జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ సందర్భంగా అయోధ్య విమానాశ్రయంలో 150 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండోలను మోహరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. ఈ విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించడంపై గతంలో చర్చలు జరిగాయి. కేంద్ర భద్రత , ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమీక్షలో ఈ విమానాశ్రయానికి సీఐఎస్‌ఎఫ్ ప్రొఫెషనల్ సెక్యూరిటీని సిఫార్సు చేశారు.
అయోధ్య విమానాశ్రయ సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతామని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల చెప్పారు. మొదటి దశలో 65,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి గంటకు రెండు నుంచి మూడు విమానాలను నిర్వహించగల సామర్థ్యం దీనికి ఉంటుంది. 2,200 మీటర్ల పొడవున రన్‌వే నిర్మించేందుకు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ విమానాశ్రయంలో బోయింగ్ 737, ఎయిర్ బస్ 319, 320 విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అవకాశం ఉంది.
విమానాశ్రయం రెండో దశ అభివృద్ధికి త్వరలో కేబినెట్ నుంచి ఆమోదం తీసుకుంటామని సింధియా తెలిపారు. రెండో దశలో రన్‌వే పొడవును 2,200 మీటర్ల నుంచి 3,700 మీటర్లకు పెంచనున్నారు. దీని వల్ల రన్‌వే పొడవు దాదాపు నాలుగు కిలోమీటర్లకు పెరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment