అప్సర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్సర హత్య కేసులో పోలీసులు శుక్రవారం సీన్ రీ కన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. కోర్టు అనుమతితో నిందితుడు అయ్యగారి వెంకట సూర్య సాయి కృష్ణను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించారు. మండల పరిధిలోని సుల్తాన్‌పల్లి శివార్లలోని బ్యూటీగ్రీన్ పక్కన ఉన్న గోశాలకు సాయి కృష్ణ తరచూ వచ్చేవాడు. హత్య జరిగిన రోజు అతను అప్సరతో కలిసి అక్కడికి వచ్చాడు. గోశాలలో రక్తం చిందిస్తే పాపం చుట్టుకుంటుందని భావించిన సాయి కృష్ణ అక్కడి నుంచి కారులో తిరిగి శంషాబాద్ వైపు బయలుదేరాడు.
గోశాల నుంచి దాదాను రెండు కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత నర్కూడ సమీపంలో శంషాబాద్–షాబాద్ రోడ్డు పక్కన ఉన్న వెంచర్‌లో అప్సర తలపై రాయితో మోది హత్య చేశారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా పోలీసులు నిందితుడు సాయికృష్ణను గోశాల, వెంచర్ వద్దకు తీసుకెళ్లి ఆధారాలు సేకరించారు. వెంచర్ సమీపంలో చిన్న బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాళ్లగూడ, శంషాబాద్ బస్టాండ్ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన సీసీ టీవీ ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు.
సరూర్‌నగర్ మండల కార్యాలయం వెనకాల అప్సర మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి కూడా నిందితుడిని తీసుకెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇన్‌స్పెక్టర్ ఏ.శ్రీధర్‌కుమార్ నేతృత్వంలో ఈ రీ కన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఇదిలా ఉండగా పోలీసు కస్టడీ ముగియడంతో నిందితుడు సాయి కృష్ణను శనివారం కోర్టులో హాజరుపర్చనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment