బీసీ ఏ, ఈలోకి చేర్చాలంటూకొన్ని కులాల వినతులు
బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీసీలు కాకున్నా కులగణన సర్వేలో బీసీలుగా నమోదు చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్లు ఖరారు చేసే అం«శంపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా వేదికగా బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిశెట్టి నిరంజన్ మాట్లాడుతూ సమగ్ర వివరాలు సేకరించనున్న నేపథ్యంలో భవిష్యత్‌లో ఇవే కీలకమని, దీని ఆధారంగానే రిజర్వేషన్లు, పథకాలు ఉంటాయని వివరించారు.
కులాల వారీగా సామాజిక, ఆర్థిక పరిస్థితులు తెలుసుకునేందుకు కలెక్టర్లకు బహిరంగ విచారణ చక్కటి అవకాశమని, 13 వరకు జరిగే కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొనాలని సూచించారు. కొన్ని కులాలు డీ నుంచి ఏ కు మార్చాలని, మరికొన్ని కులాలు బీసీ ఏ నుంచి ఎస్టీకి, బీసీ బీ నుంచి ఈకి రిజర్వేషన్లు మార్చాలని నివేదించారని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీ కమిషన్ సభ్యులు రంగు బాలలక్ష్మి, తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సత్యప్రకాశ్, కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
విచారణ రసాభాస
బీసీ కమిషన్ బహిరంగ విచారణ రసాభాసగా మారింది. వివిధ బీసీ కుల సంఘాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వినతిపత్రాలు సమర్పించగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, సంజయ్‌కుమార్ బీసీ కమిషన్‌కు వినతిపత్రమిస్తూ కమిషన్ విచారణపై అనుమానాలు వ్యక్తం చేశారు. బిహార్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రొసీజర్ ల్యాప్స్ పేరుతో కోర్టు కొట్టివేసిందని, తెలంగాణలో కేవలం కాలయాపన కోసమే విచారణ, సర్వేలు చేస్తుందని దుయ్యబట్టారు.
సర్వే కోర్టులో నిలబడుతుందా.. ఏ రకంగా నిలబడుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. తన అభిప్రాయం చెప్పేందుకు కమిషన్ అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరూ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీసీలకు ఏం చేశారని, రిజర్వేషన్ల అమలులో ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment