
న్యూఢిల్లీ: అయోధ్యలోని జన్మస్థలానికి శ్రీరాముడి ప్రవేశం, ఆలయ ప్రాణప్రతిష్ట ఉత్సవం ‘భరతవర్ష’పునర్నిర్మాణానికి నాంది అని రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ‘భరతవర్ష’లో సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం, శాంతి, అభివృద్ధి, ఐక్యత, సామరస్య సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ వెబ్‌సైట్‌లో ఆదివారం ఆయన రాసిన వ్యాసం పోస్ట్ అయ్యింది.
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం హిందూ సమాజం పోరాటం, సంక్షోభాలు ఇక ముగిసి పోవాలని ఆయన ఆకాంక్షించారు. అయోధ్య పునర్నిర్మాణం ఇక మనందరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధికులు పూజించే దైవం శ్రీరాముడేనని ఆయన తెలిపారు. మందిర నిర్మాణం ‘జాతి గౌరవానికి పునరుజ్జీవనం’గా ఆయన అభివర్ణించారు. ‘‘రామజన్మభూమిలో రామ్ లల్లా ప్రవేశం, ప్రాణ ప్రతిష్ట భరతవర్ష పునర్నిర్మాణానికి నాంది. ఇది అందరి శ్రేయస్సు కోసం, భేదభావం లేకుండా అందరినీ అంగీకరించడం, సామరస్యం, ఐక్యత, పురోగతి, శాంతి మార్గాన్ని చూపుతుంది. యావత్ ప్రపంచ పునర్నిర్మాణానికి బాటలు వేస్తుంది’’ అని భాగవత్ అన్నారు.