అయోధ్యలో ఈనెల 22న జరగబోయే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠాపనకు సంబంధించిన ఆచారాలు, నియమాలు మకర సంక్రాంతి పండుగ నుంచి అంటే నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే 11 మంది దంపతులు నేటినుంచి 45 నియమాలను పాటించనున్నారు.
ప్రాయశ్చిత్తం, గోదానం, దశవిధ స్నానం, ప్రాయశ్చిత్త క్షౌర్యం, పంచగవ్యప్రాశన మొదలైన నియమాలను ఈ 11 మంది దంపతులు పాటించనున్నారు. ఈ నియమాలను పాటించడం ద్వారా వీరు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సక్రమరీతిలో నిర్వహించగలుగుతారని పండితులు చెబుతున్నారు. సోమవారం సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఈ దంపతులంతా మొదటి స్నానం చేసి, ఎనిమిది రోజులపాటు ఈ నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే 11 మంది దంపతులకు వారు పాటించాల్సిన నియమనిబంధనలను తెలియజేసింది. ట్రస్ట్ వీరిచేత ఈ నిబంధనల పాలనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించనుంది. ఈ దంపతులు ఉదయం సాయంత్రం ప్రార్థన,పూజాదికాలలో పాల్గొంటూ నిరంతరం రామనామం జపించాలి. అలాగే సాత్విక ఆహారం తీసుకుంటూ, జీవనశైలి సాత్వికంగా ఉండేలా చూసుకోవాలి. జనవరి 22న అభిజిత్ ముహూర్తపు 84 సెకన్ల కాలంలో వైదిక సంప్రదాయాలను అనుసరించి బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యలో నటి హేమమాలిని నృత్య ప్రదర్శన!
Comments
Please login to add a commentAdd a comment