అయోధ్యలోని నూతన రామాలయాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రామమందిరం గురించి ప్రస్తావించినప్పుడల్లా డాక్టర్ మురళీ మనోహర్ జోషి పేరు గుర్తుకు వస్తుంటుంది. నిజానికి రామాలయ నిర్మాణం వెనుక పెద్ద పోరాటమే జరిగింది. రామాలయ కలను సాకారం చేసుకునే దిశలో కొందరు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఈ పోరాటంలో జైలుకు కూడా వెళ్లారు. అలాంటి వారిలో ఒకరే డాక్టర్ మురళీ మనోహర్ జోషి.
మురళీ మనోహర్ జోషి 1934 జనవరి 5న నైనిటాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి పేరు మన్మోహన్ జోషి. తల్లి పేరు చంద్రావతి జోషి. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మురళీ మనోహర్ జోషి 1956లో తర్ల జోషిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నివేదిత, ప్రియంవద అనే ఇద్దరు కుమార్తెలున్నారు.
మురళీ మనోహర్ జోషి అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్‌సీ పూర్తి చేశారు. అక్కడే డాక్టరేట్ పట్టా కూడా అందుకున్నారు. అతని పరిశోధనా పత్రం స్పెక్ట్రోస్కోపీకి సంబంధించినది. హిందీ భాషలో పరిశోధనా పత్రాన్ని సమర్పించిన మొదటి పరిశోధకుడు మురళి. పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత, జోషి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్‌గా ఉద్యోగం ప్రారంభించారు. అదే సమయంలో మురళీ మనోహన్ జోషి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు. ఆయన చిన్న వయసులోనే గోసంరక్షణ ఉద్యమం(1953-54), 1955లో యూపీలో జరిగిన కుంభ్ కిసాన్ ఉద్యమంలో పాల్గొన్నారు.
1980లో మురళీ మనోహర్ జోషి భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పార్టీకి అధ్యక్షునిగా పనిచేశారు. 1996లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి 13 రోజులపాటు కొనసాగినప్పుడు ఆయనకు హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణాన్ని కూల్చివేసినప్పుడు, మురళీ మనోహర్ జోషిని కూడా అరెస్టు చేశారు.
దీనికిముందు కరసేవ కోసం చేపట్టిన రథయాత్రలో మురళీ మనోహర్ జోషి ప్రసంగించిన తీరు అయోధ్య చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘రామాలయం నిర్మితమవుతుంది. దీనిని ఏ శక్తి ఆపలేదు’ అని అన్నారు. ఆయన పలికిన ఈ మాటలు లక్షలాది కరసేవకులలో ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తియ్యింది.
ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మురళీ మనోహర్ జోషి హాజరుకానున్నారు. అయోధ్య రామాలయ ఉద్యమంలో మురళీ మనోహర్ జోషితో పాటు లాల్ కృష్ణ అద్వానీ, ఉమాభారతి, విశ్వహిందూ పరిషత్ దివంగత నేత అశోక్ సింఘాల్ తదితరులు కీలకపాత్ర పోషించారు. కాగా మురళీ మనోహర్ జోషి 2014లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment