కొన్ని క్షణాలు చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తాయి. భారత ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే, హిందువులు ఆరాధించే శ్రీరాముడికి పురాణప్రసిద్ధమైన ఆయన జన్మస్థలి అయోధ్యలో వెలసిన మందిర ప్రారంభం, అక్కడ అయిదేళ్ళ బాలరాముడి విగ్రహానికి సోమవారం జరిపిన ప్రాణప్రతిష్ఠాపన ఘట్టం అలాంటివే. మరో వెయ్యేళ్ళు గుర్తుండిపోయే రోజుగా మోదీ పేర్కొన్న మందిర ప్రారంభ దినాన కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రామనామం ప్రతిధ్వనించింది.
నేపాల్, బాలీ, ట్రినిడాడ్ సహా దేశదేశాల్లోని హిందువులు ఉత్సవం చేసుకున్నారు. వజ్రవైడూర్య ఖచిత స్వర్ణాభరణాలంకృత మందస్మిత బాలరామ రూపసాక్షాత్కారం, సాయంసంధ్యలో సరయూ తీరంలో లక్షల సంఖ్యలో దీపప్రజ్వలనంతో... అనంత కాలగతిలో ఒక చక్రభ్రమణం పూర్తి అయినట్టయింది. నాగరకతలో ఇదొక మహత్తర క్షణమనీ, రామరాజ్య స్థాపనకు తొలి అడుగనీ కొందరంటే... రామరాజ్యమంటే హిందూ రాజ్యం కాదు, ధర్మరాజ్యమనే గాంధీ భావనను ఇతరులు గుర్తుచేయాల్సి వచ్చింది.
అనేక మతఘర్షణలు, దశాబ్దాల రాజకీయ, న్యాయ పోరాటాలు ఈ మందిర నిర్మాణం వెనుక ఉన్నాయి. రామ జన్మభూమిలో 1528లో బాబర్ సైన్యాధ్యక్షుడు మీర్ బాఖీ కట్టినట్టు చెబుతున్న బాబ్రీ మసీదు 1992 డిసెంబర్ 6న కరసేవకుల చేతిలో కూలడం, చివరకు సుప్రీమ్ కోర్టు వేర్వేరుగా ఆలయ – మసీదు నిర్మాణాలకు ఆదేశాలివ్వడం... అలా అది ఓ సుదీర్ఘ చరిత్ర. వెరసి, అయిదు శతాబ్దాల తర్వాత రామ్ లల్లా (బాల రాముడు)కు అది మందిరమైంది. వేలాది ధార్మికుల మొదలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, అశోక్ సింఘాల్, కల్యాణ్ సింగ్ లాంటి నేతల వరకు ఈ ఆలయ నిర్మాణ ఘట్టానికి ప్రేరకులు, కారకులు ఎందరెందరో.
మూడు దశాబ్దాల క్రితం తమ పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాన్ని ఎట్టకేలకు నెరవేర్చిన ఘనత మాత్రం మోదీకి దక్కింది. తెరపై రామ జన్మ భూమి ట్రస్ట్ లాంటి పేర్లున్నా, తెర వెనుక చక్రం తిప్పుతున్నదెవరో తెలియనిది కాదు. వచ్చే మేలో మరోసారి ప్రజాతీర్పు కోరి, వరుసగా మూడోసారి బీజేపీని గద్దెనెక్కించే పనిలో మోదీ ఉన్నారు. హడావిడి, అసంపూర్ణ ఆలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల అస్త్రంగా విమర్శకులు తప్పుబడుతున్నదీ అందుకే. కోట్లాది శ్రద్ధాళువుల ఉత్సాహం అర్థం చేసుకోదగినదైనా, దేశమంతటా ఉద్వేగం రగిలించి, మందిరాన్ని సైతం మెగా ఈవెంట్‌గా మార్చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు లేవనలేం.
‘ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు’ అన్న భావన నుంచి పక్కకు జరిగి, అత్యద్భుత ఆలయ నిర్మాణాలు అవసరమనే విధాన మార్పు వైపు దేశం ప్రయాణించింది. బీజేపీ, మోదీల మందిర రాజకీయాలు ప్రాంతీయ నేతలకూ పాఠమయ్యాయి. ఆలయాలు అనంత రాజకీయ ఫలదాయకమని అందరూ గుర్తించారు. అయోధ్య అక్షతలను ఇంటింటికి పంపే పని ఒకరు చేస్తే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ప్రతి ఇంటా బియ్యం, తాంబూలం సేకరించి, గత బుధవారం పూరీ క్షేత్రంలో ఆలయ విస్తరణ ప్రాజెక్ట్ ‘జగన్నాథ్ పరిక్రమ’ ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శక్తిపీఠాల్లో ఒకటైన కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయ పునర్నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారు. మతానికీ, రాజకీయానికీ ముడివేసే ఈ ప్రయత్నాలు ఎంత దూరం వెళతాయో చెప్పలేం. అడుగడుగున గుడి, అందరిలో దేవుడున్నాడని భావించే భారతీయ సంస్కృతి నడయాడిన నేలపై... అయోధ్యలో మందిరావిష్కారం రోజునే మమత సర్వమత సౌభ్రాతృత్వ యాత్ర చేపట్టడం గమనార్హం.
నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ధార్మిక స్థలాల సందర్శన పెరుగుతోంది. ధార్మిక పర్యాటకంపోటెత్తుతోంది. భారత్‌లో ఏటా 20 కోట్ల మందికి పైగా కాశీని సందర్శిస్తారనీ, రోజుకు లక్ష మందికి పైగా తిరుపతికి వస్తారనీ లెక్క. ఇప్పుడీ జాబితాలో కొత్తగా అయోధ్య చేరనుంది. దేశంలోనే పెద్ద హిందూ దేవాలయంగా నిర్మాణమైన రామమందిరం, సరయూ నదీ తీరంలోని సామాన్య పట్నాన్ని మహానగరంగా మార్చేందుకు వేసిన మెగా ప్రణాళిక, ప్రచార హంగామాతో పరి వ్యాప్త మైన ధార్మిక వాతావరణం... అన్నీ కలసి పురాణ ప్రసిద్ధ శ్రీరామ జన్మస్థలి అయోధ్యను సరికొత్త ఆధ్యాత్మిక గమ్యంగా మారుస్తున్నాయి.
చరిత్ర ప్రసిద్ధ ప్రాంతాలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చి దిద్దడం మన వారసత్వ వైభవానికీ, పర్యాటక వాణిజ్యానికీ మంచిదే. కాకుంటే, రూ. 15 వేల కోట్ల ప్రాజెక్టులు, 85 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ఒకప్పుడు రోజుకు 2 వేల మందికి పరిమితమైన ప్రాంతాన్ని రోజుకు 3 లక్షల పర్యాటకుల స్థాయికి తీసుకెళ్ళే క్రమంలో తగు జాగ్రత్తలూ ముఖ్యం.
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపన, మందిర ప్రారంభాలకు ఉత్సవం చేసుకోవడం సరే. ఈ సంబరాల వేళ సాటి వర్గాలను మానసికంగా ఒంటరివాళ్ళను చేస్తేనే కష్టం. సమస్త జనుల సౌభాగ్యానికి మారుపేరైన ‘రామరాజ్యం’ వైపు నడిస్తేనే సార్థకత. దేశంలోని అన్ని వర్ణాలు, వర్గాల మధ్య సమత, సమానత, సహనం, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొనేలా చూడాల్సింది నాయకులే. ఆ కృషి చేస్తేనే అర్థం, పరమార్థం. శ్రీరాముడు చేసింది అదే. అలాకాక, ‘అయోధ్య అయిపోయింది... కాశీ, మథుర మిగిలింది’ లాంటి రెచ్చగొట్టే నినాదాలతో వైమనస్యాలు పెంచితే, దేశ సమైక్యతకే అది గొడ్డలిపెట్టు.
మరో రావణకాష్ఠానికి మొదటి మెట్టు. ఈ దేశం నీది, నాది, మనందరిదీ అని అన్నివర్గాలూ అనుకోగలిగే ఏకాత్మ భావనే భిన్న సంస్కృతులు, ధర్మాల సమ్మిళితమైన భారతావనికి శ్రీరామరక్ష. పాత తప్పుల్ని తవ్వి తలకుపోసుకొనే పని మాని, కలసి నడవాల్సిన సమయమిది. ఆ దిశలో... నేటికీ కలగానే మిగిలిన నిరుద్యోగ నివారణ, దారిద్య్ర నిర్మూలన, స్త్రీలోకపు సశక్తీకరణ, పీడితజన సముద్ధరణ లాంటి లక్ష్యాలతో మన పాలకులు అడుగులు వేయాలని ఆశిద్దాం. అందరూ ఆ మహా సంకల్పం చెప్పుకొంటేనే ఏ సంబరానికైనా పుణ్యం, పురుషార్థం!
అవిస్మరణీయ క్షణాలు
Published Tue, Jan 23 2024 1:07 AM | Last Updated on Tue, Jan 23 2024 1:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment