
కిషన్‌రెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌కు వినతిపత్రం ఇస్తున్న విశ్వేశ్వర్‌రెడ్డి, అర్వింద్, నగేశ్, బండి సంజయ్, ఈటల
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కేంద్రమంత్రులు, ఎంపీల వినతి
పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని లేవనెత్తిన ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి
సాక్షి, న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి (హెచ్‌సీయూ) చెందిన 400 ఎకరాల భూమి విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభు త్వానికి బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిలో 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులు ఉన్నా యని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గొడెం నగేశ్‌ల బృందం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది. ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన అనంతరం బీజేపీ ఎంపీలు తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధిష్టానానికి కప్పం కట్టేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భూములను అమ్ముతోందని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. హెచ్‌సీయూ భూముల విషయంలో ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. భూముల అమ్మకం విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరుగానే కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు.
ట్రిపుల్‌ఆర్ రాజ్యాంగం అమలవుతోంది: లక్ష్మణ్
తెలంగాణలో రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి రాజ్యాంగమే అమలవుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దుయ్యబట్టారు. మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ లేవనెత్తారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు తీర్చలేకే ప్రభుత్వం భూములను అమ్ముతోందన్నారు. లోక్‌సభలో ధర్మపురి అర్వింద్ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ.. భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేసేందుకు చొరవ చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుకుంటాం: భూపేంద్ర యాదవ్
హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూములపై నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలకు హామీ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ బీజేపీ ఎంపీలు భూపేంద్ర యాదవ్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని ఆ భూములను పరిరక్షించాలని కోరారు.