న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా శోభిల్లనుంది. దేశంలోని ఇతర ప్రముఖ ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలను దాటి పర్యాటకుల సందర్శన పరంగా అయోధ్య మొదటి స్థానానికి చేరుకోనుంది. బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ వేసిన అంచనా ప్రకారం ఏటా సుమారు 5 కోట్ల మంది సందర్శకులు అయోధ్యకు రానున్నారు.
నూతన విమానాశ్రయం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, టౌన్‌షిప్, రహదారుల అనుసంధానం కోసం చేసిన 10 బిలియన్ డాలర్ల వ్యయానికి తోడు కొత్త హోటళ్ల రాక ఇవన్నీ అయోధ్యలో ఆర్థిక కార్యకలాపాల విస్తృతిని పెంచుతాయని జెఫరీస్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
అంతర్జాతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య విలసిల్లుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో ఎంతో విశిష్టత కలిగిన తిరుమల ఆలయాన్ని ఏటా 3 కోట్ల మంది వరకు భక్తులు సందర్శిస్తున్నారు. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు సైతం ఇదే స్థాయిలో సందర్శకులు వస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే వాటికన్ సిటీని ఏటా 90 లక్షల మంది, సౌదీ అరేబియాలోని మక్కాను 2 కోట్ల మంది సందర్శిస్తున్నారు.
ఊపందుకోనున్న టూరిజం
‘‘ఆధ్యాత్మిక పర్యాటకం అనేది భారత పర్యాటక రంగంలో అతిపెద్ద విభాగంగా ఉంది. మౌలిక వసతుల సమస్యలు ఉన్నప్పటికీ పలు ప్రముఖ ఆధాతి్మక కేంద్రాలకు ఏటా 1–3 కోట్ల మధ్య పర్యాటకులు విచ్చేస్తున్నారు. మరింత మెరుగైన వసతులు, అనుసంధానంతో కొత్తగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కేంద్రం (అయోధ్య) చెప్పుకోతగ్గ స్థాయిలో ఆర్థిక ప్రభావం చూపించనుంది’’అని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది.
కరోనాకు ముందు 2018–19 ఆర్థిక సంవత్సరం జీడీపీలో పర్యాటక రంగం 194 బిలియన్ డాలర్ల వాటా కలిగి ఉంటే, అది ఏటా 8 శాతం కాంపౌండెడ్ వృద్ధితో 2022–23 నాటికి 443 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. దేశ జీడీపీలో పర్యాటక రంగం వాటా 6.8 శాతంగా ఉందని, అభివృద్ధి చెందిన, ప్రముఖ అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నట్టు వివరించింది. ‘‘పర్యాటకం అయోధ్యకు ఆర్థికపరమైన, మతపరమైన వలసలను పెంచుతుంది. దీంతో హోటళ్లు, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ, ఎఫ్‌ఎంసీజీ, పర్యాటక అనుబంధ రంగాలు, సిమెంట్ రంగాలు లాభపడనున్నాయి’’అని జెఫరీస్ పేర్కొంది.
అయోధ్యలో వసతులు
అయోధ్య ఎయిర్‌పోర్ట్ మొదటి దశ అందుబాటులోకి రాగా, ఏటా 10 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 60 లక్షల ప్రయాణికుల సామర్థ్యానికి సేవలు అందించే అదనపు దేశీయ, అంతర్జాతీయ టెరి్మనల్ 2025 నాటికి రానుంది. రోజువారీ 60 వేల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. 1,200 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్ నిర్మాణాన్ని తలపెట్టారు. రోడ్ల కనెక్టివిటీని పెంచారు. ప్రస్తుతం 17 హోటళ్లు 590 రూమ్‌లను కలిగి ఉన్నాయి.
కొత్తగా 73 హోటళ్లకు ప్రణాళికలు ఉన్నాయి. ఇందులో 40 హోటళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. ఇండియన్ హోటల్స్, మారియట్, విందమ్ ఇప్పటికే హోటళ్ల కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీసీ సైతం హోటల్ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ఓయో సైతం 1,000 హోటల్ రూమ్‌లను తన ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment