ముంబై: అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బీ) జనవరి 22న సగం రోజు మాత్రమే పనిచేస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తిగత వ్యవహారాలు, శిక్షణా శాఖ కూడా ఒక కీలక ఉత్వర్వులు జారీచేస్తూ, జనవరి 22న కేంద్ర ప్రభుత్వ స్థాపనను సగం రోజు పనిదినాన్ని ప్రకటించింది.
ఇక మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న మనీ మార్కెట్లు మూతపడనున్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు (ప్రాధమిక– ద్వితీయ), విదేశీ మారకద్రవ్యం, ద్రవ్య మార్కెట్లు, రూపీ ఇంట్రస్ట్ డెరివేటివ్‌లలో ఎటువంటి లావాదేవీలు, సెటిల్‌మెంట్లు ఉండబోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఒక సర్క్యులర్‌లో తెలిపింది.
ఇక రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను మార్చుకునే, డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కూడా 22వ తేదీ ఉండదని ఆర్‌బీఐ మరో సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ సౌలభ్యం తిరిగి జనవరి 23వ తేదీన ప్రారంభమవుతుంది. ‘‘భారత ప్రభుత్వం ప్రకటించిన సగం రోజు పని దినం కారణంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనూ 2024 జనవరి 22, సోమవారం రూ. 2000 నోట్ల మార్పిడి/డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదు’’ అని సెంట్రల్ బ్యాంక్ ప్రకటన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment