
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్( ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తలు ఎప్పుడూ సమాజం కోసమే కృషి చేస్తారని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. సరూర్‌నగర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దేశ విజయం కోసం చేస్తున్న సంకల్పమని, సంఘ్ కార్యకర్తలు ఎప్పుడూ ప్రపంచ విజయాన్నే కోరుకుంటారని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రతి ఒక్కరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు. స్వార్థం కోసం కొంతమంది ప్రజల మధ్య విద్వేశాలు సృష్టిస్తున్నారని, దేశాభివృద్ధే అందరి లక్ష్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎదుటివారి వినాశనాన్ని కోరుకోవడం మంచిది కాదని, ఎప్పటికైనా ధర్మమే జయిస్తుందని, మన భారతీయులకు నాగరికత అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో పుట్టిన వారంతా హిందువులేనని, మతాచారాలు వేరైనా అందరం భరతమాత బిడ్డలమేనని మోహన్ భగవత్ తెలిపారు.