బీనా రిఫైనరీలో శంకుస్థాపన కార్యక్రమంలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
బీనా/రాయ్‌గఢ్: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిని దురంహకారి కూటమిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఇండియా కూటమి లక్ష్యంగా పెట్టుకుందని, వెయ్యి సంవత్సరాల బానిసత్వంలోకి దేశాన్ని నెట్టివేయాలని చూస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమైందని, ఈ ఘనత 140 కోట్ల మంది భారతీయులకు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ విజయం దేశ ప్రజల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పారు.
త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ గురువారం పర్యటించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలోని బీనా రిఫైనరీలో రూ.49 వేల కోట్లతో నిర్మించే పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు మరో 10 పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణానికి పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. అలాగే చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కొండతరాయి గ్రామంలో ‘విజయ్ శంఖనాథ్’ సభలోనూ మాట్లాడారు. రెండు సభల్లో ఆయన ఏం చెప్పారంటే...
కుట్రలను అడ్డుకోవాలి
‘‘దురహంకారి కూటమి ఇటీవలే ముంబైలో సమావేశమైంది. ఆ కూటమికి ఒక విధానం లేదు, ఒక నాయకుడు లేడు. సనాతన ధర్మంపై దాడి చేసి, నాశనం చేయాలన్న రహస్య ఎజెండా మాత్రమే ఉంది. సనాతన ధర్మం నుంచి జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తి పొందారు. స్వాతంత్య్రం కోసం ఆయన సాగించిన పోరాటం సనాతన ధర్మం చుట్టూ కేంద్రీకృతమైంది. మహాత్ముడు జీవితాంతం సనాతన ధర్మాన్ని పాటించారు. ఆయన చివరిసారిగా ‘హే రామ్’ అంటూ నెలకొరిగారు.
రాణి అహిల్యాబాయి హోల్కర్, ఝాన్సీ లక్ష్మీబాయి, స్వామి వివేకానంద, లోకమాన్య తిలక్ వంటి మహనీయులు సనాతన ధర్మ నుంచి స్ఫూర్తి పొంది ముందుకు నడిచారు. విపక్ష కూటమి నాయకులు బహిరంగంగా మాట్లాడడం ప్రారంభించారు. వారు మనపై దాడికి పదును పెడుతున్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ, దేశాభిమానులు ఈ విషయం గమనించాలి. అప్రమత్తంగా ఉండాలి. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకు సాగుతున్న కుట్రలను మనమంతా కలిసికట్టుగా అడ్డుకోవాలి. మనం ఐక్యంగా ఉంటే వారి ఆటలు సాగవు. వారి ప్రయత్నాలనీ విఫలమవుతాయి.
మన లక్ష్యం ‘ఆత్మనిర్భర్ భారత్’
జీ20 సదస్సు విజయంతో దేశ ప్రజల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఈ ఘనత మోదీకి కాదు, ముమ్మాటికీ 140 మంది భారతీయులదే. చిన్నపిల్లలకు కూడా జీ20 గురించి తెలిసింది. బృంద స్ఫూర్తితో పని చేయడం వల్ల ఈ సదస్సు విజయవంతమైంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ చాలా ఏళ్లు అధికారంలో ఉంది. కానీ, ఆ పార్టీ చేసిందేమీ లేదు. అవినీతికి, నేరాలకు పాల్పడడంతోనే కాంగ్రెస్‌కు సమయం సరిపోయింది.
కాంగ్రెస్ హయాంలో నేరగాళ్లు రాజ్యమేలారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకివచ్చాక అవినీతి అంతమైంది. సుపరిపాలన కొనసాగుతోంది. పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామివేత్తలు తరలివస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించుకోవాలి. పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మారాలి. దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. స్వయం స్వావలంబన దిశగా బీనా రిఫైనరీ ఒక ముందడుగు అవుతుంది.
దళారుల ప్రమేయాన్ని అంతం చేశాం
బానిస మనస్తత్వం నుంచి దేశం బయట పడింది. ‘న్యూ ఇండియా’ సగర్వంగా ముందడుగు వేస్తోంది. ప్రభుత్వ పథకాల అమలులో దళారుల ప్రమేయాన్ని అంతం చేశాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందజేస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటిదాకా రూ.2.60 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల ఖాతాల్లో జమచేశాం. వ్యవసాయ రంగంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నాం.
రైతులపై భారం తగ్గిస్తున్నాం. ఎరువులను చౌకగా అందజేయడానికి సబ్సిడీ రూపంలో గత తొమ్మిదేళ్లలో రూ.10 లక్షల కోట్లకుపైగా వెచి్చంచాం. అమెరికాలో ఒక యూరియా సంచి ధర రూ.3,000 ఉంది. మన దగ్గర మాత్రం రైతులకు కేవలం రూ.300కే లభిస్తోంది. దేశంలో గత నాలుగేళ్లలో కొత్తగా 10 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. మొఘల్ రాజులపై పోరాటం చేసిన గిరిజన పాలకురాలు రాణి దుర్గావతి 500వ జయంతి వేడుకలను అక్టోబర్ 5న ఘనంగా నిర్వహిస్తాం.
‘ఇండియా’ పట్ల జాగ్రత్త
భారత్‌ను, ప్రాచీన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కనుమరుగు చేయాలని చూస్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి కుయుక్తుల పట్ల ప్రజలు నిత్యం జాగరూకులై ఉండాలి. మన దేశానికి, మన విశ్వాసాలకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. కొందరు వ్యక్తులు అధికారం నుంచి దూరమయ్యాక ప్రజల పట్ల ద్వేషం పెంచుకున్నారు. అందుకే ప్రజల గుర్తింపుపై, సంస్కృతిపై దాడి చేస్తున్నారు. దేశంలో వేలాది సంవత్సరాలుగా అవిచి్ఛన్నంగా కొనసాగుతున్న సంస్కృతిని విచి్ఛన్నం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్నదే వారి అసలు లక్ష్యం. సనాతన ధర్మం వ్యక్తుల జన్మకు కాదు, వారి కర్మ(చేసే పనులు) ప్రాధాన్యం ఇస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment