ప్రేమించిన బాలికతో పరారైన బాలుడి తల్లిని వేధించిన ఎస్‌ఐ
ఠాణాకు పిలిపించి కాళ్లు, చేతులు వాచిపోయేలా లాఠీ దెబ్బలు
మూడు నెలలుగా పోలీస్ స్టేషన్‌కు హాజరవుతున్న బాధితురాలు
బషీరాబాద్‌లో మరో ‘షాద్‌నగర్’ తరహా ఉదంతం..
బషీరాబాద్: షాద్‌నగర్ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరవకముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మరో దారుణం.. పదహారేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడైన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ బాలుడి తల్లిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. రోజూ స్టేషన్‌కు పిలవడం.. కొడుకు గురించి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తూ సాయంత్రం వరకు కూర్చోబెట్టడం.. మధ్యలో లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం.. గడిచిన మే నుంచి ఆగస్టు 15 వరకూ ఇదే వరస.. కాలూచేయీ కూడ దీసుకోలేని స్థితిలో భర్త.. తను పనికి వెళ్తే కానీ పూట గడవని దుస్థితి.. పోలీసులు మాత్రం ఆమె పొట్టకొడుతూ మూడున్నర నెలలుగా ఠాణా చుట్టూనే తిప్పుతున్నారు.
పంద్రాగస్టు సందర్భంగా వార్తా సేకరణకు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు దీనస్థితిలో స్టేషన్ ముందు కూర్చున్న ఆమె కంటపడింది. ఆరా తీస్తే ఈ దారుణం వెలుగుచూసింది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
కుమారుడిపై కిడ్నాప్ కేసు..
బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్ (17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక (16) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మే 2న ఇంట్లోంచి పారిపోయారు. తమ కూతురును నరేష్ కిడ్నాప్ చేశాడంటూ బాలిక కుటుంబసభ్యులు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మే 4న నరే‹Ùపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలుడి తల్లి కళావతి, తండ్రి నర్సప్ప కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. పోలీసులు కళావతిని మే నెలలోనే ఠాణాకు పిలిపించారు. ఎస్‌ఐ రమేశ్‌కుమార్ ఆమెను విచారిస్తూ.. ‘నీ కొడుకు మైనర్ పిల్లను ఎత్తుకొనిపోయాడు.
వాడు ఎక్కడున్నాడో రెండు రోజుల్లో వెతికి తీసుకురావాలి. లేదంటే వాణ్ణి నేనే పట్టుకొచ్చి తుపాకీతో కాల్చి చంపేస్తా..’అంటూ బెదిరించాడు. దీనికి కళావతి స్పందిస్తూ.. ‘కూలి పనులు చేసుకునే మాకు ఏం తెలుసు సారూ.. వాడు పట్నంలో పనిచేసుకునేవాడు. కాశీంపూర్ పిల్లతో ప్రేమ కుదిరింట. అది పిల్ల తల్లికి కూడా తెలుసు. వారు ఎక్కడికి పోయారో నాకు తెలీదు’ అని చెప్పింది. దీంతో ఎస్‌ఐ ఒక్కసారిగా ఆవేశానికి లోనై లాఠీతో విచక్షణారహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని, నడవడానికి కూడా రాలేదని బాధితురాలు వాపోయింది.
‘ఆ రోజు నుంచి ప్రతీ రోజు పోలీస్ స్టేషన్‌కి వస్తున్నా. రోజూ ఉదయం 9 గంటలకు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కూర్చోవాలి. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. ఆకలితో రాత్రి 9 గంటల వరకు ఉండి సారుకు చెప్పి ఇంటికెళ్తున్న. నిన్న ఒక్క రోజే (బుధవారం) స్టేషన్‌కు రాలేదు’అంటూ ఠాణాకు వెళ్లిన విలేకరులకు చెబుతూ కళావతి కన్నీటి పర్యంతమైంది. రోజు కూలి పనులు చేసుకునే తమకు మూడు నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఎస్‌ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కళావతికి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
విచారణ జరుపుతాం: అశోక్, సీఐ తాండూరు రూరల్
కిడ్నాప్ కేసు విషయం మా దృష్టిలో ఉంది. కిడ్నాపర్ మైనర్ అయినా అరెస్టు చేయాల్సిందే. విచారణలో భాగంగా బాలుడి తల్లిని బషీరాబాద్ ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిచి విచారించారు. ఎస్‌ఐ ఆమెను కొట్టాడనే విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరుపుతాం.
Comments
Please login to add a commentAdd a comment