
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్
సాక్షి, పాట్నా: హిందుస్తాన్ (భారత్) కేవలం హిందువుల కోసమేనంటూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే కేవలం మూడండే మూడు రోజుల్లోనే ఆర్మీని తయారు చేయగలమని భగవత్ వ్యాఖ్యానించారు. భారత ఆర్మీ ఆ పని చేసేందుకు ఆరు-ఏడు రోజుల సమయం పడుతుందని, కానీ తమకు అందులో సగం రోజులు చాలన్నారు. బిహార్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆరురోజుల పర్యటనలో చివరిరోజు ఆరెస్సెస్ కార్తకర్తల సమావేశంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆరెస్సెస్ కార్తకర్తలు దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధంగా ఉంటారని, ఆర్మీ క్రమశిక్షణ వారు కూడా పాటిస్తారని చెప్పారు. పాక్ ఉగ్రదాడులపై స్పందించిన భగవత్.. 'ఆరెస్సెస్ మూడు రోజుల్లోనే ఓ పటిష్ట ఆర్మీని తయారు చేయగలదు. కానీ భారత ఆర్మీకి అలా తయారు చేసేందుకు వారం రోజులైనా పడుతుంది. సంఘ్ సత్తా అది. రాజ్యాంగం అందుకు వెసలుబాటు కల్పిస్తే సరికొత్త ఆర్మీని తయారుచేసి దేశం కోసం పోరాడేందుకు, అవసరమైతే ప్రాణాలర్పించేందుకు సంఘ్ కుటుంబం (ఆరెస్సెస్ కార్తకర్తలు) ఎప్పుడూ సిద్ధమే. వ్యక్తిగతంగా, సామాజిక జీవనంలో, విధి నిర్వహణ ఇలా అన్నింట్లోనూ ఆరెస్సెస్ కార్యకర్తలు ఆదర్శంగా నిలుస్తున్నారని' ప్రశంసించారు.