హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘పండగొస్తుంది. షాపింగ్‌కెళతాం. అక్కడి డ్రెస్సుల్లో ఒకటి ఎంపిక చేసి.. మనకు నప్పుతుందో లేదో ట్రయల్ వేసుకొని మరీ చూస్తాం. నచ్చితే ఒకే! లేకపోతే ఇంకోటి చూస్తాం! కుదరకపోతే వేరే షాపుకెళతాం’’ ఇందులో మనకయ్యే ఖర్చేమీ ఉండదు!
మరి దీన్నే వైద్య సేవలకు అన్వయిస్తే...‘‘సుస్తీ చేస్తే దగ్గర్లోని ఆసుపత్రికెళతాం. మందులు వాడతాం. తగ్గలేదంటే మరో ఆసుపత్రికెళతాం. మళ్లీ మందులు వాడతాం. ఈ లోపు స్నేహితులో, బంధువులో మరో వైద్యుడిని సూచిస్తే అక్కడికీ వెళతాం’’ కానీ వెళ్లిన ప్రతి ఆసుపత్రిలో డాక్టర్ కన్సల్టేషన్, పరీక్షలు, మందులు ఖర్చులు తడిసిమోపడవుతాయి!
పై రెండు ఉదాహరణలతో తెలిసిందొక్కటే.. విండో షాపింగ్‌లా ట్రీట్‌మెంట్ షాపింగ్ ఉచితంగా దొరకదని! దీన్నే వ్యాపారంగా మార్చుకున్నారు నిమ్స్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సర్జన్‌గా ఉన్న డాక్టర్ నిరంజన్ రావూరి. 2016 ఏప్రిల్‌లో హైదరాబాద్ కేంద్రంగా కేర్‌మోటో.కామ్‌ను ఆరంభించారు. సంస్థ సేవలు, ఇతర వివరాలను ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
సాధారణంగా పేషెంట్లు 3 రకాలు. ఆరోగ్య బీమాతో చికిత్స చేయించుకునేవాళ్లు, బీమా లేకుండా డబ్బుతో చికిత్స చేయించుకునే వాళ్లు, ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే వాళ్లు. నిజానికి 60 శాతం పేషెంట్లు బీమాతో చేయించుకునేవారే. వీళ్ల సమస్యేంటంటే.. ఏ జబ్బుకు ఏ ఆసుపత్రి, ఏ వైద్యుడు సరైన చికిత్స చేస్తాడో తెలియదు. డబ్బులు వృథా చేస్తుంటారు. రోజూ పేషెంట్లు వచ్చి నాకు చెప్పే బాధలే కేర్‌మోటో.కామ్‌కు పునాది వేశాయి. ట్రీట్‌మెంట్ షాపింగ్ ఖర్చును నివారించి ఏ రోగానికి ఏ ఆసుపత్రిలో సరైన చికిత్స అందుతుందో.. అది కూడా అందుబాటు ధరల్లో ఎక్కడ ఉంటుందో చెప్పడమే కేర్‌మోటో.కామ్ పని.
6 నెలల్లో మార్కెట్లోకి ఐఓటీ పరికరం..
ప్రస్తుతం మా వద్ద 30 మంది ఉద్యోగులున్నారు. వైద్య పరిభాషతో పాటూ ఏ జబ్బుకు ఎలాంటి చికిత్స ఉంటుందనే అంశాలపై శిక్షణ ఇచ్చిన తర్వాతే ఉద్యోగులను నియమించుకుంటాం. ఐఓటీ ఆధారిత మెడికల్ డివైజ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 40 శాతం అభివృద్ధి పూర్తయింది. మరో 6 నెలల్లో మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఇదేంటంటే.. డివైజ్‌ను కొన్న కస్టమర్ బీపీ, షుగర్, హృదయ స్పందన వంటి వివరాలు ఎప్పటికప్పుడు క్లౌడ్ ఆధారంగా కేర్‌మోటోకు చేరుతాయి. ఎలాంటి తేడాను గుర్తించినా.. వెంటనే కస్టమర్‌కు సమాచారం పంపిస్తాం. వెంటనే కస్టమర్ దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించే వీలుంటుంది.
3 నెలల్లో రూ.6 కోట్ల సమీకరణ..
2 నెలల్లో డయోగ్నస్టిక్, ఆరోగ్య బీమా, ఫిజియోథెరపీ విభాగాల్లోనూ సేవలు ప్రారంభిస్తాం. తొలిదశలో 10 సెంటర్లతో ఒప్పందం చేసుకుంటాం. ఇప్పటివరకు కేర్‌మోటోలో వ్యక్తిగతంగా రూ.కోటి పెట్టుబడి పెట్టా. విస్తరణ కోసం రూ.6 కోట్లు సమీకరిస్తున్నాం. ఒకరిద్దరు వీసీ ఇన్వెస్టర్లతో చర్చించాం.3 నెల ల్లో డీల్ క్లోజవుతుంది. కర్ణాటక, తమిళనాడులో 40 ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుని విస్తరిస్తున్నాం.
100 ఆసుపత్రులు.. 300 మంది వైద్యులు..
ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటూ విజయవాడ, వైజాగ్, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, కాకినాడల్లోని సుమారు 100 ఆసుపత్రులు, 300 మంది వైద్యులతో ఒప్పందం చేసుకున్నాం. వైద్య ఖర్చులను సమకూర్చేందుకు మిలాప్, ఇంపాక్ట్ గురు వంటి క్రౌడ్‌ఫండింగ్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకున్నాం.
ఈ మధ్యే శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తికి కాలేయ మార్పిడికి మిలాప్ ద్వారా నిధులు సమీకరించాం. కాలేయ దాత దొరకగానే చికిత్స మొదలవుతుంది. కేర్‌మోటోకు 2.64 లక్షల యూజర్లున్నారు. 4,767 కన్సల్టేషన్స్ పూర్తి చేశాం. మా ద్వారా 1,049 సర్జరీలు జరిగాయి. ప్రస్తుతం రోజుకు 120 కాల్స్ వస్తున్నాయి. వీటిల్లో మెకాళ్ల మార్పిడి, కంటి శుక్షాల చికిత్స, కాలేయ మార్పిడి వంటి వ్యాధులకు సంబంధించిన ఫోన్లే ఎక్కువగా ఉంటున్నాయి. 70 శాతం కేసులను నిమ్స్, ఎంఎన్‌జే, పుట్టపర్తి ఆసుపత్రులకే సూచిస్తుంటాం.
Comments
Please login to add a commentAdd a comment