
ఖమ్మం జిల్లాలో పోలీసులు వృద్ధ గిరిజనుడి కాలు విరగ్గొట్టారని ఆరోపణ
బైక్‌పై నుంచి కిందపడితే ఆస్పత్రిలో చేర్చామంటున్న ఎస్సై
కారేపల్లి: హత్య కేసులో విచారణ పేరుతో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని..దీంతో వృద్ధుడైన ఓ గిరిజనుడి కాలు విరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రూప్లాతండాకు చెందిన బధిరుడైన భూక్యా హరిదాస్ గత ఏడాది డిసెంబర్ 6న గ్రామంలోని జీపీ బోరు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో బావ్‌సింగ్‌తోపాటు విశ్రాంత సింగరేణి ఉద్యోగి శంకర్, హరిదాస్ కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శంకర్ ఆచూకీ పోలీసులకు లభించలేదు.
ఐదు నెలల తర్వాత శుక్రవారం శంకర్‌ను అదుపులోకి తీసుకొని కామేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణలో భాగంగా శంకర్‌పై థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతో ఆయన కాలు విరిగిందని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఆరోపించారు. అయితే వాహనంపై నుంచి కిందపడటంతో శంకర్ కాలు విరిగిందని బుకాయిస్తూ, బాధిత కుటుంబం మీడియా ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
శంకర్‌ను చికిత్స నిమిత్తం ఖమ్మంకు, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కారేపల్లి ఎస్సై రాజారామ్‌ను వివరణ కోరగా.. శంకర్ కొద్దినెలలుగా పరారీలో ఉన్నాడని, శనివారం కనిపించడంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. ఈ క్రమంలో బైక్‌పై వేగంగా వెళుతూ కింద పడ్డాడని చెప్పారు. గాయపడిన శంకర్‌ను తమ వాహనంలోనే ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించామని పేర్కొన్నారు. థర్డ్‌డిగ్రీ ప్రయోగించినట్టు చెబుతున్న విషయంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.