రాష్ట్రంలో కొత్తగా బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇదే
బీసీ రిజర్వేషన్లపై ఇప్పటివరకు రెండు కమిషన్ల అధ్యయనం
కొత్త కమిషన్ ఏర్పాటుతో గత పరిశీలనంతా అటకెక్కినట్టే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు అధ్యయన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో పనిచేసిన రెండు బీసీ కమిషన్లు వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిగతులు, విద్య, ఉద్యోగ అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినప్పటికీ... ప్రభుత్వం తాజాగా జి.నిరంజన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ కమిషన్‌ను డెడికేటెడ్ కమిషన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషన్ జిల్లాల వారీగా పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించడంతో ఈ ప్రక్రియ మళ్లీ మొదట్నుంచి ప్రారంభం కానున్నట్లు కనిపిస్తోంది.
ప్రభుత్వం ఈనెల 6న జి.నిరంజన్ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించిన కమిషన్ చైర్మన్, సభ్యులు తాజాగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం పూర్వపు బీసీ కమిషన్ చైర్మన్లు, సభ్యులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరించిన అనంతరం కులగణన కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని చెప్పారు. ఆ తర్వాత జిల్లాల వారీగా పర్యటనల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన చేసిన తర్వాతే బీసీ రిజర్వేషన్లు తేల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గత అధ్యయనం అటకెక్కినట్లే...
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు బీసీ కమిషన్లు పని చేశాయి. బీఎస్ రాములు చైర్మన్‌గా వ్యవహరించిన కమిషన్ మూడేళ్లపాటు పనిచేసి అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) లెక్కలు తేల్చడంతోపాటు మైనార్టీ రిజర్వేషన్లపై కసరత్తు చేసింది. రాములు కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం ఎంబీసీ కేటగిరీని విభజించింది. ఆ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు... వరుసగా మూడేళ్లపాటు రూ.వెయ్యి కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించింది.
ఆ తర్వాత వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షతన రెండో బీసీ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై లోతైన అధ్యయనం చేసింది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి.. అక్కడి బీసీ కమిషన్‌లు రూపొందించిన అధ్యయనాలను సైతం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఇదే డెడికేటెడ్ కమిషన్..
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కుల గణనకు సంబంధించి నిపుణులు, సామాజికవేత్తలతో సమావేశాలు నిర్వహించి, దేశవ్యాప్తంగా అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి 64 ప్రశ్నలతో కూడిన ‘ముసాయిదా ప్రశ్నావళి’ని వకుళాభరణం కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. గత ఆగస్టు 31న వకుళా భరణం కమిషన్ పదవీ కాలం ముగియడంతో సర్కార్ కొత్తగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
స్థానిక సంస్థల్లో కోటా పెంపుపై ఇప్పటికే రెండు కమిషన్లు నివేదికలు సమర్పించినప్పటికీ.. ప్రభుత్వం తాజా కమిషన్‌నే డెడికేటెడ్ కమిషన్‌గా ప్రకటించడం, విధివిధా నాలు జారీ చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించడంతో గత కమిషన్లు చేసిన అధ్యయనాలు అటకెక్కినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment