
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శాశ్వత బీసీ కమిషన్ చైర్మన్‌గా ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ నియమితులు కానున్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను సంప్రదించిన అనంతరం ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ శంకర నారాయణ నియామకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల చట్టం తెచ్చింది.
వెనుకబడిన తరగతుల సాధికారత, అభ్యున్నతికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ బీసీ కమిషన్ పర్యవేక్షిస్తుంది. కుల ధ్రువీకరణ పత్రాలు మొదలుకుని బీసీల్లో అత్యంత వెనుకబడిన వారిని గుర్తించడం, గ్రూపుల్లో మార్పులు చేర్పులు తదితర అంశాలపై బీసీ కమిషన్ పనిచేస్తుంది. బీసీలపై వేధింపులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు అమలు కాకపోవడం లాంటి వాటిపై వచ్చే ఫిర్యాదులన్నింటిపై బీసీ కమిషన్ స్పందిస్తుంది. వీటిపై ఎప్పటికప్పుడు సమగ్ర అధ్యయనం, విచారణ చేసి ప్రభుత్వానికి తగిన సిఫారసులు, నివేదికలు అందచేస్తుంది. బీసీ కమిషన్ సభ్యులుగా సామాజిక శాస్త్రవేత్త, వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక అవగాహన కలిగిన ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి కమిషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. బీసీ కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment