న్యూఢిల్లీ: బీమా ఒప్పందాల్లో అస్పష్టత, షరతులు అసౌకర్యంగా ఉండడం వంటి ఆరు అంశాలను కేంద్ర ప్రభుత్వం బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ), బీమా కంపెనీల ముందు ప్రస్తావించింది. వెంటనే వీటిని పరిష్కరించాలని, అపరిష్కృతంగా ఉన్న వినియోగదారుల కేసులను తగ్గించాలని బుధవారం ఢిల్లీలో జరిగిన సదస్సులో కోరింది. కోర్టు బయట పరిష్కారాల విషయమై బీమా కంపెనీల ప్రతినిధులకు అధికారాల్లేకపోవడం, వినియోగదారులతో ఒప్పందంపై సంతకం చేయించుకోవడానికి ముందు పాలసీకి సంంధించి అన్ని డాక్యుమెంట్లను అందించకపోవడం, ముందు నుంచీ ఉన్న వ్యాధుల పేరిట క్లెయిమ్‌లను తిరస్కరించడం, పంట బీమా క్లెయిమ్‌లను కేంద్ర పథకంతో ముడిపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది.
ప్రస్తుతం దేశంలో వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 20 శాతానికి పైగా బీమా రంగానికి సంబంధించే ఉంటున్నాయనేది వాస్తవం ‘‘ఐఆర్‌డీఏఐ, ఇతర భాగస్వాముల (బీమా సంస్థలు, టీపీఏలు) వద్ద ఈ అంశాలను ప్రస్తావించాం. బీమా సంస్థలు స్వచ్చందంగా వీటిని పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాం. అవసరనుకుంటే వీటిని తప్పనిసరి చేయాలని ఐఆర్‌డీఏఐని కోరతాం’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ అంశాల వల్లే దేశవ్యాప్తంగా బీమాకు సంబంధించి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమ 8 శాతం విస్తరణ రేటును చేరుకోవాలంటే, ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెరిగిపోకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. బీమా పాలసీ నిబంధనలు, షరతులు సులభతరంగా, స్పష్టంగా, అర్థం చేసుకోతగిన భాషలో ఉంటే ఫిర్యాదులను తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. నియమ నిబంధనలు, షరతులను పూర్తిగా అర్థం చేసుకోకుండా డాక్యుమెంట్‌పై సంతకం చేయరాదన్న అవగాహనను పాలసీదారుల్లో కాల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment