర్ షారుఖ్ ఖాన్(Shahrukh Khan) అద్భుత శతకంతో మెరిశాడు. విధ్వంసకర ఆట తీరుతో ఉత్తరప్రదేశ్ జట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి తమిళనాడుకు భారీ విజయం అందించాడు.
విశాఖ వేదికగా
కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(వీహెచ్‌టీ)లో గ్రూప్-‘డి’లో తమిళనాడు గురువారం నాటి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్(యూపీ)తో తలపడింది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 47 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు.
ఇక విశాఖలో టాస్ గెలిచిన యూపీ.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 47 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.
టాపార్డర్‌లో ఓపెనర్లు నారాయణ్ జగదీశన్(0) డకౌట్ కాగా.. తుషార్ రహేజా(15), ప్రదోష్ పాల్(0) కూడా విఫలమయ్యారు. ఇక మిడిలార్డర్‌లో బాబా ఇంద్రజిత్(27), విజయ్ శంకర్(16) కూడా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న షారుఖ్ ఖాన్ యూపీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
శతక్కొట్టిన షారుఖ్.. అలీ హాఫ్ సెంచరీ
ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన షారుఖ్.. 85 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా ఏడో నంబర్ బ్యాటర్ మొహమద్ అలీ(75 బంతుల్లో 76 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించాడు. ఫలితంగా తమిళనాడు మెరుగైన స్కోరు సాధించింది.
హాఫ్ సెంచరీ చేసినా రింకూకు షాక్!
ఇక లక్ష్య ఛేదనలో యూపీ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి(14), ఆర్యన్ జుయాల్(8)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ కరణ్ శర్మ(8) కూడా విఫలమయ్యాడు. నితీశ్ రాణా(17) చేతులెత్తేయగా.. ప్రియమ్ గార్గ్(48), కెప్టెన్ రింకూ సింగ్(Rinku Singh- 55) రాణించారు. అయితే, లోయర్ ఆర్డర్‌లో విప్రజ్ నిగమ్(2), సౌరభ్ కుమార్(7), శివం మావి(2), యశ్ దయాల్(1), ఆకిబ్ ఖాన్(0 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
114 పరుగుల భారీ తేడాతో ఘన విజయం
ఈ నేపథ్యంలో 32.5 ఓవర్లలో 170 పరుగులకే యూపీ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా తమిళనాడు 114 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ రెండేసి వికెట్లు తీయగా.. సీవీ అచ్యుత్, మొహమద్ అలీ, కెప్టెన్ ఆర్. సాయి కిషోర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
కాగా విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్‌లో తమిళనాడు తొలుత చండీగఢ్‌తో తలపడగా.. వర్షం వల్ల టాస్ పడకుండానే మ్యాచ్ ముగిసింది. తాజాగా రెండో మ్యాచ్‌లో యూపీని మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. ఇదిలా ఉంటే...‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షారుఖ్ ఖాన్‌కు లిస్ట్-‘ఎ’ క్రికెట్‌లో ఇదే తొలి శతకం కావడం విశేషం.
చదవండి: IND Vs AUS 4th Test: చరిత్ర సృష్టించిన ఆసీస్ యువ ఓపెనర్.. 95 ఏళ్ల రికార్డు బద్దలు