రాముని మార్గంలో నడుద్దాం! | Sakshi Guest Column On Ayodhya Ram Mandir | Sakshi
Sakshi News home page

రాముని మార్గంలో నడుద్దాం!

Published Mon, Jan 22 2024 12:21 AM | Last Updated on Mon, Jan 22 2024 12:22 AM

Sakshi Guest Column On Ayodhya Ram Mandir

మన భారతదేశపు శతాబ్దిన్నర చరిత్ర విదేశీ దురాక్రమణదారులతో సాగించిన నిరంతర సంఘర్షణలతో నిండి ఉంది. ప్రారంభంలో కొద్దిమంది అప్పుడప్పుడు ఇక్కడి సంపదను దోచుకోవడం కోసం (సికందర్‌ దాడి) ఈ దేశంపై దాడి చేసేవారు. కానీ ఆ తరువాత ఇస్లాం పేరున పశ్చిమం నుండి సాగిన దాడులు ఇక్కడి సమాజాన్ని తీవ్రంగా నష్టపరచడమేకాక వేర్పాటువాద ధోరణిని కూడా తీసుకువచ్చాయి. సమాజంలో నిరాశ, నిస్పృహ, పరాజయ భావాలను నింప డానికి విదేశీ దురాక్రమణదారులు ఇక్కడి ధార్మిక స్థలాలు, మందిరాలపై దాడి చేసి, వాటిని ధ్వంసం చేశారు. ఇలా ఒక్కసారి కాదు, అనేకసార్లు జరిగింది. ఈ విధంగా భారతీయ సమాజాన్ని బలహీనపరచి దీర్ఘకాలం ఇక్కడ రాజ్యం చేయా లన్నది వారి ప్రయత్నం. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని కూడా ఇదే ఉద్దేశ్యంతో, లక్ష్యంతో ధ్వంసం చేశారు. దురా క్రమణకారుల ఈ లక్ష్యం కేవలం ఒక మందిరానికే పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టు కోవాలన్నది వారి అసలు ఉద్దేశ్యం. 

ఈ దేశానికి చెందిన రాజులు ఎప్పుడూ, ఏ దేశంపైనా దురాక్రమణ చేయలేదు. కానీ ప్రపంచంలోని మిగిలిన దేశాలకు చెందిన రాజులు మాత్రం అటువంటి దాడులు, దురాక్రమణలకు పాల్పడ్డారు. అయినా ఏ పాలకుడూ భారత్‌పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించలేకపోయాడు. భారతీయ సమాజం ఎప్పుడూ ఈ దురాక్రమణదారుల ముందు తలవంచలేదు. వీరిని ఎదుర్కొనేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. అయోధ్య జన్మస్థానాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ భవ్యమైన రామమందిరాన్ని పునర్నిర్మించడానికి నిరంతర ప్రయత్నం సాగుతూనే వచ్చింది. అనేక యుద్ధాలు, సంఘర్షణ, బలిదానాలు జరిగాయి. రామజన్మభూమిలో మందిర నిర్మాణ సంకల్పం హిందువుల మనస్సుల నుండి ఎప్పుడూ తొలగిపోలేదు. 

1857లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రణాళిక వేసుకున్నప్పుడు హిందువులు, ముస్లింలు కలిసే ఆ పని చేశారు. అప్పటివరకూ ఇద్దరూ ఆలో చనలు పంచుకునేవారు. అప్పుడు గోవధ నిషేధం, రామజన్మభూమి గురించి రెండు వర్గాల మధ్య ఒక అంగీకారం కుదిరే పరిస్థితి ఏర్పడి ఉంది. తన ప్రమాణపత్రంలో గోవధ నిషేధం అమలు గురించి కూడా బహదూర్‌ షా జాఫర్‌ పేర్కొన్నారు. అందు వల్లనే సమాజం మొత్తం ఒకటిగా నిలచి పోరాడింది. భారతీయులందరూ వీరోచితంగా పోరాడినా దుర దృష్టవశాత్తూ ఆ యుద్ధం విఫలమైంది. దానితో బ్రిటిష్‌ పాలన కొనసాగింది. అయితే రామ జన్మ భూమి ముక్తి పోరాటం మాత్రం ఆగలేదు. బ్రిటిష్‌ వాళ్ళు మొదటి నుండి అనుసరిస్తూ వచ్చిన ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని ఆ తరువాత మరింతగా అమలుచేశారు. సమాజంలోని ఐకమత్యాన్ని నాశనం చేయడం కోసం బ్రిటిష్‌ వాళ్ళు స్వతంత్ర వీరులను అయోధ్యలో ఉరితీశారు. అయినా అయోధ్య ముక్తి పోరాటం ఆగలేదు. 

1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సోమనాథ మందిర జీర్ణోద్ధరణ జరగడంతో ఇటు వంటి దేవాలయాల గురించి చర్చ మళ్ళీ ప్రారంభమయింది. రామజన్మభూమి ముక్తి గురించి అందరి ఆమోదం, అంగీకారం సాధించే అవకాశం అప్పుడు వచ్చినా రాజకీయాలు మరోదారి పట్టాయి. విచ్ఛిన్న వాదం, ప్రాంతీయవాదం వంటివి రాజకీయాల ముసుగులో పెచ్చరిల్లాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ విషయమై హిందువుల మనోభావాలను పట్టించు కోకపోగా వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం ప్రజలు చేసిన ప్రయత్నాలను కూడా ముందుకు సాగనివ్వలేదు. ఈ విషయమై స్వాతంత్య్రానికి ముందు నుండి సాగుతూ వచ్చిన న్యాయపోరాటాన్ని కొనసాగించారు. రామజన్మభూమి విముక్తి కోసం ప్రజా ఉద్యమం 1980 తరువాత ఊపందుకుంది. అప్పటి నుండి మూడు దశాబ్దాల పాటు సాగింది. 

1949లో జన్మభూమిలో భగవాన్‌ శ్రీరామచంద్రుని విగ్రహం వెలిసింది. 1986లో కోర్టు ఆదేశం మేరకు ఆలయ తాళాలు తెరిచారు. ఆ తరువాత అనేక ఉద్యమాలు, రెండుసార్లు కరసేవ వంటి కార్య క్రమాల ద్వారా హిందూ సమాజపు నిరంతర సంఘర్షణ కొనసాగింది. 2010లో అలహాబాద్‌ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఆ తరువాత ఈ విషయంలో అంతిమ తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువరించాలంటూ కోర్టుకు పదేపదే అభ్యర్థనలు వెళ్ళాయి. చివరికి హిందూ సమాజపు 30 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తరువాత 2019 నవంబర్‌ 9న అన్ని సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు సముచితమైన, సంతులితమైన తీర్పును ప్రకటించింది. రెండు పక్షాల మనోభావాలు, సాక్ష్యాధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి అన్ని పక్షాల వాదనలను కూడా పూర్తిగా విన్న తరువాత తీర్పునిచ్చింది. ఈ తీర్పును అనుసరించి మందిర నిర్మాణం కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. 2020 ఆగస్ట్‌ 5న మందిర భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు పుష్య మాస శుక్లపక్ష ద్వాదశి, యుగాబ్ది 5125... 2024 జనవరి 22న శ్రీ రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

ధార్మిక దృష్టితో చూస్తే శ్రీరాముడు ఈ దేశంలో అధిక సంఖ్యాకులకు ఆరాధ్య దేవుడు. ఆయన జీవితం ఆదర్శప్రాయమనీ, అనుసరణీయమనీ నేటికీ సమాజంలో అందరూ భావిస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమానికి సంబంధించి వస్తున్న చిన్నపాటి అభ్యంతరాలు, అనుమానాలను పూర్తిగా పక్కన పెట్టాలి. వివాదాలు, వాదనలు పూర్తిగా సమసిపోయేట్లు మేధావులు చూడాలి. అయోధ్య అంటే ‘యుద్ధం లేనిది’, ‘సంఘర్షణ లేని స్థానం’ అని అర్థం. సమాజంలోని ప్రతి ఒక్కరి మనస్సులలో అటువంటి అయోధ్య నిర్మాణం కావాలి. అది మనందరి కర్తవ్యం. 

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జాతి గౌరవ పునర్‌ జాగరణకు గుర్తు. ఇది శ్రీరాముని జీవితం ఇచ్చే సందేశాన్ని ఆధునిక సమాజం కూడా స్వీకరించిందనడానికి గుర్తు. శ్రీరామ మందిరంలో పత్రం, ఫలం, పుష్పంతో పూజతోపాటు రామదర్శనంతో మనస్సులో ఆయనను ఉంచుకుని ఆదర్శవంత మైన ఆచరణను అలవరచుకుని శ్రీరాముని పూజ చేయాలి. ఎందుకంటే ‘శివో భూత్వా శివం భజేత్, రామో భూత్వా రామం భజేత్‌’ (శివుడే తానై శివుని పూజించు, రాముడే తానై రాముడిని పూజించు) అనేదే నిజమైన పూజ అవుతుంది. 
భారతీయ సాంస్కృతిక దృష్టి ప్రకారం... 
మాతృవత్‌ పర దారేషు పర ద్రవ్యేషు లోష్టవత్‌ 
ఆత్మవత్‌ సర్వభూతేషు యః పశ్యతి సః పణ్డితాః

(పర స్త్రీని మాతృభావనతో చూడాలి. పరుల సొమ్మును మట్టిగా ఎంచాలి. సర్వ జీవులలో ఆత్మను చూడాలి అని పండితులు చెబుతారు.) ఈ విధంగా మనం శ్రీరాముని మార్గంలో నడవాలి. 

సత్యనిష్ఠ, బలపరాక్రమాలతోపాటు క్షమ, వినయం, అందరినీ సమాదరించే ధోరణి, కారుణ్యం, కర్తవ్య పాలనలో పట్టుదల వంటి శ్రీరామచంద్రుని గుణాలను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అలవ రచుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ తెచ్చుకోవాలి. ఇటువంటి క్రమశిక్షణ ద్వారానే రామలక్ష్మణులు 14 ఏళ్ల అరణ్యవాసాన్ని పూర్తిచేయడమేకాక శక్తిశాలి రావణునితో పోరాడి విజయం సాధించారు. శ్రీరాముని జీవితంలో కనిపించే న్యాయబుద్ధి, కరుణ, సద్భావం, నిష్పక్షపాత ధోరణి వంటి సామాజిక గుణాలను తిరిగి ఈ సమాజంలో పాదుకొల్పాలి. శోషణ లేని, సమాన న్యాయం లభించే సమాజాన్ని, శక్తితోపాటు కరుణ నిండిన ఒక సమాజాన్ని నిర్మించడమే శ్రీరాముని నిజమైన పూజ అవుతుంది. 

అహంకారం, స్వార్థం, భేదభావాల మూలంగా ప్రపంచం వినాశం వైపు పరుగులు తీస్తోంది. ఎన్నో ఆపదలను కొనితెచ్చుకుంటోంది. సద్భావన, ఏకత, ప్రగతి, శాంతి వంటి మార్గాన్ని చూపిన జగద భిరాముని ఆదర్శం సర్వకల్యాణకారి, ‘సర్వేషాం అవిరోధి’ (ఎవరితోనూ విరోధం లేని) అయిన సమాజ నిర్మాణపు ప్రారంభానికి దారి చూపాలి. ఆ మహా ప్రయత్నానికి శ్రీ రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ నాంది కావాలి. మనమంతా ఆ ప్రయత్నంలో, ఆ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. జనవరి 22న జరిగే ఉత్సవంలో పాల్గొని మందిర పునర్నిర్మాణ కార్యంతో భారత్, తద్వారా ప్రపంచపు పునర్నిర్మాణ సంకల్పం చేపడదాం. ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకుని ముందుకు నడుద్దాం!

డా‘‘ మోహన్‌ భాగవత్‌ 
వ్యాసకర్త ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ సంఘచాలక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement