సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన కనుగంటి అప్సర (30) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆమెకు గతంలోనే వివాహం జరిగినట్లుగా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణ విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
కాగా, హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వృత్తిరీత్యా ఆలయ పూజారి అయిన నిందితుడు అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ అప్సరను తొలుత సుల్తాన్‌పూర్‌లోని గోశాలలో అంతమొందించాలని భావించాడు. అయితే, గోశాలలో రక్తం చిందిస్తే పాపం చుట్టుకుంటుందని భావించి.. కారును 2 కి.మీ. దూరం తీసుకెళ్లి నర్కుడలోని ఓ వెంచర్‌లో హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. హత్య ఎలా చేయాలో గూగుల్‌లో సెర్చ్ చేసి సాయికృష్ణ ప్రణాళిక వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్సర హత్యకు మూడుసార్లు విఫలయత్నం చేసిన సాయికృష్ణ.. నాలుగోసారి ఆమెను అంతమొందించాడు.
కోయంబత్తూరు టూర్ అడ్డుపెట్టుకొని..
సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ గుడికి వెళ్తున్న క్రమంలో సాయికృష్ణ, అప్సరలకు పరిచయం ఏర్పడింది. రోజూ ఇద్దరు ఫోన్‌లో కాల్స్‌తోపాటు వాట్సాప్‌లో చాటింగ్ చేసుకునే వాళ్లు. గత నవంబర్‌లో అప్సర, సాయికృష్ణ గుజరాత్‌లోని సోమనాథ్, ద్వారక ఆలయాలను దర్శించుకుని, అక్కడే ఇద్దరూ ఒక్కటైనట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో తనను పెళ్లి చేసుకోకపోతే వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని, సంఘాల్లో చెప్పి పరువు తీస్తానని అప్సర బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. దీంతో ఆమెను అంతమొందించాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో కోయంబత్తూరుకు తీసుకెళ్లాలని పలుమార్లు అప్సర కోరడంతో హత్యకు ఇదే అదనుగా భావించాడు. ఈనెల 3న శంషాబాద్ నుంచి కోయంబత్తూరుకు ఆఖరి బస్సు రాత్రి 11 గంటలకు ఉందని, టికెట్ కూడా బుక్ చేశానని నమ్మించి, ఆమెను ఇంటి నుంచి కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. రెండు గంటలపాటు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో తిప్పాడు. కోయంబత్తూరుకు వెళ్లడం ఏమైందని అప్సర ప్రశ్నించడంతో.. తాను టికెట్ బుక్ చేయలేదని చెప్పాడు. సుల్తాన్‌పల్లిలోని గోశాలకు వెళ్దామని ఆమెను ఒప్పించాడు. తర్వాత నర్కుడ వైపు వెళ్లి కారు కవర్‌ను అప్సర తలకు చుట్టి ఊపిరాడకుండా చేసి, బండరాయితో తలపై మోది హత్య చేశాడు.
చదవండి: అప్సర కేసు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏముందంటే?
తర్వాత కారు కవర్, అప్సర చెప్పులు, బండరాయిని నిర్మానుష్య ప్రాంతంలో విసిరేశాడు. అప్సర మృతదేహాన్ని పాతిపెట్టిన మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎల్బీనగర్ నుంచి రెండు టిప్పర్ల ఎర్ర మట్టిని తెప్పించి పోశాడు. తమ్ముడు అయ్యవారి సత్యప్రసాద్ ద్వారా టిప్పర్ డ్రైవర్ అశోక్‌కు నగదు ఫోన్ పే ద్వారా రూ.16 వేలు వేశాడు. మరుసటి రోజు కూడా మ్యాన్‌హోల్ వద్ద దుర్వాసన వస్తుండటంతో మ్యాన్‌హోల్ కాంక్రీట్ మూతతో పూడ్చేశాడు.
14 రోజులు రిమాండ్‌కు..
పోలీసులు సాయికృష్ణను రాజేంద్రనగర్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజి్రస్టేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. సాయికృష్ణ కస్టడీ కోరుతూ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. అప్సర తల మీద బండరాయితో బలంగా మోదడంతో అధికంగా రక్తస్రావం జరిగి మరణించిందని ఉస్మానియా వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సీసీటీవీ కెమెరాలతో దొరికాడు..
అప్సరను హత్య చేసిన తర్వాత సాయికృష్ణ అమాయకుడిలా ఆర్జీఏఐ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన మేనకోడలు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. అనుమానం వచి్చన పోలీసులు శంషాబాద్ బస్టాండ్ వద్ద సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దీంతో హంతకుడు సాయికృష్ణనే అని నిర్ధారణకు వచ్చారు. అయితే పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేయాలని భావించారు. ఈనెల 3న కోయంబత్తూరు వెళ్తున్నామని అప్సరను కారులో తెచ్చిన సాయికృష్ణ రాత్రి 10 గంటల సమయంలో శంషాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద కారు ఆపి కిందికి దిగాడు.
ఇంతలోనే ఓ బస్సు అటుగా వెళ్లడంతో కారు ఎటువైపు వెళ్లిందనేది సీసీ ఫుటేజీ తొలుత లభించలేదు. ఆ తర్వాత రాళ్లగూడ వరకు వెళ్లి ఒక్కడే ఫాస్ట్‌ఫుడ్ తిన్నాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్ద కూడా అప్సర ఓసారి కారు దిగింది. వాంతి చేసుకున్న తర్వాత తిరిగి కారులో కూర్చున్నట్లు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా నమోదైంది. హత్య చేసిన తర్వాత తిరిగొస్తున్న క్రమంలో కారులో ఒక్కడే ఉన్న సీసీ ఫుటేజీ కూడా పోలీసులకు దొరికింది. అప్సర నుంచి చివరి ఫోన్ కాల్ సాయికృష్ణకు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment