అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయ ప్రారంభోత్సవం జరగనుంది. అదేరోజు ఆలయంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. సుప్రసిద్ధ మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ అయోధ్యలో కొలువుదీరే బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ నేపధ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఆరు నెలల మౌనదీక్ష
అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో నెలల తరబడి తన కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడకుండా, ఎంతో దీక్షతో ఈ కార్యాన్ని నెరవేర్చారని ట్రస్ట్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. విగ్రహ తయారీలో అరుణ్ యోగిరాజ్ పూర్తి అంకితభావాన్ని ప్రదర్శించారని తెలిపింది.
కుటుంబానికి దూరంగా..
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో విగ్రహ నిర్మాణ సమయంలో అరుణ్ యోగిరాజ్ చూపిన ఏకాగ్రత, కనబరిచిన త్యాగం అమోఘమని అన్నారు. విగ్రహం తయారు చేసే సమయంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులకు కూడా ఆయన దూరంగా ఉన్నారని చంపత్ రాయ్ తెలిపారు. చివరికి తన పిల్లల ముఖాలు కూడా చూడలేదని, మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించలేదని పేర్కొన్నారు.
శంకరాచార్యుల విగ్రహం కూడా..
అరుణ్ యోగిరాజ్‌కు విగ్రహాల తయారీతో అమితమైన అనుబంధం ఉందన్నారు. వారి పూర్వీకులు కూడా శిల్పకళా నైపుణ్యం కలిగినవారేనన్నారు. కాగా కేదార్‌నాథ్‌లోని శంకరాచార్యుల విగ్రహం, ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.
ఇంటిలో సంక్రాంతి సంబరాలు
అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన బాలరాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్న నేపధ్యంలో అతని కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ నేపధ్యంలోనే వారంతా మకర సంక్రాంతిని అత్యంత వేడుకగా చేసుకున్నారు. ఈ సందర్భంగా శిల్పి అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి, భార్య విజేత యోగిరాజ్ మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ట్రస్ట్ ప్రకటన ఆనందదాయకం
అరుణ్ యోగిరాజ్ తల్లి సరస్వతి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజున శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ కుమారుని గురించి చేసిన ప్రకటన తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. రామ్‌లల్లా విగ్రహాన్ని చెక్కడానికి మైసూర్‌లోని హెగ్గదేవన్‌కోట్‌లోని కృష్ణ శిలను తమ కుమారుడు ఎంచుకున్నాడన్నారు. ఆ రాయిని శిల్పంగా మలిచేముందు తాను ఆ కృష్ణ శిలను పూజించానని తెలిపారు.
‘జీవితం సార్థకమైంది’
అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ తన భర్త చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ జీవితం సార్థకమైందన్నారు. తన భర్త అరుణ్ ఆరు నెలలపాటు అయోధ్యలో ఉన్న సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టంగా మారిందన్నారు. అయితే ఇప్పుడు తన భర్త రూపొందించిన విగ్రహం ఎంపిక కావడం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన భర్తను అభినందించడం ఆనందంగా ఉందన్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యకు వెళితే ఎంత ఖర్చవుతుంది? ఎక్కడ బస చేయాలి?
Comments
Please login to add a commentAdd a comment