sabari yatra
-
Ayodhya Ram Mandir: రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవత్రం!
నాడు శబరిలోని విశ్వాసం.. శ్రీరాముడు స్వయంగా ఆమె గుడిసె వద్దకు వచ్చేలా చేసింది. నేడు జార్ఖండ్‌కు చెందిన సరస్వతీదేవిలోని అపార నమ్మకం.. రామాలయం కల సాకారమయ్యేందుకు దోహదపడింది. శ్రీరాముడు తన భక్తురాలైన సరస్వతి కోరిక నెరవేర్చాడు. అందుకే ఆమె జనవరి 22న అయోధ్యకు చేరుకుని, తన 30 ఏళ్ల మౌన వ్రతాన్ని విరమించనుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పరిధిలోని కరమ్‌తాండ్‌లో ఉంటున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్ 30 సంవత్సరాల క్రితం మౌనవ్రతం చేపట్టింది. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని ఆమె శపథం చేసింది. జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన రోజున ఆమె 'రామ్, సీతారాం' అంటూ మౌన దీక్ష విరమించనుంది. శ్రీరాముని స్మరణకే తన జీవితాన్ని అంకితం చేసిన సరస్వతి అగర్వాల్ ఇకపై అయోధ్యలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ‘నా జీవితం ధన్యమైంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాలరాముడు నన్ను ఆహ్వానించాడు. నా ఇన్నాళ్ల తపస్సు సఫలమయ్యింది. 30 ఏళ్ల తర్వాత నా మౌనం వీడనుంది. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమానికి వెళ్లి అక్కడే ఉండాలనుకుంటున్నాను’ అని ఆమె మీడియాకు తెలిపింది. సరస్వతి అగర్వాల్‌కు అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దీంతో సరస్వతీ దేవి సోదరులు ఆమెను ఇప్పటికే అయోధ్యకు తీసుకువచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశి దాస్ సరస్వతి తదితరులు ఆమెను అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్లో స్వాగతించారు. ఆమె 4 నెలల పాటు స్వామీజీ ఆశ్రమంలో ఉండనున్నారు. సరస్వతి అగర్వాల్ 1992 మేలో అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఆమె రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. ఆయన ఆశీర్వాదంతో ఆమె కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశాక చిత్రకూట్‌లో ఏడున్నర నెలల పాటు కల్పవాసంలో ఉండిపోయారు. రోజూ 14 కిలోమీటర్ల కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశారు. 1992, డిసెంబర్ 6న ఆమె తిరిగి నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. ఆయన స్ఫూర్తితో మౌన వ్రతం మొదలుపెట్టారు. రామాలయ నిర్మాణం పూర్తయ్యాక మౌన వ్రతం వీడాలని ఆమె నిశ్చయించుకున్నారు. సరస్వతీదేవి ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. ఆమె భర్త ఆమెకు అక్షర జ్ఞానం అందించారు. ఆమె రామ చరిత మానసతో పాటు ఇతర గ్రంథాలను రోజూ చదువుతారు. రోజుకు ఒకసారి సాత్విక ఆహారం తీసుకుంటారు. ఆమె భర్త 35 ఏళ్ల క్రితం మృతి చెందారు. వారికి ఎనిమిదిమంది సంతానం. ఆమె మౌన దీక్ష చేపట్టినప్పుడు వారంతా ఆమెకు సహకరించారు. -
శబరిమల: బాటిల్ తిరిగిస్తే డబ్బు వాపస్
తిరువనంతపురం: కరోనా దెబ్బకు దేవుడు సైతం చీకటిలో ఉండాల్సిన రోజులు వచ్చాయి. ఎంతో ప్రాముఖ్యత పొందిన కేరళ దివ్య జ్యోతికి ఆటంకం రాకుండా .. సరైన సమయానికి కోవిడ్ నిబంధనలతో శబరిమల అయ్యప్ప దర్శనానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ఔషధ జలాన్ని ఇక నుంచి బాటిళ్లలో సరఫరా చేయనున్నట్లు బోర్డు ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ బాటిళ్లలో నీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ ఔషధ నీరు బాటిళ్లలో కావాలనుకుంటే రూ.200ను ముందస్తుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నీటిని పంబా బేస్ క్యాంప్ దగ్గర ఉండే ఆంజనేయ ఆడిటోరియం వద్ద అందిస్తారు. డిపాజిట్ చేసిన సొమ్మును బాటిల్ తిరిగి ఇచ్చేసిన తర్వాత తిరిగి చెల్లిస్తారు. ఈసారి స్టీల్ బాటిళ్లతో పాటు పేపర్ గ్లాసుల్లోనూ ఈ ఔషధ నీటిని అందజేయనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది. ఔషధ జలం అంటే..? యాత్రికులు ఎక్కువగా వచ్చే సమయాల్లో అయ్యప్ప భక్తులకు ఔషధాలు కలిపిన నీటిని ఏటా అందిస్తారు. ఛుక్ (ఎండు అల్లం), రమాచామ్ (వెటివర్), పతి ముఖం (పతంగ కట్ట) వంటి ఆయుర్వేద మూలికలతో నీటిని వేడి చేసి దీన్ని తయారు చేస్తారు. పంపిణీ కేంద్రాల్లోనే ఈ నీటిని తయారు చేసి భక్తులకు ఇస్తారు. పంబా, చరల్మేడు, జ్యోతినగర్, మలికప్పురం పాయింట్ల వద్ద ఔషద జలం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
శబరి రైళ్లలో దళారుల ‘ప్రత్యేక’ దగా!
ఇప్పటికే నిండిపోయిన బెర్తులు తప్పని వెయిటింగ్ లిస్ట్ రెట్టింపు చార్జీలకు టిక్కెట్ల విక్రయం అయ్యప్ప భక్తులకు ప్రయాణ కష్టాలు సాక్షి, సిటీబ్యూరో: శబరి యాత్ర అయ్యప్ప భక్తులకు భారంగా మారుతోంది. ప్రత్యేక రైళ్ల కోసం ముందస్తుగానే పాగా వేసిన మధ్యవర్తులు టిక్కెట్లు కొల్లగొట్టుకొనిపోయారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన 132 ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భక్తులను వెక్కిరిస్తోంది. మధ్యవర్తుల నుంచి టిక్కెట్లు కొనుక్కోవడానికి భక్తులు రెట్టింపు చార్జీలు చెల్లించక తప్పడం లేదు. అనధికార ఏజెంట్లు, వారికి సహకరించే కొందరు రైల్వే సిబ్బంది కారణంగా టిక్కెట్ చార్జీలకు రెక్కలొస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో బెర్తులన్నీ బుక్ అయిపోవడంతో భక్తులు అనధికార ఏజెంట్లను ఆశ్రయించవలసి వస్తోంది.మరోవైపు గతంలో లేని విధంగా ఈ ఏడాది ప్రత్యేక రైళ్లకు 30 శాతం అదనపు చార్జీలు విధించారు. దీంతో రూ.550 ఉండే స్లీపర్ చార్జీ రూ.650 దాటింది. ఏజెంట్లకు భక్తులు ఒక్కో టిక్కెట్‌కు రూ.1250 వరకు చెల్లించవలసి వస్తోంది. డిమాండ్ కారణంగా ఏజెంట్ల వద్ద కూడా టిక్కెట్లు లభించడం లేదు. పాగా ఇలా.. ప్రత్యేక రైళ్లలో భక్తులకు టిక్కెట్లు దక్కకుండా అనధికార వ్యక్తులు తమ వాళ్లను రంగంలోకి దించుతారు. నగరంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ బుకింగ్ కేంద్రాల వద్ద కౌంటర్లు తెరుచుకోవడానికి ముందే వారి అనుచరులు లైన్లలో మోహరించి ఉంటారు. దీంతో నిజమైన భక్తులకు టిక్కెట్లు లభించడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు ఎంఎంటీఎస్ స్టేషన్లు, ఇతర బుకింగ్ కేంద్రాల్లోనూ మధ్యవర్తులదే హవా. ఏటా సీజన్‌కు అనుగుణంగా పెద్ద మొత్తంలో టిక్కెట్లను హస్తగతం చేసుకొనే మధ్యవర్తులు అధిక ధరలకు వాటిని తిరిగి భక్తులకు విక్రయిస్తున్నారు. గతంలో ఉన్నట్లుగా టిక్కెట్ బుకింగ్ సమయంలో గుర్తింపు కార్డులు సమర్పించాలనే నిబంధన లేకపోవడంతో పెద్ద సంఖ్యలో ఏజెంట్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రకటించిన 132 ప్రత్యేక రైళ్లలో బెర్తులన్నీ బుక్ అయిపోవడమే కాకుండా వెయిటింగ్ లిస్టు 100 నుంచి 150కి చేరుకోవ డమే దళారుల హవాకు నిదర్శనం. భారంగా రైలు ప్రయాణం రోడ్డు మార్గంలో ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడం ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. పైగా ఫిట్నెస్ లేని డొక్కు వాహనాలను అప్పగిస్తారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని రైళ్లను ఆశ్రయిస్తే మధ్యవర్తులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో టిక్కెట్లు ఎగురేసుకెళ్తున్నారు. దీంతో రెట్టింపు చార్జీలు చెల్లించవలసి వస్తోందని అయ్యప్ప భక్తులు వాపోతున్నారు. ఏటా అరకొర రైళ్లే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. అరకొర రైళ్లు ప్రకటిస్తారు. ఒక్క హైదరాబాద్ నుంచే కనీసం ఐదారు లక్షల మంది భక్తులు శబరికి వెళ్తారు. కానీ రైళ్లు మాత్రం చాలా పరిమితంగా ఉంటాయి. కౌంటర్ల వద్ద ఏజెంట్ల ప్రభావమే కనిపిస్తుంది. ఒక్క కౌంటర్ల వద్దనే కాదు. రైళ్లలోనూ ఎలాంటి తనిఖీలు ఉండవు. టీసీలు అసలు పట్టించుకోవడం లేదు. బినామీ పేర్లపైన వచ్చే వాళ్లపైన ఎలాంటి నియంత్రణ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.