mohan bhagavath
-
రాముని మార్గంలో నడుద్దాం!
మన భారతదేశపు శతాబ్దిన్నర చరిత్ర విదేశీ దురాక్రమణదారులతో సాగించిన నిరంతర సంఘర్షణలతో నిండి ఉంది. ప్రారంభంలో కొద్దిమంది అప్పుడప్పుడు ఇక్కడి సంపదను దోచుకోవడం కోసం (సికందర్ దాడి) ఈ దేశంపై దాడి చేసేవారు. కానీ ఆ తరువాత ఇస్లాం పేరున పశ్చిమం నుండి సాగిన దాడులు ఇక్కడి సమాజాన్ని తీవ్రంగా నష్టపరచడమేకాక వేర్పాటువాద ధోరణిని కూడా తీసుకువచ్చాయి. సమాజంలో నిరాశ, నిస్పృహ, పరాజయ భావాలను నింప డానికి విదేశీ దురాక్రమణదారులు ఇక్కడి ధార్మిక స్థలాలు, మందిరాలపై దాడి చేసి, వాటిని ధ్వంసం చేశారు. ఇలా ఒక్కసారి కాదు, అనేకసార్లు జరిగింది. ఈ విధంగా భారతీయ సమాజాన్ని బలహీనపరచి దీర్ఘకాలం ఇక్కడ రాజ్యం చేయా లన్నది వారి ప్రయత్నం. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని కూడా ఇదే ఉద్దేశ్యంతో, లక్ష్యంతో ధ్వంసం చేశారు. దురా క్రమణకారుల ఈ లక్ష్యం కేవలం ఒక మందిరానికే పరిమితం కాలేదు. మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టు కోవాలన్నది వారి అసలు ఉద్దేశ్యం. ఈ దేశానికి చెందిన రాజులు ఎప్పుడూ, ఏ దేశంపైనా దురాక్రమణ చేయలేదు. కానీ ప్రపంచంలోని మిగిలిన దేశాలకు చెందిన రాజులు మాత్రం అటువంటి దాడులు, దురాక్రమణలకు పాల్పడ్డారు. అయినా ఏ పాలకుడూ భారత్‌పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించలేకపోయాడు. భారతీయ సమాజం ఎప్పుడూ ఈ దురాక్రమణదారుల ముందు తలవంచలేదు. వీరిని ఎదుర్కొనేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. అయోధ్య జన్మస్థానాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని అక్కడ భవ్యమైన రామమందిరాన్ని పునర్నిర్మించడానికి నిరంతర ప్రయత్నం సాగుతూనే వచ్చింది. అనేక యుద్ధాలు, సంఘర్షణ, బలిదానాలు జరిగాయి. రామజన్మభూమిలో మందిర నిర్మాణ సంకల్పం హిందువుల మనస్సుల నుండి ఎప్పుడూ తొలగిపోలేదు. 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రణాళిక వేసుకున్నప్పుడు హిందువులు, ముస్లింలు కలిసే ఆ పని చేశారు. అప్పటివరకూ ఇద్దరూ ఆలో చనలు పంచుకునేవారు. అప్పుడు గోవధ నిషేధం, రామజన్మభూమి గురించి రెండు వర్గాల మధ్య ఒక అంగీకారం కుదిరే పరిస్థితి ఏర్పడి ఉంది. తన ప్రమాణపత్రంలో గోవధ నిషేధం అమలు గురించి కూడా బహదూర్ షా జాఫర్ పేర్కొన్నారు. అందు వల్లనే సమాజం మొత్తం ఒకటిగా నిలచి పోరాడింది. భారతీయులందరూ వీరోచితంగా పోరాడినా దుర దృష్టవశాత్తూ ఆ యుద్ధం విఫలమైంది. దానితో బ్రిటిష్ పాలన కొనసాగింది. అయితే రామ జన్మ భూమి ముక్తి పోరాటం మాత్రం ఆగలేదు. బ్రిటిష్ వాళ్ళు మొదటి నుండి అనుసరిస్తూ వచ్చిన ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని ఆ తరువాత మరింతగా అమలుచేశారు. సమాజంలోని ఐకమత్యాన్ని నాశనం చేయడం కోసం బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర వీరులను అయోధ్యలో ఉరితీశారు. అయినా అయోధ్య ముక్తి పోరాటం ఆగలేదు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సోమనాథ మందిర జీర్ణోద్ధరణ జరగడంతో ఇటు వంటి దేవాలయాల గురించి చర్చ మళ్ళీ ప్రారంభమయింది. రామజన్మభూమి ముక్తి గురించి అందరి ఆమోదం, అంగీకారం సాధించే అవకాశం అప్పుడు వచ్చినా రాజకీయాలు మరోదారి పట్టాయి. విచ్ఛిన్న వాదం, ప్రాంతీయవాదం వంటివి రాజకీయాల ముసుగులో పెచ్చరిల్లాయి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ విషయమై హిందువుల మనోభావాలను పట్టించు కోకపోగా వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం ప్రజలు చేసిన ప్రయత్నాలను కూడా ముందుకు సాగనివ్వలేదు. ఈ విషయమై స్వాతంత్య్రానికి ముందు నుండి సాగుతూ వచ్చిన న్యాయపోరాటాన్ని కొనసాగించారు. రామజన్మభూమి విముక్తి కోసం ప్రజా ఉద్యమం 1980 తరువాత ఊపందుకుంది. అప్పటి నుండి మూడు దశాబ్దాల పాటు సాగింది. 1949లో జన్మభూమిలో భగవాన్ శ్రీరామచంద్రుని విగ్రహం వెలిసింది. 1986లో కోర్టు ఆదేశం మేరకు ఆలయ తాళాలు తెరిచారు. ఆ తరువాత అనేక ఉద్యమాలు, రెండుసార్లు కరసేవ వంటి కార్య క్రమాల ద్వారా హిందూ సమాజపు నిరంతర సంఘర్షణ కొనసాగింది. 2010లో అలహాబాద్ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఆ తరువాత ఈ విషయంలో అంతిమ తీర్పు సాధ్యమైనంత త్వరగా వెలువరించాలంటూ కోర్టుకు పదేపదే అభ్యర్థనలు వెళ్ళాయి. చివరికి హిందూ సమాజపు 30 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తరువాత 2019 నవంబర్ 9న అన్ని సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు సముచితమైన, సంతులితమైన తీర్పును ప్రకటించింది. రెండు పక్షాల మనోభావాలు, సాక్ష్యాధారాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాగే ఈ కేసుకు సంబంధించి అన్ని పక్షాల వాదనలను కూడా పూర్తిగా విన్న తరువాత తీర్పునిచ్చింది. ఈ తీర్పును అనుసరించి మందిర నిర్మాణం కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. 2020 ఆగస్ట్ 5న మందిర భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు పుష్య మాస శుక్లపక్ష ద్వాదశి, యుగాబ్ది 5125... 2024 జనవరి 22న శ్రీ రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ధార్మిక దృష్టితో చూస్తే శ్రీరాముడు ఈ దేశంలో అధిక సంఖ్యాకులకు ఆరాధ్య దేవుడు. ఆయన జీవితం ఆదర్శప్రాయమనీ, అనుసరణీయమనీ నేటికీ సమాజంలో అందరూ భావిస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమానికి సంబంధించి వస్తున్న చిన్నపాటి అభ్యంతరాలు, అనుమానాలను పూర్తిగా పక్కన పెట్టాలి. వివాదాలు, వాదనలు పూర్తిగా సమసిపోయేట్లు మేధావులు చూడాలి. అయోధ్య అంటే ‘యుద్ధం లేనిది’, ‘సంఘర్షణ లేని స్థానం’ అని అర్థం. సమాజంలోని ప్రతి ఒక్కరి మనస్సులలో అటువంటి అయోధ్య నిర్మాణం కావాలి. అది మనందరి కర్తవ్యం. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం జాతి గౌరవ పునర్ జాగరణకు గుర్తు. ఇది శ్రీరాముని జీవితం ఇచ్చే సందేశాన్ని ఆధునిక సమాజం కూడా స్వీకరించిందనడానికి గుర్తు. శ్రీరామ మందిరంలో పత్రం, ఫలం, పుష్పంతో పూజతోపాటు రామదర్శనంతో మనస్సులో ఆయనను ఉంచుకుని ఆదర్శవంత మైన ఆచరణను అలవరచుకుని శ్రీరాముని పూజ చేయాలి. ఎందుకంటే ‘శివో భూత్వా శివం భజేత్, రామో భూత్వా రామం భజేత్’ (శివుడే తానై శివుని పూజించు, రాముడే తానై రాముడిని పూజించు) అనేదే నిజమైన పూజ అవుతుంది. భారతీయ సాంస్కృతిక దృష్టి ప్రకారం... మాతృవత్ పర దారేషు పర ద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సః పణ్డితాః (పర స్త్రీని మాతృభావనతో చూడాలి. పరుల సొమ్మును మట్టిగా ఎంచాలి. సర్వ జీవులలో ఆత్మను చూడాలి అని పండితులు చెబుతారు.) ఈ విధంగా మనం శ్రీరాముని మార్గంలో నడవాలి. సత్యనిష్ఠ, బలపరాక్రమాలతోపాటు క్షమ, వినయం, అందరినీ సమాదరించే ధోరణి, కారుణ్యం, కర్తవ్య పాలనలో పట్టుదల వంటి శ్రీరామచంద్రుని గుణాలను వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అలవ రచుకునే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ తెచ్చుకోవాలి. ఇటువంటి క్రమశిక్షణ ద్వారానే రామలక్ష్మణులు 14 ఏళ్ల అరణ్యవాసాన్ని పూర్తిచేయడమేకాక శక్తిశాలి రావణునితో పోరాడి విజయం సాధించారు. శ్రీరాముని జీవితంలో కనిపించే న్యాయబుద్ధి, కరుణ, సద్భావం, నిష్పక్షపాత ధోరణి వంటి సామాజిక గుణాలను తిరిగి ఈ సమాజంలో పాదుకొల్పాలి. శోషణ లేని, సమాన న్యాయం లభించే సమాజాన్ని, శక్తితోపాటు కరుణ నిండిన ఒక సమాజాన్ని నిర్మించడమే శ్రీరాముని నిజమైన పూజ అవుతుంది. అహంకారం, స్వార్థం, భేదభావాల మూలంగా ప్రపంచం వినాశం వైపు పరుగులు తీస్తోంది. ఎన్నో ఆపదలను కొనితెచ్చుకుంటోంది. సద్భావన, ఏకత, ప్రగతి, శాంతి వంటి మార్గాన్ని చూపిన జగద భిరాముని ఆదర్శం సర్వకల్యాణకారి, ‘సర్వేషాం అవిరోధి’ (ఎవరితోనూ విరోధం లేని) అయిన సమాజ నిర్మాణపు ప్రారంభానికి దారి చూపాలి. ఆ మహా ప్రయత్నానికి శ్రీ రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ నాంది కావాలి. మనమంతా ఆ ప్రయత్నంలో, ఆ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. జనవరి 22న జరిగే ఉత్సవంలో పాల్గొని మందిర పునర్నిర్మాణ కార్యంతో భారత్, తద్వారా ప్రపంచపు పునర్నిర్మాణ సంకల్పం చేపడదాం. ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకుని ముందుకు నడుద్దాం! డా‘‘ మోహన్ భాగవత్ వ్యాసకర్త ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘచాలక్ -
సనాతన ధర్మం.. భారత్‌కు మారుపేరు: మోహన్ భగవత్
ఛండీగర్: సనాతన ధర్మం భారత్‌కు పర్యాయపదమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశ సంస్కృతి సనాతన ధర్మం మీదే ఆధారపడి ఉందని చెప్పారు. అలాంటి ధర్మాన్ని నాశనం చేయాలనుకోవడం స్వీయ హానితో సమానమని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతుండటం తెలిసిందే. వాటిని ఉద్దేశించి భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం హరియాణాలోని రోహతక్‌లో బాబా మస్త్‌నాథ్ మఠంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. సనాతనమంటేనే ఎప్పటికీ నిలిచి ఉండేదని, మన ధర్మం కూడా అంతేనని చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి వీకే సింగ్, యోగ గురు రామ్‌దేవ్, పలువురు సాధు ప్రముఖులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా పరిష్కారం కోసం అంతా భారత్‌కేసే చూస్తున్నారని ఆదిత్యనాథ్ అన్నారు. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అయోధ్య రామాలయ నిర్మాణం ఇప్పుడు కళ్లముందు కన్పిస్తున్న వాస్తమని చెప్పారు. అంతకుముందు ఉదయం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహంత్ చంద్‌నాథ్ యోగి విగ్రహాన్ని మఠంలో ఆవిష్కరించారు. ఇదీ చదవండి: గంగా జలంపై జీఎస్టీ.. ట్యాక్స్ బోర్డు ఏం చెప్పిందంటే.. -
దేశాభివృద్ధే అందరి లక్ష్యం కావాలి : మోహన్ భగవత్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు ఎప్పుడూ సమాజం కోసమే కృషి చేస్తారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. సరూర్‌నగర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ విజయం కోసం చేస్తున్న సంకల్పమని, సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ ప్రపంచ విజయాన్నే కోరుకుంటారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ను ప్రతి ఒక్కరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు. స్వార్థం కోసం కొంతమంది ప్రజల మధ్య విద్వేశాలు సృష్టిస్తున్నారని, దేశాభివృద్ధే అందరి లక్ష్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎదుటివారి వినాశనాన్ని కోరుకోవడం మంచిది కాదని, ఎప్పటికైనా ధర్మమే జయిస్తుందని, మన భారతీయులకు నాగరికత అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులేనని, మతాచారాలు వేరైనా అందరం భరతమాత బిడ్డలమేనని మోహన్ భగవత్ తెలిపారు. -
రద్దుల పద్దులో రిజర్వేషన్లు !
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం ప్రకారం లభిస్తున్న రిజర్వేషన్లపై దాపరికం లేకుండా చర్చించాల్సి ఉందని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో గత ఏడుదశాబ్దాలుగా దేశంలో అమలవుతూ వస్తున్న రిజర్వేషన్లు ప్రమాదంలో పడనున్నాయి. దేశంలో గోరక్షణ చట్టాల పేరుతో దళితుల, ఆదివాసీల, మైనారిటీల ఆహార ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన ప్రస్తుత పాలకులు ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశారు. తాజాగా ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి మంగళం పాడేశారు. ఇక రామమందిర నిర్మాణం. రిజర్వేషన్ చట్టం రద్దు వీరి కీలక ఎజెండాగా మారాయి. వీలైనంత త్వరలో రిజర్వేషన్ రద్దు బిల్లును కూడా కేంద్రం తీసుకు వచ్చే ప్రమాదం ఉంది. మనం ఇప్పుడు దళిత, ఓబీసీ, ఆదివాసీ, మైనారిటీ, శరణార్థుల హక్కులను రద్దు చేసే యుగంలో ఉంటున్నాం. ఇది మన ప్రజాస్వామ్యం నూతన దశ. ఆరెస్సెస్ రిజర్వేషన్లను వ్యతిరేకించే సంస్థగా ఉంటోంది. ఆ సంస్థ అధినేత మోహన్ భాగవత్‌కు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చాలా ప్రకటనలు చేసిన రికార్డు కూడా ఉంది. ఆగస్టు 19న ఆయన తాజా ప్రకటనలో రిజర్వేషన్ల సమస్యపై నిర్దిష్ట దిశలో తప్పక చర్చించాల్సిందేనని వక్కాణించారు. ’’ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్‌కు సంబంధించి దాపరికం లేకుండా చర్చించాల్సి ఉంద’’ని ఆరెస్సెస్ చీఫ్ చెప్పారు. ఆయన గతంలోనూ ఇలాంటి ప్రకటనలే చేసి ఉన్నారు. ఆరెస్సెస్ దీర్ఘకాలంగా తాను పెట్టుకుంటూ వచ్చిన అజెండాలను ఒక్కటొక్కటిగా మోదీ ప్రభుత్వం ద్వారా అమలు చేయిస్తోంది. పశువులను మేపే శూద్ర రైతుల ఆర్థిక వ్యవస్థను, దళిత, ఆదివాసీ, ముస్లింలు నిర్వహిస్తున్న ఆహార ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేందుకోసం గోరక్షణ చట్టాలను రూపొందించాల్సిందిగా అది రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చింది. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావలసిందిగా కూడా ఆరెస్సెస్ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ కోవలో తాజాగా ఆర్టికల్ 370కి కూడా మంగళం పాడేసింది. దాని దీర్ఘకాలిక ఎజెండా అమలుకు సంబంధించి మరో రెండు ప్రధాన సమస్యలు పెండింగులో ఉన్నాయి. అవి రామమందిర నిర్మాణంపై తీర్మానం. రిజర్వేషన్ చట్టాల రద్దు. సమీప భవిష్యత్తులోనే ఆరెస్సెస్ వీటి అమలుకు కూడా పావు కదపనుంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఓబీసీల ఓట్లను భారీగా రాబట్టుకున్న నరేంద్రమోదీని ఇప్పుడు రిజర్వేషన్ రద్దు చట్టాన్ని అమలు చేయాలని ఆరెస్సెస్ ఒత్తిడికి గురిచేయవచ్చు. ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదు. కాంగ్రెస్ వేదికలపై పనిచేస్తున్న రిజర్వేషన్ వ్యతిరేక మేధావులు రిజర్వేషన్ రద్దు చట్టాన్ని పూర్తిగా బలపరుస్తారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మనీష్ తివారీ, జనార్ధన్ ద్వివేదీలు రిజర్వేషన్లపై ఏ వైఖరితో ఉన్నారో దేశం మొత్తానికే తెలుసు. చాలామంది లౌకికవాద మేధావులు తమ హృదయంలో రిజర్వేషన్ల వ్యతిరేకులుగా ఉంటున్నారు.మోహన్ భాగవత్ తేలికగా తీసిపారవేయదగిన స్థాయి వ్యక్తి కాదు. బీజేపీ, ఆరెస్సెస్ యంత్రాంగాల్లో ఆయనకు చాలా పట్టుంది. తాను చంద్రగుప్తునికి కౌటిల్యుడి వంటివాడు. ముర అనే శూద్ర/ఓబీసీకి చెందిన మహిళ పుత్రుడే మౌర్యుడు. కులవ్యవస్థను వ్యవస్థీకృతం చేయడానికి అవసరమైన ప్రతి పనినీ, చర్యనూ కౌటిల్యుడు.. చంద్రగుప్త మౌర్యుడితో చేయించాడు. కులవ్యవస్థపై, మన విద్యా సంస్థల్లోని సైన్స్ వ్యతిరేక, మానవ వ్యతిరేక స్వభావంపై చర్చించాలని ఆరెస్సెస్ ఎన్నడూ కోరలేదు. పైగా శూద్రులకు, ఎస్సీలకు, ఆదివాసులకు ఎలాంటి హక్కులను ప్రసాదించని వేదాలు, రామాయణం, మహాభారతంపై చర్చించాలని ఈ సంస్థ కోరింది. ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ హిందూ మతంలో మానవ సమానత్వం గురించి ఎన్నడూ మాట్లాడిన పాపాన పోలేదు. హిందూ మతం నుంచి అంటరానితనాన్ని రద్దు చేయాలని ఒక్క ప్రకటన కూడా ఆయన విడుదల చేయలేదు. హిందూ మతం పరిధిలో శూద్రులకు, ఓబీసీలకు, ఆదివాసీలకు అర్చకత్వ హక్కులను కల్పించడమే ఆయన ఏనాడూ మాట్లాడలేదు. హిందూమతంలో పురుషులతోపాటు మహిళలకు కూడా సమాన హక్కులు ఇవ్వాలని తాను ఎప్పుడూ బహిరంగ ప్రకటన చేయలేదు. పైగా చరిత్రాత్మక పోరాటాల ద్వారా ప్రజలు సాధించుకున్న కొన్ని హక్కులను రద్దు చేయాలని బలంగా వాదించేవారు. కులవ్యవస్థ రద్దుపై మోహన్ భాగవత్ ఎన్నడూ ప్రకటించలేదు. హిందూమతంలోనూ వెలుపలా బ్రాహ్మణాధిపత్యాన్ని రద్దు చేయాలని అయన ఎన్నడూ మాట్లాడి ఉండలేదు. ప్రధానంగా దళితులు, ఓబీసీలే ఉంటున్న వ్యవసాయ కూలీల వేతనాలు పెంచడంపై తానెన్నడూ మాట్లాడింది లేదు. కానీ రిజర్వేషన్లపై తీవ్రంగా చర్చించాల్సి ఉందంటూ ఆయన పదే పదే మాట్లాడుతూ వచ్చారు.ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆరెస్సెస్ చీఫ్ ఏ కీలక ప్రకటన చేసినా ప్రధాని నరేంద్రమోదీ మాత్రం మౌనవ్రతం పాటిస్తుంటారు. ఆయన మౌనం తన గురువు ఆదేశాన్ని పూర్తిగా ఆమోదించడాన్నే సూచిస్తుంది. ఆరెస్సెస్‌లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సంస్థకు కండబలంగా మాత్రమే ఉంటున్నారు. పెద్దగురువు ఆదేశాలను ఏమాత్రం వ్యతిరేకించకుండా వీరికి పూర్తిగా బ్రెయిన్‌వాష్ చేస్తుంటారు. జాతి ప్రయోజనాల బట్టే ఆరెస్సెస్ పనిచేస్తుందని వీరికి నూరిపోస్తుంటారు. జాతి ప్రయోజనాలు సమాజంలోని విడి వర్గాల ప్రయోజనాలకు పైనే ఉంటాయి మరి. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలు హిందూ సమాజంలో విభాగాలు మాత్రమే. బ్రాహ్మణవాదపు ప్రతిభా మూర్తులే జాతికి ప్రతి బింబం అన్నమాట. దీన్ని ఏ పరిస్థితుల్లోనూ ఇబ్బందిపెట్టరాదు. సంఘ్ పరివార్‌లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చే సైద్ధాంతిక శిక్షణలో కులాలకు, కమ్యూనిటీలకు, మహిళలకు ఇవ్వాల్సిన సమాన హక్కుల కంటే దేశంలోని మైనారిటీ మతస్తులే అసలు శత్రువులని నూరిపోస్తుంటారు.ఏబీసీలకు చెందిన మన ప్రధాన మంత్రి కూడా దీనికి భిన్నంగా ఉండరు. రిజర్వేషన్ బిల్లు రద్దు కనుక పార్లమెంటు ముందుకు వస్తే దాన్ని ఆమోదింపచేసే బాధ్యత మోదీ మీదే ఉంది. పైగా దానికి అనుగుణంగా ఓట్లేయడానికి ప్రతిపక్ష పార్టీలనుంచి బొచ్చెడుమంది సభ్యులు క్రాస్ ఓటు వేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు కూడా. దేశంలో శూద్ర, ఓబీసీ, దళిత నేపథ్యంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీలకు మోహన్ భాగవత్ నిర్నిరోధక శక్తిని నిలువరించే సత్తా లేదు. శక్తివంతుడైన ఓబీసీ ప్రధానమంత్రి గత అయిదేళ్ల పాలనలో దేశంలోని మొత్తం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు వంటి అత్యున్నత విద్యాసంస్థలను రిజర్వేషన్ సమస్యపై మోహన్ భాగవత్‌ను అనుసరించే వ్యక్తుల చేతుల్లో పెట్టారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఐఐటీ, ఐఐఎమ్‌ల డైరెక్టర్లలో చాలామంది రిజర్వేషన్లపై ఆరెస్సెస్ అధినేత అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నవారే. చివరకు కమ్యూనిస్టులలో కూడా చాలామంది ఈ సిద్ధాంతాన్నే విశ్వసిస్తున్నారు. కులపరమైన అసమానతలకు సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు అనేక పార్టీల రాజకీయ సరిహద్దులు చెరిగిపోతుంటాయి. రిజర్వేషన్ బిల్లు తీరా పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజున మోహన్ భాగవత్ తన నిజమైన మిత్రులను తప్పక కనుగొంటారు. అదేసమయంలో అంబేడ్కర్, ఆయన అనుయాయులు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తుతుంటారు. ముస్లింలు అంతర్జాతీయ కమ్యూనిటికీ చెందినవారు కాబట్టి ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అదొక ప్రపంచ సమస్య అయిపోయింది. కానీ రిజర్వేషన్ల రద్దు చట్టం ఉనికిలోకి వచ్చినప్పుడు ఏ అంతర్జాతీయ వేదిక కూడా దానిగురించి చర్చించబోదు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు.. ముస్లింలలాగా అంతర్జాతీయ శక్తిగా లేరు. రిజర్వేషన్ల పరిధికి అవతల ఉన్న కులాల్లో రిజర్వేషన్ వ్యతిరేక సెంటిమెంట్ బీజేపీ అధికారంలోకి వచ్చాక బాగా పెరుగుతోంది. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఇప్పటివరకు ఇంగ్లిష్ చదివిన మేధో శక్తి దన్ను లేదు. సర్ సయ్యద్ హమద్, అలీగర్ ముస్లిం యూనివర్శిటీ ప్రభావ ఫలితంగా ముస్లింలు ఇంగ్లిష్ చదువుకున్న విద్యావంతుల వర్గంగా మారారు. కానీ అలాంటి సెక్షన్ దళితులకు, ఓబీసీలకు లేదు. రిజర్వేషన్ చట్టం రద్దుకు ఆరెస్సెస్ తప్పకుండా బలమైన పునాదిని సిద్ధం చేస్తుంటుంది. ప్రాచీనకాలపు వర్ణధర్మ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని గోల్వాల్కర్ తన ఒక పుస్తకంలో ప్రతిపాదించారు. మహాత్మాగాంధీ కూడా వర్ణధర్మ పునరుద్ధరణకు అనుకూలంగా వాదించారు కాబట్టి ఆరెస్సెస్ శక్తులు గాంధీ భావాల మద్దతును కూడా తీసుకోవచ్చు. ఆరెస్సెస్, బీజేపీలు రిజర్వేషన్ బిల్లు రద్దుకు పూనుకుంటే, సెక్యులర్ ముసుగులోని రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు చాలావరకు వారికి మద్దతు ఇస్తాయి. లౌకికవాదులు కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలను నిర్వహించినప్పుడు రిజర్వేషన్ల అమలుకు తిరస్కరించిన చరిత్ర కూడా ఉంది. నేడు ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఆరెస్సెస్, బీజేపీకి కొత్త మద్దతుదారులు చాలామంది దొరికారు. అలాగే రిజర్వేషన్ల రద్దు విషయంలోనూ ప్రతిపక్ష శిబిరం నుంచి వీరికి మరింత మద్దతు లభించవచ్చు కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ఇప్పుడు దళిత, ఓబీసీ, ఆదివాసీ, మైనారిటీ, శరణార్థుల హక్కులను రద్దు చేసి యుగంలో ఉంటున్నాము. ఇది ప్రజాస్వామ్యం నూతన దశ. ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ముగ్గురి చేతుల్లో దేశం బానిస
న్యూఢిల్లీ: బీజేపీ–ఆర్ఎస్ఎస్కు చెందిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ చేతుల్లో దేశం బానిసగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని చెప్పారు. అతి త్వరలోనే దేశం శక్తిసామర్థ్యాలు ఏమిటో మోదీ, అమిత్, భాగవత్ గ్రహించేలా చేస్తామన్నారు. ఢిల్లీలో తల్కాతోరా మైదానంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఏర్పాటు చేసిన ఓబీసీల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజల శక్తిసామర్థ్యాలను కాంగ్రెస్ గుర్తించిందని, వారికి అవకాశాలివ్వడం ద్వారా రాజకీయంగా వారు ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటోందని చెప్పారు. ఓబీసీలను శక్తివంతులుగా మారు స్తామన్నారు. తాము వారిని బస్సులో మాట్లాడకుండా కూర్చో బెట్టబోమని, వారికే తాళాలు ఇచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతామని చెప్పారు. దేశంలో నైపుణ్యాలకు కొదవలేదని, వెనుకబడిన వర్గాల వారిలో నైపుణ్యాలు ఇంకా ఎక్కువ ఉంటాయని, అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే వెనుకబడిపోయారన్నారు. బీజేపీ 15–20 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా విధానాలను అనుసరిస్తోందని, ప్రధాని మోదీని మార్కెట్ చేసేందుకు వారు కోట్లు కుమ్మరిస్తున్నందుకు ప్రతిఫలంగా వారికి సహకరిస్తోందన్నారు. మోదీ విధానాలపై విమర్శలకు మరింత పదును పెట్టిన రాహుల్‌గాంధీ అమెరికా పారిశ్రామికవేత్తలకు కొత్త పేర్లు పెట్టారు. కోకా–కోలా వ్యవస్థాపకుడిని షికంజి విక్రేతగా, మెక్ డొనాల్డ్స్‌ను దాబావాలాగా, ఫోర్డ్, మెర్సిడెస్, హోండా వ్యవస్థాపకులను మెకానిక్స్‌గా పేర్కొన్నారు. -
సహనశీలతే భారతీయత
ప్రణబ్ స్పందించారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని మన్నించినప్పటి నుంచి వస్తున్న వరుస విమర్శలకు నాగపూర్‌లో జూన్ 7వ తేదీననే జవాబిస్తానన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్.. చెప్పినట్లే ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం వేదికగా గురువారం ఆ విమర్శలకు జవాబిచ్చారు. అనుమానాలు తీర్చారు. సహనశీలతే భారతీయ ఆత్మ అని స్పష్టం చేశారు. జాతీయవాదం ఏ మతానికో, జాతికో సొంతం కాదని తేల్చి చెప్పారు. హిందూ, ముస్లిం, సిఖ్, ఇతర అన్ని వర్గాల సిద్ధాంతాల సమ్మేళనమే జాతీయవాదమని నిర్వచించారు. ద్వేషం సమాజ సామరస్యతను నాశనం చేస్తుందని, అభిప్రాయ బేధాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అసహనం, వితండవాదం, మతం ఆధారంగా భారత్‌ను నిర్వచించాలనుకునే ఏ ప్రయత్నమైనా చివరకు దేశ అస్తిత్వాన్నే పలుచన చేస్తుందని హెచ్చరించారు. కోపం, హింస, ఘర్షణల నుంచి శాంతి, సంతోషం, సామరస్యం దిశగా మనమంతా ముందుకెళ్లాలన్నారు. నాగపూర్: ద్వేషం, అసహనం దేశ అస్తిత్వాన్ని బలహీనపరుస్తాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. నాగపూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయంలో గురువారం స్వయం సేవకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంసేవకులు జరిపిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ఆ తరువాత ప్రణబ్ స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ మన్నించడం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. దేశం దృష్టి అంతా ఈ కార్యక్రమం పైనే ఉంది. కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ.. దేశం, జాతీయవాదం, దేశభక్తిపై తన ఆలోచనలను పంచుకునేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. శతాబ్దాల భారత చరిత్ర, ముస్లిం దురాక్రమణలు, వివిధ సామ్రాజ్యాల ఏర్పాటు, బ్రిటిష్ పాలన..తదితర భారత చరిత్రలోని పలు ముఖ్యమైన ఘట్టాలను, ఆయన తన ప్రసంగంలో గుర్తుచేశారు. ప్రణబ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు: ► ముందుగా మనం దేశం, జాతీయవాదం, దేశభక్తి అనే మూడు పదాల డిక్షనరీ అర్థాలను తెలుసుకుందాం. ► దేశమంటే.. ఒకే సంస్కృతి, ఒకే భాష, చరిత్ర, అలవాట్లను కలిగి ఉన్న ప్రజల సమూహం. జాతీయవాదం అంటే.. ఒక దేశానికి ఉండే గుర్తింపు, ఆ దేశ ప్రయోజనాలకు ఉండే మద్దతు. దేశభక్తి అంటే ఒకరికి తమ దేశంపై ఉండే ఆత్మసమర్పణ, నిబద్ధత. ► భారత్ ఓ బహిరంగ సమాజం.. పట్టు, సుగంధ ద్రవ్యాల ద్వారా ప్రపంచంతో అనుసంధానమైంది. వీటి వాణిజ్య మార్గాల ద్వారా మన సంస్కృతి, విశ్వాసం వంటివి వ్యాపారులు, మేధావుల ద్వారా కొండలు, లోయలు, సముద్రాలు దాటి ప్రపంచమంతా వ్యాపించాయి. హిందుత్వంతో సహా బౌద్ధం మధ్య ఆసియా, చైనాలకు పాకింది. మెగస్తనీస్, హుయనుత్సాంగ్ వంటి వారు భారత సమర్థవంతమైన పాలనా విధానం, గొప్ప మౌలికవసతులతో కూడిన వ్యవస్థలను తమ పుస్తకాల్లో పేర్కొన్నారు. తక్షశిల, నలంద, విక్రమశిల, వలభి, సోమపుర, ఓదంతపురి వంటి విశ్వవిద్యాలయాలు మన పురాతన విద్యా విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. చాణిక్యుడి అర్థశాస్త్రం నాటి పరిపాలన తీరుకు నిదర్శనం. ► ఆ తర్వాత దేశమంతా విస్తరించిన 16 మహాజనపదాలు, చంద్రగుప్త మౌర్యుడు గ్రీకులకు ఓడించి బలమైన భారత సామ్రాజ్యాన్ని నిర్మించడం, తర్వాత అశోకుడు ఆదర్శవంతమైన పాలనను అందించడం.. గుప్తులతోపాటు ఎందరో రాజులు ముస్లిం దురాక్రమణ దారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం.. 300 ఏళ్లపాటు ముస్లిం పాలకులు దేశాన్ని పాలించడం ఇవన్నీ దేశ చరిత్రలో మైలురాళ్లు. వ్యాపారం కోసం వ చ్చిన బ్రిటిషర్లు 190 ఏళ్లు దేశాన్ని తమ బానిసత్వంలో ఉంచుకోవడం మధ్యలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఇవన్నీ మనం మరిచిపోలేం. 2500 ఏళ్ల పాటు దేశంలో ఎన్నో రకాలుగా మారిన రాజకీయ పరిస్థితుల్లోనూ 5వేల ఏళ్లకు పైగా మన నాగరిత ఇంకా కొనసాగుతుండటమే భారత్ గొప్పదనానికి నిదర్శనం. ► దేశాన్ని ఒక్కటిగా ఉంచడం, జాతీయత భావాన్ని పెంపొందించడంలో జవహార్‌లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, బాల గంగాధర్ తిలక్ తదితరులను సేవలు మరిచిపోలేనివి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి వల్లే మనమంతా ఒకే ఒకదేశంగా మారాం. ► భారతదేశం గొప్పదనం ఇక్కడి బహుళత్వం, సహనంలోనే ఉంది. శతాబ్దాలుగా మన ప్రజల సహజీవనం నుంచే ఈ బహుళత్వం పుట్టింది. లౌకికవాదం, సమగ్రత మన విశ్వాసాలు. ► మనం 130 కోట్ల మంది భారతీయలం.. 122 భాషల్లో, 1600 యాసల్లో మాట్లాడుకుంటాం. ఏడు ప్రధాన మత విశ్వాసాలను పాటిస్తాం. అయినా, ఒకే వ్యవస్థలో, జీవిస్తాం. ఒకే జాతీయజెండాను గౌరవిస్తాం. భారతీయత అనే ఒకే అస్తిత్వాన్ని కాపాడుకుంటాం. ఇదే భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. ► వివిధ అంశాలపై మనం వాదించుకోవచ్చు కానీ భిన్నాభిప్రాయాలుండకూడదని చెప్పకూడదు. పరస్పర విరుద్ధ ఆలోచనలున్నప్పటికీ చర్చల ద్వారానే వీటిని పరిష్కరించుకోవాలి. ► శాంతిపూర్వకమైన అస్తిత్వం, కరుణ, జీవితంపై గౌరవం, సామరస్యం వంటివి భారత నాగరికతలోని సహజ సూత్రాలు. ► చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగిన ప్రతిసారీ.. భారతమాత ఆత్మ క్షోభిస్తుంది. మన సామరస్యపూర్వక సహజీవనాన్ని అనవసర కోపతాపాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. అహింసాయుత సమాజం మాత్రమే ప్రజలంతా ప్రజాస్వామ్య విధానంలో భాగస్వాములయ్యేలా చేస్తుంది. ప్రత్యేకంగా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మార్గం చూపిస్తుంది. కోపం, హింస, ఘర్షణ నుంచి శాంతి, సామరస్యం, సంతోషం మార్గంలో మనమంతా పయనించాలి. ► దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఇటీవలి అంతర్జాతీయ సూచీలు తెలియజేస్తున్నాయి. సంతోషం. కానీ సంతోషకర సూచీలో మాత్రం మనం ఇంకా వెనకబడే ఉన్నాం. ► ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే రాజు సంతోషంగా ఉంటాడు. ప్రజల సంక్షేమమే రాజు సంక్షేమం. తనకు ఇంపుగా ఉన్నదానికంటే ప్రజలకు మేలు చేసే పనిని చేయడమే రాజు ముఖ్యమైన ధర్మం. ప్రజల విషయంలో రాజు ఎలా ఉండాలనేదాన్ని కౌటిల్యుడు బాగా వివరించారు. ► శతాబ్దాలుగా ఉన్న ఐకమత్యం, ఆత్మీయీకరణ, అందరూ కలిసి జీవిచడమే మన దేశ గుర్తింపు. ► ‘ఒకే భాష, ఒకే మతం, ఒకే శత్రువు అనేది మన జాతీయవాదం కాదు. (ఆరెస్సెస్ ‘ఒకే దేశం– ఒకే సంస్కృతి’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ) ► ప్రతిరోజూ మనచుట్టూ హింస పెచ్చుమీరటాన్ని గమనిస్తున్నాం. హింస, భయం, అవిశ్వాసం ఇవన్నీ మన గుండెల్లో పాతుకుపోతున్నాయి. అందుకే ప్రజలను భయం, శారీరక, మానసిక హింస నుంచి స్వతంత్రులను చేయాలి. ► దేశంలో సామాజిక, ఆర్థిక మార్పు తీసుకువచ్చేందుకు లకి‡్ష్యంచిన హక్కుల పత్రం వంటిది భారత రాజ్యాంగం. ఇది 130 కోట్ల మంది భారతీయులు ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ► మహాత్మాగాంధీ, నెహ్రూలు పేర్కొన్నట్లు మన జాతీయతావాదం ఒక్కరికే పరిమితం కాదు, దూకుడు, విధ్వంసకరమైనది కాదు. అందరినీ కలుపుకుని పోవడమే జాతీయతావాదం. ► ప్రజలు వారి దైనందిన జీవితంలో చేయాల్సిన పనులకు సరైన మార్గదర్శకం చేయాలి. ఇదే సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది. దీంతో సహజంగానే జాతీయతావాదం పెరుగుతుంది. ‘సంఘ్’ భారతీయులందరిదీ స్వయంసేవకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మోహన్ భాగవత్ నాగపూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేయాలని కోరుకుంటోందని, తమకు బయటివారంటూ ఎవరూ లేరని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. తమ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవడంపై చర్చించడం అర్థరహితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తరువాత కూడా ప్రణబ్ ప్రణబ్‌గానే ఉంటారని, సంఘ్ సంఘ్‌గానే ఉంటుందని అన్నారు. ఏటా తమ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని, ఆ పరంపరలోనే ఈసారి ప్రణబ్ వచ్చారని అన్నారు. భిన్నాభిప్రాయాలున్నా మనమంతా భరతమాత పిల్లలమే అన్నారు. నాగపూర్‌లో హెడ్గేవార్ నివాసంలో ప్రణబ్, భాగవత్ అందరినీ కలుపుకుపోతున్నాం.. ‘ఆరెస్సెస్ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. మాకు బయటివారంటూ ఎవరూ లేరు. ఆరెస్సెస్ భారతీయులందరిదీ. భారత మాత ప్రతి ఒక్కరికీ తల్లి వంటిది. హిందువులు దేశానికి వారసులు. అందరినీ కలుపుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, దేశం పేరు ప్రతిష్టలను మరింత పెంచే కార్యకర్తలను తయారుచేయడమే ఆరెస్సెస్ లక్ష్యం. కుల,మత, ప్రాంత, వర్గ భేదాల్లేకుండా దేశమంతా ఒక్కటేననే భావనను నెలకొల్పుతున్నాం. అందరినీ కలుపుకుని వెళ్లడం ద్వారా క్రమశిక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచాం. ప్రజాస్వామ్య ఆలోచనే ఆరెస్సెస్ అస్తిత్వం. దేశం కోసం పనిచేయడాన్నే మేం విశ్వసిస్తాం. ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నప్పుడే స్వాతంత్య్ర సమరంలో జైలుకెళ్లారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు మాతో కలిసి పనిచేశారు. జాతి నిర్మాణంలో సమాజమంతా భాగస్వామ్యమైనప్పుడే ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుంది’ అని భాగవత్ అన్నారు. భారతమాత గొప్ప పుత్రుడు హెడ్గేవార్ నాగపూర్: ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరాం హెడ్గేవార్.. భారతమాత ముద్దుబిడ్డ అని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. హెడ్గేవార్ పుట్టిన ఇంటిని సందర్శించిన అనంతరం అక్కడి సందర్శకుల పుస్తకంలో ‘భారతమాత గొప్ప పుత్రుడికి ఘనమైన నివాళులర్పించేందుకు నేను ఇక్కడికొచ్చాను’ అని ప్రణబ్ రాశారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగపూర్ నగరంలోని ఇరుకు వీధులగుండా హెడ్గేవార్ నివాసానికి ప్రణబ్‌ను దగ్గరుండి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే ప్రణబ్ తన పాదరక్షలు తీసి లోపలకు వెళ్లారు. ఈ సందర్భంగా హెడ్గేవార్‌కు సంబంధించిన వివరాలను ప్రణబ్‌కు మోహన్ భాగవత్ వివరించారు. నాగపూర్‌లోని సంఘ శిక్షావర్గ తృతీయ కార్యక్రమానికి స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కుటుంబసభ్యులను కూడా ప్రత్యేక అతిథులుగా ఆరెస్సెస్ ఆహ్వానించింది. ప్రణబ్ సూచనల్ని ఆచరిస్తారా: కాంగ్రెస్ న్యూఢిల్లీ: ప్రణబ్ ప్రసంగం భారతీయ నాగరిక విలువలతో పాటు బహుళత్వం, లౌకికవాదం, అందర్ని కలుపుకుపోవడాన్ని ఆరెస్సెస్, బీజేపీలకు చూపిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ విషయమై కాంగ్రెస్ నేత సూర్జేవాలా స్పందిస్తూ.. ‘ప్రణబ్ చేసిన విలువైన సూచనల్ని అంగీకరించి ఆరెస్సెస్, బీజేపీలు తమ ఆలోననావిధానం, స్వభావం, ధోరణిని ఈరోజు మార్చుకుంటాయని ఆశిస్తున్నాం. తమ తప్పుల్ని అంగీకరించేందుకు ఆరెస్సెస్ సిద్ధమా? హింసాత్మక, అణచివేత లక్షణాలను విడిచిపెడుతుందా? మహిళలు, పేదలపట్ల అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని ఆరెస్సెస్ వదిలివేస్తుందా?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు. నాగపూర్‌లో హెడ్గేవార్ -
ఆరెస్సెస్ ఆర్మీ.. భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, పాట్నా: హిందుస్తాన్ (భారత్) కేవలం హిందువుల కోసమేనంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే కేవలం మూడండే మూడు రోజుల్లోనే ఆర్మీని తయారు చేయగలమని భగవత్ వ్యాఖ్యానించారు. భారత ఆర్మీ ఆ పని చేసేందుకు ఆరు-ఏడు రోజుల సమయం పడుతుందని, కానీ తమకు అందులో సగం రోజులు చాలన్నారు. బిహార్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆరురోజుల పర్యటనలో చివరిరోజు ఆరెస్సెస్ కార్తకర్తల సమావేశంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ కార్తకర్తలు దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉంటారని, ఆర్మీ క్రమశిక్షణ వారు కూడా పాటిస్తారని చెప్పారు. పాక్ ఉగ్రదాడులపై స్పందించిన భగవత్.. 'ఆరెస్సెస్ మూడు రోజుల్లోనే ఓ పటిష్ట ఆర్మీని తయారు చేయగలదు. కానీ భారత ఆర్మీకి అలా తయారు చేసేందుకు వారం రోజులైనా పడుతుంది. సంఘ్ సత్తా అది. రాజ్యాంగం అందుకు వెసలుబాటు కల్పిస్తే సరికొత్త ఆర్మీని తయారుచేసి దేశం కోసం పోరాడేందుకు, అవసరమైతే ప్రాణాలర్పించేందుకు సంఘ్ కుటుంబం (ఆరెస్సెస్ కార్తకర్తలు) ఎప్పుడూ సిద్ధమే. వ్యక్తిగతంగా, సామాజిక జీవనంలో, విధి నిర్వహణ ఇలా అన్నింట్లోనూ ఆరెస్సెస్ కార్యకర్తలు ఆదర్శంగా నిలుస్తున్నారని' ప్రశంసించారు. -
ఆరెస్సెస్‌లో మహిళా నేతలేరి?
షిల్లాంగ్: ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)లో మహిళలకు ప్రాధాన్యం ఉండదనీ, అందులో నాయకత్వ స్థానాల్లో స్త్రీలు లేనే లేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఈ నెల 27న శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ప్రస్తుతం రాహుల్ అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఓ చోట ఆయన మాట్లాడుతూ ‘ఆరెస్సెస్‌లో ఎన్ని నాయకత్వ స్థానాల్లో మహిళలు ఉన్నారో మీలో ఎవరికైనా తెలుసా? సున్నా’ అన్ని అన్నారు. ‘మీరెప్పుడైనా మహాత్మా గాంధీ ఫొటో చూస్తే ఆయన చుట్టూ మహిళలు కనిపిస్తారు. కానీ మోహన్ భాగవత్ ఫొటోను ఎప్పుడైనా చూశారా? ఆయన ఒంటిరిగా లేదా చుట్టూ పురుషులతోనే ఉంటారు. ఆయన చుట్టూ మహిళలు ఎప్పుడూ ఉండరు’ అని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇంకా ‘సూటు–బూటు’ మనిషిలానే వ్యవహరిస్తున్నారనీ, ఆయన చుట్టూ ఎప్పుడు వివిధ కంపెనీల ప్రతినిధులే ఉంటారు తప్ప పేదలతో మోదీ మాట్లాడరని రాహుల్ మరోసారి దుయ్యబట్టారు. -
'అక్కడ ఆవుల రక్తం తాగుతారు కానీ చంపరు'
నాగపూర్: గోహత్యలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శనివారం నాగపూర్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కెన్యా దేశంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఆవుల రక్తం తాగుతారు కానీ వాటిని వధించరని అన్నారు. ఆఫ్రికాలో గోహత్యలపై నిషేధం ఉన్నందున ప్రజలు ఆవులను చంపరనీ.. కానీ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రం ప్రాణానికి హాని కలుగకుండా ఆవుల మెడ భాగంలోని రక్తనాళం నుండి రక్తాన్ని తీసుకొని తాగుతారన్నారు. పలు రాష్ట్రాల్లో గోవధపై నిషేధం విధించాలన్న డిమాండ్ల నేపథ్యంలో మోహన్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
ఆర్ఎస్ఎస్ చీఫ్ పుష్కర స్నానం @ రాజమండ్రి
రాజమండ్రి: మంగళవారం నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి వీవీఐపీలు తరలివస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. రాజమండ్రిలో పుష్కర స్నానం ఆచరించనున్నారు. మంగళవారం ఉదయం 9:30 గంటలకు రాజమండ్రి చేరుకోనున్న ఆయన 10 గంటలకు వీఐపీ ఘాట్ వద్ద పవిత్ర గోదావరిలో పుష్కర స్నానం చేస్తారని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తరువాత నగరంలోని లాలా చెరువు వద్ద ఏర్పాటు చేసిన సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని, సాయంత్రం 4:30 గంటలకు సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. -
'థెరీసా పవిత్రమూర్తి.. ఆమెను వదిలేయండి'
భారతరత్న మదర్ థెరిసాపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. థెరీసా పవిత్ర మూర్తి అని దయచేసి ఆమె విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. మదర్ థెరీసాను వివాదాల్లోకి లాగొద్దని, ఇక ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా వదిలేయాలని కోరారు. తాను కోల్‌కతాలోని నిర్మల్ హృదయ్ ఆశ్రమంలో థెరీసాతో కలిసి కొంతకాలం పనిచేసినట్లు కేజ్రీవాల్ చెప్పారు. అలాగే, సీపీఎం కూడా భగవత్ వ్యాఖ్యల విషయం స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలతో ప్రపంచంలో భారత్‌కు ఉన్న గొప్ప ఇమేజ్ తగ్గుతుందని పేర్కొంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసి భగవత్ కొత్తగా ఏం నిరూపించుకోవాలనుకుంటున్నారో అర్థం కావాడం లేదంది. అలాగే ఢిల్లీ కేథలిక్ అర్కడైయాసిస్ ఫాధర్ సవారిముత్తు స్పందిస్తూ మదర్ థెరీసాపై ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఆమె జీవితం మొత్తాన్ని సేవకే అంకితం చేసినట్లు తెలిపారు. కాగా, మదర్ థెరీసా సేవ చేయడం వెనుక మతమార్పిడి అంశం ఉందని భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.