Ayodhya Ram Mandir: రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవత్రం! | Sarasvati Devi 30 Years Maun Vrat for Ram Temple | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవత్రం!

Published Tue, Jan 9 2024 9:11 AM | Last Updated on Tue, Jan 9 2024 10:31 AM

Sarasvati Devi 30 Years Maun Vrat for Ram Temple - Sakshi

నాడు శబరిలోని విశ్వాసం.. శ్రీరాముడు స్వయంగా ఆమె గుడిసె వద్దకు వచ్చేలా చేసింది. నేడు జార్ఖండ్‌కు చెందిన సరస్వతీదేవిలోని అపార నమ్మకం.. రామాలయం కల సాకారమయ్యేందుకు దోహదపడింది. శ్రీరాముడు తన భక్తురాలైన సరస్వతి కోరిక నెరవేర్చాడు. అందుకే ఆమె జనవరి 22న అయోధ్యకు చేరుకుని, తన 30 ఏళ్ల మౌన వ్రతాన్ని విరమించనుంది. 

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ పరిధిలోని కరమ్‌తాండ్‌లో  ఉంటున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్ 30 సంవత్సరాల క్రితం మౌనవ్రతం చేపట్టింది. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని ఆమె శపథం చేసింది. జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన రోజున ఆమె 'రామ్, సీతారాం' అంటూ మౌన దీక్ష విరమించనుంది. 

శ్రీరాముని స్మరణకే తన జీవితాన్ని అంకితం చేసిన సరస్వతి అగర్వాల్ ఇకపై అయోధ్యలోనే  ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ‘నా జీవితం ధన్యమైంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాలరాముడు నన్ను ఆహ్వానించాడు. నా  ఇన్నాళ్ల తపస్సు సఫలమయ్యింది. 30 ఏళ్ల తర్వాత నా మౌనం వీడనుంది. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమానికి వెళ్లి అక్కడే ఉండాలనుకుంటున్నాను’ అని ఆమె మీడియాకు తెలిపింది. 

సరస్వతి అగర్వాల్‌కు అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దీంతో సరస్వతీ దేవి సోదరులు ఆమెను ఇప్పటికే అయోధ్యకు తీసుకువచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశి దాస్ సరస్వతి తదితరులు ఆమెను అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో స్వాగతించారు. ఆమె 4 నెలల పాటు స్వామీజీ ఆశ్రమంలో ఉండనున్నారు.

సరస్వతి అగర్వాల్ 1992 మేలో అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఆమె రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. ఆయన ఆశీర్వాదంతో ఆమె కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశాక చిత్రకూట్‌లో ఏడున్నర నెలల పాటు కల్పవాసంలో ఉండిపోయారు. రోజూ 14 కిలోమీటర్ల కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశారు.  1992, డిసెంబర్ 6న ఆమె తిరిగి నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. ఆయన స్ఫూర్తితో మౌన వ్రతం మొదలుపెట్టారు.  రామాలయ నిర్మాణం పూర్తయ్యాక మౌన వ్రతం వీడాలని ఆమె నిశ్చయించుకున్నారు.

సరస్వతీదేవి ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. ఆమె భర్త ఆమెకు అక్షర జ్ఞానం  అందించారు. ఆమె రామ చరిత మానసతో పాటు ఇతర గ్రంథాలను రోజూ చదువుతారు. రోజుకు ఒకసారి సాత్విక ఆహారం తీసుకుంటారు. ఆమె భర్త 35 ఏళ్ల క్రితం మృతి చెందారు. వారికి  ఎనిమిదిమంది సంతానం. ఆమె మౌన దీక్ష చేపట్టినప్పుడు వారంతా ఆమెకు సహకరించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement