shashabad
-
అప్సర కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నేడు కోర్టుకు సాయికృష్ణ
అప్సర హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్సర హత్య కేసులో పోలీసులు శుక్రవారం సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు. కోర్టు అనుమతితో నిందితుడు అయ్యగారి వెంకట సూర్య సాయి కృష్ణను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న శంషాబాద్ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించారు. మండల పరిధిలోని సుల్తాన్‌పల్లి శివార్లలోని బ్యూటీగ్రీన్ పక్కన ఉన్న గోశాలకు సాయి కృష్ణ తరచూ వచ్చేవాడు. హత్య జరిగిన రోజు అతను అప్సరతో కలిసి అక్కడికి వచ్చాడు. గోశాలలో రక్తం చిందిస్తే పాపం చుట్టుకుంటుందని భావించిన సాయి కృష్ణ అక్కడి నుంచి కారులో తిరిగి శంషాబాద్ వైపు బయలుదేరాడు. గోశాల నుంచి దాదాను రెండు కిలో మీటర్ల దూరం వెళ్లిన తర్వాత నర్కూడ సమీపంలో శంషాబాద్–షాబాద్ రోడ్డు పక్కన ఉన్న వెంచర్లో అప్సర తలపై రాయితో మోది హత్య చేశారు. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా పోలీసులు నిందితుడు సాయికృష్ణను గోశాల, వెంచర్ వద్దకు తీసుకెళ్లి ఆధారాలు సేకరించారు. వెంచర్ సమీపంలో చిన్న బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాళ్లగూడ, శంషాబాద్ బస్టాండ్ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డైన సీసీ టీవీ ఫుటేజీని కూడా పోలీసులు సేకరించారు. సరూర్‌నగర్ మండల కార్యాలయం వెనకాల అప్సర మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి కూడా నిందితుడిని తీసుకెళ్లిన పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇన్స్పెక్టర్ ఏ.శ్రీధర్‌కుమార్ నేతృత్వంలో ఈ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఇదిలా ఉండగా పోలీసు కస్టడీ ముగియడంతో నిందితుడు సాయి కృష్ణను శనివారం కోర్టులో హాజరుపర్చనున్నారు. -
శంషాబాద్‌లో అమానుషం: స్తంభానికి కట్టేసి.. మెడలో బ్యాటరీలతో సగం గుండు..
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని అహ్మద్‌నగర్ బస్తీలో అమానవీయ సంఘటన జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన మేరకు.. అహ్మద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఖుద్దూస్(20), మహ్మద్ ఖాజా(20) శనివారం ఉదయం మదీనా మజీదుగా గుండా వెళుతున్నారు. ఆటోలోని బ్యాటరీలను తస్కరించి వెళుతున్నట్లు అనుమానించిన అదే బస్తీకి చెందిన అబ్దుల్ రెహ్మన్, మహ్మద్ అలీ, జావేద్, మహ్మద్ గౌస్,మహ్మద్ బారీలు వీరిని అడ్డగించారు. స్థానికంగా ఉన్న స్తంభానికి ఇద్దరి కట్టేసి మెడలో బ్యాటరీలను వేలాడేశారు. అంతటితో ఆగకుండా ఇద్దరికి సగం గుండు గీయించారు. అనంతరం వారిని చితకబాది అక్కడి నుంచి పారిపోమన్నారు. ఈ తంతంగాన్నంతా వీడియోలు సైతం తీశారు. సంబంధిత వీడియోలు కూడా స్థానికంగా వైరల్ అయ్యాయి. అవమాన భారాన్ని తట్టుకోలేనిసదరు యువకులు సోమవారం రాత్రి ఆర్జీఐఏ పోలీసులకు ఆశ్రయించి జరిగిన వివరాలను వెల్లడించారు. దీంతో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పొద్దంతా కూలి పని.. అందరూ నిద్రపోయాక అసలు పని మొదలుపెడతారు -
దిశ కేసు: ‘నేనొకటి చెబితే.. సజ్జనార్ మరొలా చెప్పారు’
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్ బుధవారం శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాశ్‌రెడ్డిని విచారించింది. ఈ ఎన్కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను కమిషన్ విచారించిన సందర్భంగా చాలా ప్రశ్నలకు ఆయన ‘శంషాబాద్ డీసీపీ బ్రీఫింగ్ చేసేవారు.. దాన్ని బట్టే మీడియాకు వివరాలను వెల్లడించాను’ అని అని చెప్పిన నేపథ్యంలో కమిషన్ తరుఫున న్యాయ వాది ఎం.విరూపాక్ష దత్తాత్రేయ గౌడ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిపై పలు ప్రశ్నలను సంధించారు. విచారణలోని కీలకాంశాలివే.. ‘దిశ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) మహ్మద్ ఆరిఫ్ ఒప్పుకోలు విచారణ (కన్ఫెషన్ స్టేట్మెంట్) 2019 నవంబర్ 29న సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమై 6:45 గంటలకు ముగిసింది. ఏ2– జొల్లు శివ ఒప్పుకోలు విచారణ 6:45 గంటలకు ప్రారంభించి ఎన్ని గంటలకు ముగించారో రికార్డ్ చేయలేదు. ఆరిఫ్ వాంగ్మూలం పూర్తికాకుండానే గంట ముందే అప్పటి సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌కు నిందితులు నేరం చేసిన తీరును ఎలా చెప్పగలిగారు’అని డీసీపీని జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ప్రశ్నించింది. సాయంత్రం 5:15 గంటలకు నిందితుల అరెస్టు గురించి మాత్రమే ఏసీపీ సురేందర్ తనకి చెప్పారని.. అదే విషయాన్ని సీపీ సజ్జనార్‌కు వివరించానని.. త్రిసభ్య కమిటీకి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. 2019 డిసెంబర్ 6వ తేదీ నాటికి దిశ సెల్‌ఫోన్, పవర్ బ్యాంక్‌ల రివకరీ, నిందితుల డీఎన్ఏ సేకరణ జరగలేదని తెలిపారు. కానీ, అదే రోజు రాత్రి 7:15 గంటలకు శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాత్రం సీపీ సజ్జనార్ రికవరీ, డీఎన్ఏ సేకరణ జరిగినట్లు తప్పుగా తెలిపారని వివరించారు. నిందితులు మరణించాకే వారి మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్స్‌ను సేకరించామని పేర్కొన్నారు. పోలీస్ ఆఫీసర్ల చేతిలోని తుపాకులు అన్‌లాక్ చేసి ఉన్నాయని మీరే చెప్పారా అని కమిషన్ ప్రశ్నించగా.. షాద్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తనకు ఆ విషయం చెప్పారని.. అదే విషయాన్ని సీపీకి తెలియజేశానని సమాధానం ఇచ్చారు. 2019 డిసెంబర్ 6వ తేదీన సజ్జనార్ రెండోసారి నిర్వహించిన ప్రెస్మీట్లో ఇచ్చిన ప్రజెంటేషన్, నేరం జరిగిన తీరు కేవలం తన బ్రీఫింగ్ మీద ఆధారపడి నిర్వహించలేదని త్రిసభ్య కమిటీకి డీసీపీ తెలిపారు. గాలి తీసింది నవీన్ అని చెప్పలేదు.. ‘దిశ’స్కూటీ టైర్లో గాలి తీసింది జొల్లు నవీన్ అని తాను చెప్పలేదని సిర్పుర్కర్ కమిషన్‌కు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. 2019 నవంబర్ 29న రాత్రి 7:15 గంటలకు శంషాబాద్ డీసీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్ నిర్వహించే సమయానికి జొల్లు నవీన్ ఒప్పుకోలు విచారణ జరగలేదు.. కానీ, ఆ ప్రెస్మీట్లో సీపీ సజ్జనార్.. నవీనే స్కూటీలో గాలి తీశాడని ఎలా చెప్పారని కమిషన్ ప్రశ్నించింది. దీంతో తాను ఆ విషయాన్ని కమిషనర్‌కు చెప్పలేదని.. నలుగురు నిందితులు కలిసే దిశ స్కూటీని పంక్చర్ చేసే పథకం రచించారని మాత్రమే చెప్పానని డీసీపీ వెల్లడించారు. మళ్లీ మేజిస్ట్రేట్ అనుమతి అవసరం లేదనిపించింది.. ‘నిందితుల కస్టడీ కోసం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి అత్యవసరమని ఏసీపీకి మీరు చెప్పలేదా?’అని కమిషన్ ప్రశ్నించగా.. ‘2019 నవంబర్ 30న రిమాండ్ కోసం షాద్‌నగర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాం కదా.. అందుకే కస్టడీ కోసం మళ్లీ జ్యుడీషయల్ మేజిస్ట్రేట్ అనుమతి అవసరం లేదని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నాతో చెప్పారు. దాంతో నాకూ ఆ అవసరం లేదనిపించింది’అని డీసీపీ ప్రకాశ్‌రెడ్డి సిర్పుర్కర్ కమిషన్‌కు వివరించారు. ఎగ్జిక్యూటివ్ మెజి్రస్టేట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. ఇద్దరి ఆఫీసు లు ఒకటే దగ్గర ఉండటంతో నాకూ అనవసరమే అనిపించింది.. అని పేర్కొన్నారు. దీంతో జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లా అండ్ ఆర్డర్లో డీసీపీ హోదాలో ఉంటూ, శంషాబాద్ వంటి కీలకమైన ప్రాంతానికి ఉన్నతాధికారి అయి ఉండి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో క్రిమినల్ ప్రొసిజర్స్ కోడ్స్‌ను సరిగా అనుసరించాలని తెలియదా’అని మండిపడ్డారు. పైగా నిందితులను కస్టడీకి తీసుకునేముందు భౌతికంగా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడం, నిందితుల ఆరోగ్య పరిస్థితులు, ఇతరత్రా వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలని కూడా తెలియకపోతే ఎలా అని మందలించారు. కొన్ని ప్రశ్నలకు చాలా లోతైన సమాధానాలు చెబుతున్న మీరు.. కొన్ని కీలకమైన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. -
50 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా రవాణా అవుతున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యం రవాణాకు ఉపయోగించిన బోలెరో వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టైర్ మారుస్తుండగా లారీ ఢీ: ఒకరి మృతి
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గొల్కొండ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఓ బొగ్గు లారీ టైర్ పంక్చర్ కావడంతో.. డ్రైవర్, క్లీనర్ టైర్ మార్చే పనిలో ఉన్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వాహనం ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్‌కు గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
250 గ్రాముల బంగారం స్వాధీనం
శంషాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ప్రయాణికులను తనిఖీలు చేస్తుండగా.. కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తి వద్ద 250 గ్రాముల బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఔటర్‌పై లారీ దగ్ధం
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ సమీపంలో ఔటర్ రింగురోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం ఒక లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇసుక లారీ శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగు రోడ్డు వద్దకు రాగానే అదుపు తప్పి వైడర్ను ఢీకొట్టింది. అప్రమత్తమైన లారీ డ్రైవర్, క్లీనర్ కిందికి దూకేశారు. అనంతరం లారీ రింగు రోడ్డుపై నుంచి దాదాపు 30 అడుగుల కిందికి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు లేచి పూర్తిగా కాలిపోయింది. సంఘటన స్థలం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు.