శశికళ ఫైల్
సాక్షి, హైదరాబాద్: మామ, భర్త తరపు బంధువులు తరచూ తనను అవమానిస్తున్నారని గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... సరూర్‌నగర్ కృష్ణానగర్ కాలనీ నివాసి విష్ణువర్ధన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం మియాపూర్, ఆల్వీన్ కాలనీకి చెందిన శశికళ(33)తో వివాహమైంది. వీరికి కుమార్తె శ్రేయారెడ్డి(6)ఉంది.
శశికళను మామ దేవేందర్‌రెడ్డి, భర్త తరఫు బంధువులు ఉషారాణి, వందన, రాజశేఖర్ తరచూ అవమానిస్తున్నారని శశికళ తన తల్లి యానాం గౌరికుమారికి పలుమార్లు చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఉండగా, విష్ణువర్దన్‌రెడ్డి గురువారం ఉదయం శశికళ తల్లి గౌరీకుమారికి ఫోన్ చేసి తక్షణమే తమ ఇంటికి రమ్మన్నాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి కుమార్తె ఇంటి పక్కన ఉండేవారికి ఫోన్ చేయగా, శశికళ చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పారు.
వెంటనే బంధువులతో కలిసి ఆమె కృష్ణానగర్‌కు చేరుకొని కన్నీరు మున్నీరైంది. మామ, బంధువులు అవమానకరంగా ప్రవర్తించడంతోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గౌరీకుమారి ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.
చదవండి: Hyderabad: తాగుడుకు బానిసైన భర్త.. ఉద్యోగం మానేసి అబద్ధాలు చెప్తుండటంతో
Comments
Please login to add a commentAdd a comment