BC Commission Chairman
-
బీసీ కోటా పెంపు కసరత్తు మళ్లీ మొదటికి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు అధ్యయన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో పనిచేసిన రెండు బీసీ కమిషన్లు వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిగతులు, విద్య, ఉద్యోగ అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినప్పటికీ... ప్రభుత్వం తాజాగా జి.నిరంజన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ కమిషన్‌ను డెడికేటెడ్ కమిషన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషన్ జిల్లాల వారీగా పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించడంతో ఈ ప్రక్రియ మళ్లీ మొదట్నుంచి ప్రారంభం కానున్నట్లు కనిపిస్తోంది.ప్రభుత్వం ఈనెల 6న జి.నిరంజన్ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించిన కమిషన్ చైర్మన్, సభ్యులు తాజాగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం పూర్వపు బీసీ కమిషన్ చైర్మన్లు, సభ్యులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరించిన అనంతరం కులగణన కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని చెప్పారు. ఆ తర్వాత జిల్లాల వారీగా పర్యటనల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన చేసిన తర్వాతే బీసీ రిజర్వేషన్లు తేల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత అధ్యయనం అటకెక్కినట్లే...ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు బీసీ కమిషన్లు పని చేశాయి. బీఎస్ రాములు చైర్మన్‌గా వ్యవహరించిన కమిషన్ మూడేళ్లపాటు పనిచేసి అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) లెక్కలు తేల్చడంతోపాటు మైనార్టీ రిజర్వేషన్లపై కసరత్తు చేసింది. రాములు కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం ఎంబీసీ కేటగిరీని విభజించింది. ఆ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు... వరుసగా మూడేళ్లపాటు రూ.వెయ్యి కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించింది.ఆ తర్వాత వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షతన రెండో బీసీ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై లోతైన అధ్యయనం చేసింది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి.. అక్కడి బీసీ కమిషన్లు రూపొందించిన అధ్యయనాలను సైతం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఇదే డెడికేటెడ్ కమిషన్..రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కుల గణనకు సంబంధించి నిపుణులు, సామాజికవేత్తలతో సమావేశాలు నిర్వహించి, దేశవ్యాప్తంగా అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి 64 ప్రశ్నలతో కూడిన ‘ముసాయిదా ప్రశ్నావళి’ని వకుళాభరణం కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. గత ఆగస్టు 31న వకుళా భరణం కమిషన్ పదవీ కాలం ముగియడంతో సర్కార్ కొత్తగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.స్థానిక సంస్థల్లో కోటా పెంపుపై ఇప్పటికే రెండు కమిషన్లు నివేదికలు సమర్పించినప్పటికీ.. ప్రభుత్వం తాజా కమిషన్నే డెడికేటెడ్ కమిషన్‌గా ప్రకటించడం, విధివిధా నాలు జారీ చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించడంతో గత కమిషన్లు చేసిన అధ్యయనాలు అటకెక్కినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
బీసీ కమిషన్ చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్‌గా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కమిషన్‌కు సభ్య కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ వ్యవహరించనుం డగా..కమిషన్ సభ్యులుగా సీహెచ్. ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్, కె.కిషోర్‌గౌడ్‌లు ఉంటారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. పూర్తిస్థాయి ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత తొలి బీసీ కమిషన్‌లో సభ్యులుగా వకుళాభరణం సేవలందించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సభ్యులుగా ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్‌ని నియమించింది. -
బీసీ కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ అంబటి శంకర నారాయణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ నియమితులు కానున్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించిన అనంతరం ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ శంకర నారాయణ నియామకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల చట్టం తెచ్చింది. వెనుకబడిన తరగతుల సాధికారత, అభ్యున్నతికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ బీసీ కమిషన్ పర్యవేక్షిస్తుంది. కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని బీసీల్లో అత్యంత వెనుకబడిన వారిని గుర్తించడం, గ్రూపుల్లో మార్పులు చేర్పులు తదితర అంశాలపై బీసీ కమిషన్ పనిచేస్తుంది. బీసీలపై వేధింపులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు అమలు కాకపోవడం లాంటి వాటిపై వచ్చే ఫిర్యాదులన్నింటిపై బీసీ కమిషన్ స్పందిస్తుంది. వీటిపై ఎప్పటికప్పుడు సమగ్ర అధ్యయనం, విచారణ చేసి ప్రభుత్వానికి తగిన సిఫారసులు, నివేదికలు అందచేస్తుంది. బీసీ కమిషన్ సభ్యులుగా సామాజిక శాస్త్రవేత్త, వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక అవగాహన కలిగిన ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి కమిషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. బీసీ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. -
జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు
సాక్షి, బోధన్: రాష్ట్రంలో తమను బీసీ కులాల్లోకి తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులను పరిగణంలోకి తీసుకుని ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణంగా కులాల మార్పు చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. కుళ్లె కడిగి కులస్తులు తమను బీసీ కులాల్లోకి తీసుకోవాలని రాష్ట్రం ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో శుక్రవారం బోధన్ మండలంలోని తగ్గెల్లి, పెంటా కుర్దు గ్రామాల్లో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పర్యటించి కుళ్లెకడిగె కులస్తుల స్థితిగతులను పరిశీలించారు. వారి జీవన విధా నం, వారు నిర్వహిస్తున్న వృత్తులు, ఆర్థిక పరిస్థితు లు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 2009 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ల ప్రక్రియ ఆగిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ కమిషన్లనను పునరుద్ధరించినందున కులాల ను మార్చాలని, బీసీ కులాల్లోకి తమను తీసుకోవాలని కోరే ప్రజల నుంచి విజ్ఞప్తులు, దరఖాస్తు లు తీసుకుని వారికి న్యాయం చేయ్యడానికి బీసీ కమిషన్ కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 70 కులాలకు చెందిన ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటామన్నారు. ఇందులో భాగంగా 20 కులాల నుంచి విజ్ఞప్తులు అందయని వారి జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు మొదటి విడతలో ఆయా కులాలను తమ కార్యాలయానికి పిలిపించి వివరాలు సేకరించామని, రెండో దశలో వారికి సంబంధించిన సమాచారం సేకరించామని, మూ డో దశలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా ప రిశీలన చేస్తున్నామని అందులో భాగంగా బోధన్ మండలంలోని పెంటాకుర్దు, తగ్గెల్లి గ్రామాల్లో కుల్లె కడిగి కులస్తుల వివరాలు, వారి జీవన శైలి పరిశీలించి వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించామన్నారు. ప్రభుత్వం, బీసీ కమిషన్ పూర్తి పరిశీలన అనంతరం వారిని ఏ కులం, ఏ కేటగిరిలో చేర్చా లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో గోపిరాం, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శంకర్, డిప్యూటీ తహసీల్దార్ ము జీబ్, ఆర్.సాయిలు, సీఐ షకీల్ అలీ, ఎస్సై యా కుబ్, కుల్లె కడిగి కులస్తుల పెద్దలు, గ్రామపెద్దలు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. జీవన, అర్థిక స్థితిగతుల పరిశీలన వర్ని(బాన్సువాడ): చిట్టెపు కులస్తుల జీవన, అర్థిక పరిస్థితులపై మండలంలోని జాకోరా గ్రామంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మెన్ బి.ఎస్.రాములు అధ్యయనం చేశారు. గతంలో తమను బీసీ జాబితాలో చేర్చి జీవన స్థితిగతులను మెరుగు పర్చాలని చిట్టెపు కులస్థులు పలుమార్లు వినతిపత్రాలు అందచేశారు. ఈ నేపథ్యంలోలో తొలుత గ్రామ పంచాయతీ వద్ద చిట్టెపు కులస్థులతో బీసీ కమిషన్ చైర్మెన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇళ్లకు వెళ్లి జీవన విధానం, ఆర్థిక పరిస్థితులను పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాలు, చేస్తున్న వృత్తి, వస్తున్న ఆదాయం వివరాలు తెల్సుకున్నారు. పిల్లలను చదివించాలని సూచించారు. చిన్నప్పుడు తాను బీడీలు చు ట్టానని చైర్మన్ చెప్పడం విశేషం. అనంతరం ఆ యన మాట్లాడుతూ చిట్టెపు కులానికి చెందిన కు టుంబాలకు విద్యా, సంక్షేమ పథకాలలో ఎలాం టి ఫలితం ఉండడం లేదని, బీసీ జాబితాలో చే ర్చాలని వినతిపత్రాలు ఇచ్చిన నేపద్యంలో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామని అన్నారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందచేస్తామని పేర్కొన్నారు. చైర్మన్ వెంట బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి శంకర్, బోధన్ ఆర్డీవో గోపిరాం, తహసీల్దార్ నా రాయణ, వీఆర్వో అశోక్, చిట్టెపు కుల సంఘం జిల్లా కార్యదర్శి నాందేవ్, జాకోరా సర్పంచ్ గోదావరిగణేష్, మాజీ ఎంపీటీసీ కలాల్గిరి ఉన్నారు. కలెక్టర్, సీపీలకు అభినందన ఇందూరు(నిజామాబాద్ అర్బన్): పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దఎత్తున అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ సమర్ధవంతంగా పనిపూర్తి చేసినందు కు కలెక్టర్ రామ్మోహన్రావు, సీపీ కార్తికేయను రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అభినందించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. తమను బీసీ కులంలోకి మార్చాలని కోరిన ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణం గా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నా రు. జిల్లాకు సంబంధించి విషయాలపై ఇరువు రు కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో వరుసగా జ రిగిన పలు ఎన్నికలను విజయవం తంగా నిర్వహించినందుకు కలెక్టర్, సీపీలను అభినందించారు. ముఖ్యంగా ఇరువురినీ అభినందించా రు. గెస్ట్‌హౌస్‌లో పలు కులాలకు చెందిన సభ్యుల నుంచి విన్నపాలు స్వీకరిచారు. -
'లేదంటే చంద్రబాబుపై పోరాటం తప్పదు'
విజయవాడ : కాపులను బీసీల్లో కలప వద్దని ఆంధ్రప్రదేశ్ బీసీ కమీషన్ చైర్మన్ మంజునాథకు బీసీ చైతన్య వేదిక సభ్యులు విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో కమిషన్ చైర్మన్ మంజునాథతో బీసీ చైతన్య వేదిక సభ్యులు భేటీ అయ్యారు. అనంతరం బీసీ చైతన్య వేదిక సభ్యులు విలేకర్లతో మాట్లాడుతూ... ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు కాపులను బీసీలలో కలపాలని చూస్తున్నారని విమర్శించారు. కాపులను బీసీల్లో కలిపితే ఊరుకునేది ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. బీసీ మంత్రలు, ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బయటికి వచ్చి తాము చేస్తోన్న పోరాటానికి మద్ధతు తెలపాలని కోరారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న బాబు... తన నిర్ణయాన్ని 10 రోజుల్లో ఉపసంహరించుకోవాలని బీసీ చైతన్య వేదిక సభ్యులు డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబుపై పోరాటం తప్పదని వారు హెచ్చరించారు.