ambiguity
-
బీమా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
న్యూఢిల్లీ: బీమా ఒప్పందాల్లో అస్పష్టత, షరతులు అసౌకర్యంగా ఉండడం వంటి ఆరు అంశాలను కేంద్ర ప్రభుత్వం బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ), బీమా కంపెనీల ముందు ప్రస్తావించింది. వెంటనే వీటిని పరిష్కరించాలని, అపరిష్కృతంగా ఉన్న వినియోగదారుల కేసులను తగ్గించాలని బుధవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో కోరింది. కోర్టు బయట పరిష్కారాల విషయమై బీమా కంపెనీల ప్రతినిధులకు అధికారాల్లేకపోవడం, వినియోగదారులతో ఒప్పందంపై సంతకం చేయించుకోవడానికి ముందు పాలసీకి సంంధించి అన్ని డాక్యుమెంట్లను అందించకపోవడం, ముందు నుంచీ ఉన్న వ్యాధుల పేరిట క్లెయిమ్‌లను తిరస్కరించడం, పంట బీమా క్లెయిమ్‌లను కేంద్ర పథకంతో ముడిపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. ప్రస్తుతం దేశంలో వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 20 శాతానికి పైగా బీమా రంగానికి సంబంధించే ఉంటున్నాయనేది వాస్తవం ‘‘ఐఆర్డీఏఐ, ఇతర భాగస్వాముల (బీమా సంస్థలు, టీపీఏలు) వద్ద ఈ అంశాలను ప్రస్తావించాం. బీమా సంస్థలు స్వచ్చందంగా వీటిని పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాం. అవసరనుకుంటే వీటిని తప్పనిసరి చేయాలని ఐఆర్‌డీఏఐని కోరతాం’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ అంశాల వల్లే దేశవ్యాప్తంగా బీమాకు సంబంధించి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమ 8 శాతం విస్తరణ రేటును చేరుకోవాలంటే, ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెరిగిపోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. బీమా పాలసీ నిబంధనలు, షరతులు సులభతరంగా, స్పష్టంగా, అర్థం చేసుకోతగిన భాషలో ఉంటే ఫిర్యాదులను తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. నియమ నిబంధనలు, షరతులను పూర్తిగా అర్థం చేసుకోకుండా డాక్యుమెంట్‌పై సంతకం చేయరాదన్న అవగాహనను పాలసీదారుల్లో కాల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. -
Telangana: చి‘వరి’కి ఏమవుతుందో?
వానాకాలం సీజన్లో వచ్చే ధాన్యంలో కనీసం 80 లక్షల టన్నుల మేర తీసుకోవాలని ఎఫ్‌సీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. కానీ తొలుత 48 లక్షల టన్నులే సేకరిస్తామని ఎఫ్‌సీఐ చెప్పింది. తర్వాత 60 లక్షల టన్నులు తీసుకునేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో మిగతా ధాన్యాన్ని ఎవరు సేకరించాలన్నది ప్రశ్నగా మారింది. దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం వరిపంట కోతకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ధాన్యం కొనుగోళ్లపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. ధాన్యం సేకరణ విషయంగా కేంద్రం నుంచి మద్దతు కొరవడటం, అదే సమయంలో రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి రానుండటంతో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనీసం 90 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. కేంద్రం 60 లక్షల టన్నులకు మించి సేకరించలేమని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఏమిటి, కొన్నా ఎక్కడ నిల్వ చేయాలి, ఇందుకు ఏమేం చర్యలు తీసుకోవాలి అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అంత కొనలేం..! రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలంలో నీటి లభ్యత పెరగడంతో రైతులు భారీగా వరి సాగు చేశారు. సుమారు 1.38 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని.. ఇందులో స్థానిక అవసరాలు, మిల్లర్ల అవసరాలు, పొరుగు రాష్ట్రాల నుంచి జరిగే క్రయవిక్రయాలు పోనూ కనీసం 90 లక్షల టన్నులకుపైగా సేకరించాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. గత ఏడాది వానాకాలం లో 48.85 లక్షల టన్నులే సేకరించగా.. యాసంగిలో రికార్డు స్థాయిలో 92 లక్షల టన్నుల సేకరణ జరిగింది. అయితే ప్రస్తుత వానాకాలంలో ధాన్యం సేకరణకు సంబంధించి భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అనేక కొర్రీలు పెడుతోంది. ధాన్యం తక్కువగా కొంటామని, అందులోనూ ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తీసుకోబోమని చెప్తోంది. మిల్లుల్లోనే ధాన్యం.. గోదాముల కొరత గత యాసంగికి సంబంధించిన ఉప్పుడు బియ్యాన్ని తీసుకునే విషయంలోనే ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతూ వచ్చింది. 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకుంటామని పేర్కొంది. అయితే రాష్ట్రం ఒత్తిడితో మరో 20 లక్షల టన్నులు తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఇందులో మొత్తంగా 44.75 లక్షల టన్నులకుగాను ఎఫ్‌సీఐ ఇప్పటివరకు మిల్లర్ల నుంచి 18 లక్షల టన్నులే తీసుకుంది. మరో 26 లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉంది. ఈ ధాన్యా న్ని కూడా ప్రతి నెలా 3–4 లక్షల టన్నులకు మించి తరలించలేకపోతోంది. ప్రస్తుత నిల్వలు ఖాళీ అయ్యేందుకు సమయం పట్టే అవకాశముంది. గోదాములు ఇప్పటికే నిండిపోయాయి. మరోవైపు వానాకాలం దిగుబడులు పోటెత్తనున్నాయి. దీంతో ఆ ధాన్యం నిల్వ సమస్యగా మారుతోంది. కార్యాచరణ ప్రణాళిక ఏదీ? రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికీ కార్యాచరణ ఖరారు కాలేదు. దసరాకు ముందే ప్రణాళిక సిద్ధం చేసి, ఆ తర్వాత కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉన్నా ఇంతవరకు ప్రక్రియ మొదలుకాలేదు. గత ఏడాది వానాకాలంలో 48.85 లక్షల టన్నుల మేర చేసిన సేకరణ కోసం 600కుపైగా కొనుగోలు కేంద్రాలు అవసరమయ్యాయి. ఈ ఏడాది భారీగా కొనుగోళ్లు చేయాల్సి ఉండటంతో.. రెట్టింపు కొనుగోలు కేంద్రాలు అవసరమని అంచనా. ప్రతీ కొనుగోలు కేంద్రం వద్ద ఈ–అకౌంటింగ్ నిర్వహించడంతోపాటు, నిర్వాహకులు కంప్యూటర్, ప్రింటర్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. దీనితోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం షెల్ట ర్లు, తాగునీరు, మరుగుదొడ్లు, అవసరమైన ప్లాడీ క్లీనర్లు, విన్నోవింగ్ మెషీన్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లను సమకూర్చుకోవాలి. ఈ ఏర్పాట్లకు సంబంధించి వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంది. -
గందరగోళం.. 14 లేదా 17న...
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌కు మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న స్థితిలో కూడా భారత బృందం టోక్యో వెళ్లే తేదీ విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆటగాళ్లు ఈ నెల 14న వెళతారా లేక 17న అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆటగాళ్లంతా 17న బయల్దేరతారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా మూడు రోజుల క్రితం ప్రకటించగా, 14న పయనం కావాల్సి ఉందంటూ తాజాగా అదే ఐఓఏ నుంచి ఆటగాళ్లు, క్రీడా సమాఖ్యలకు మెసేజ్ వచ్చింది. నిబంధనల ప్రకారం స్వదేశం నుంచి బయల్దేరే ముందు వరకు వరుసగా ఏడు రోజుల పాటు అథ్లెట్లు ఆర్టీ–పీసీఆర్ కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. 14న బయల్దేరాలంటే కచ్చితంగా బుధవారం నుంచే వారి కోవిడ్ పరీక్షలు ప్రారంభం కావాలి. ఆలస్యమైతే మరో మూడు రోజులు అదనంగా పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా జూలై 23 నుంచే ఆర్చరీ పోటీలు జరుగుతాయి కాబట్టి ఆర్చర్లు ఇక్కడ ముందుగానే సాధన నిలిపేయాల్సి ఉంటుంది. ఈ గందరగోళ పరిస్థితిని నివారించి తమకు పక్కా సమాచారం అందించాలని వివిధ క్రీడా సమాఖ్యలు ఐఓఏను కోరుతున్నాయి. మరోవైపు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల విషయంలోనైతే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోగా... ఎప్పుడైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని, 24 గంటల ముందు మాత్రమే తెలియజేస్తామని చెప్పడం విశేషం. -
సింధు జలాలపై సందిగ్ధతే
వాషింగ్టన్: సింధు నదీజలాల ఒప్పందంపై భారత్–పాక్ మధ్య జరిగిన తాజా చర్చలు సత్ఫలితాలనివ్వలేదు. వాషింగ్టన్లో ప్రపంచబ్యాంకు కార్యాలయంలో భారత్, పాకిస్తాన్ మధ్య రాత్లే, కిషన్‌గంగ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై రెండ్రోజులపాటు జరిగిన రెండో విడత చర్చలూ ఫలితం తేలకుండానే ముగిశాయి. చర్చల్లో సయోధ్య కుదిరేంతవరకు తమ ప్రయత్నం కొనసాగుతోందని ప్రపంచబ్యాంకు తెలిపింది. సింధు నదీ జలాల ఒప్పందానికి లోబడి కిషన్‌గంగ, రాత్లే జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక అంశాలపై ఇరుదేశాల మధ్య కార్యదర్శి స్థాయి చర్చలు జరిగాయి. భారత్–పాక్ దేశాల మధ్య 9 ఏళ్లపాటు సుదీర్ఘమైన చర్చలు జరిగిన అనంతరం ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఇరుదేశాల మధ్య వివాదాలు, భేదాభిప్రాయాలు తలెత్తినపుడు పరిష్కరించే విషయంలో ప్రపంచబ్యాంకు పాత్ర పరిమితంగానే ఉంటుంది. భారత్, పాక్‌లలో ఎవరైనా ఒకరు కోరితే తప్ప ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉండదు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ నేతృత్వంలో భారత బృందం ఈ చర్చల్లో పాల్గొంది. ఇందులో సింధు నదీ జలాల కమిషనర్, విదేశాంగ శాఖ, కేంద్ర జల సంఘం ప్రతినిధులున్నారు. ఆగస్టు ఒకటిన జరిగిన తొలి విడత చర్చలూ ఎటూతేలకుండానే ముగిశాయి.