ఛండీగర్: సనాతన ధర్మం భారత్‌కు పర్యాయపదమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. దేశ సంస్కృతి సనాతన ధర్మం మీదే ఆధారపడి ఉందని చెప్పారు. అలాంటి ధర్మాన్ని నాశనం చేయాలనుకోవడం స్వీయ హానితో సమానమని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతుండటం తెలిసిందే. వాటిని ఉద్దేశించి భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం హరియాణాలోని రోహతక్‌లో బాబా మస్త్‌నాథ్ మఠంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
సనాతనమంటేనే ఎప్పటికీ నిలిచి ఉండేదని, మన ధర్మం కూడా అంతేనని చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి వీకే సింగ్, యోగ గురు రామ్‌దేవ్, పలువురు సాధు ప్రముఖులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య తలెత్తినా పరిష్కారం కోసం అంతా భారత్‌కేసే చూస్తున్నారని ఆదిత్యనాథ్ అన్నారు. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అయోధ్య రామాలయ నిర్మాణం ఇప్పుడు కళ్లముందు కన్పిస్తున్న వాస్తమని చెప్పారు. అంతకుముందు ఉదయం జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహంత్ చంద్‌నాథ్ యోగి విగ్రహాన్ని మఠంలో ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: గంగా జలంపై జీఎస్టీ.. ట్యాక్స్ బోర్డు ఏం చెప్పిందంటే..
Comments
Please login to add a commentAdd a comment