
2019 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన ‘రామ జన్మభూమి’ తీర్పు రామభక్తులకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. 2020 ఆగస్ట్ 5న ప్రధాని నరేంద్ర మోదీ నూతన రామాలయ భూమి పూజను నిర్వహించడంతో రామ భక్తులు సంబరాలు చేసుకున్నారు. ఇక ఇప్పుడు రాబోయే 22న నూతన రామాలయం ప్రారంభం కానుండటంతో రామభక్తులు పెద్దఎత్తున పండుగ చేసుకోబోతున్నారు.
2024, జనవరి 22.. ఈ తేదీ చరిత్ర పుటల్లో నమోదుకానుంది. శ్రీ రాముడు ఆ రోజున దివ్యమైన రామాలయంలో కొలువుదీరనున్నాడు. ఈ నేపధ్యంలో పలువురు భక్తులు రాములోరికి విలువైన కానుకలు సమర్పిస్తున్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే భక్తులకు ‘దేవ్రహా బాబా’ లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ ప్రసాదాన్ని స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు.
‘దేవ్రహా బాబా’ రామ మందిర నిర్మాణాన్ని ముందే ఊహించిన సాధువు. శ్రీరాముడు జన్మించిన ప్రదేశం ఇదేనని ఆయనే తెలియజేశారు. శ్రీరామునికి భోగంగా సమర్పించేందుకు 44 క్వింటాళ్ల లడ్డూలను దేశీ నెయ్యితో తయారు చేస్తున్నామని, ఒక్క చుక్క నీరు కూడా వాడలేదని దేవ్రహ బాబా శిష్యులు తెలిపారు. ఈ లడ్డూలు ఆరు నెలల వరకూ చెడిపోవని పేర్కొన్నారు.
ఈ లడ్డూలను వెండి పళ్లెంలో రామ్‌లల్లాకు నైవేద్యంగా సమర్పిస్తామన్నారు. అనంతరం వీటిని భక్తులకు ప్రసాదంలా పంపిణీ చేయనున్నామన్నారు. 44 క్వింటాళ్ల బరువు కలిగిన ఒక వేయి 111 లడ్డూలను తయారు చేస్తున్నామన్నారు. శ్రీరామునికి ఈ విధమైన సేవ చేయడం తమకు ఎంతో ఆనందదాయకంగా ఉందని దేవ్రహ బాబా శిష్యులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యలో హోటల్ గది అద్దెలు ఆకాశానికి!
Comments
Please login to add a commentAdd a comment