హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్లు, బైకులు అద్దెకు తీసుకోవడం మనకు తెలుసు. ఈ మధ్య ఇంట్లోకి కావాల్సిన బెడ్లు, వాషింగ్ మిషన్, టీవీ, ఎలక్ట్రానిక్స్ వంటివీ అద్దెకిస్తున్నారు. కానీ, పిల్లల ఉత్పత్తులు, వృద్ధుల ఉపకరణాలు ఎవరైనా అద్దెకిస్తున్నారా? ఇదిగో... ‘రెంటికిల్’ పని ఇదే. పిల్లల మంచాలు, పరుపులు, ఆట వస్తువులు, బ్యాగులు.. వృద్ధులకవసరమైన చేతికర్రలు, వీల్ చెయిర్ల వంటివి అద్దెకిచ్చేందుకు రెడీ అవుతోందీ సంస్థ. మరిన్ని వివరాలు రెంటికిల్ కో–ఫౌండర్ వినీత్ చావ్లా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
‘‘ముంబై వర్సిటీలో ఎంబీఏ చేశాక ఒరిఫ్లేమ్ కాస్మొటిక్స్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా చేరా. తర్వాత గోద్రెజ్, వర్ల్‌పూల్, ఫ్యూచర్ గ్రూప్స్‌ల్లో వివిధ హోదాల్లో పనిచేశా. తరవాత హాంకాంగ్‌కు చెందిన వినాలైట్ గ్రూప్‌కు ఇండియా సీఈఓగా బాధ్యతలు స్వీకరించా. అన్నిచోట్లా నాకు ఎదురైన అనుభవమే రెంటికిల్ స్టార్టప్‌కు పునాది వేసింది.
ఉద్యోగ రీత్యా వేర్వేరు నగరాల్లో, దేశాల్లో ఉండేటపుడు ప్రతిచోటా ఇంట్లోకి వస్తువులు కొనడం, వాటిని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి శ్రమతో పాటూ డబ్బూ వృథా అయ్యేది. దీనికి పరిష్కారంగానే అమిత్ సోదితో కలిసి రూ.30 లక్షల పెట్టుబడితో 2015 నవంబర్‌లో గుర్గావ్ కేంద్రంగా రెంటికిల్.కామ్‌ను ప్రారంభించాం.
150 రకాల కేటగిరీల్లో ఉత్పత్తులు..
ప్రస్తుతం లైఫ్ స్టయిల్, హోమ్ అప్లియెన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి 150 విభాగాలకు చెందిన ఉత్పత్తులున్నాయి. పడక మంచాలు, పరుపులు, వార్డ్‌రోబ్, డ్రెస్సింగ్, డైనింగ్ టేబుల్, లైట్లు, సోఫా, టీవీ, ఫ్రిజ్, వాటర్ ప్యూరిఫయర్లు, మైక్రో ఓవెన్, వాషింగ్ మిషన్ ఇలా ఇంటికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువూ అద్దెకు తీసుకోవచ్చు.
వీటిలో ఫర్నీచర్ను మేమే సొంతగా ఢిల్లీలోని మా కేంద్రంలో తయారు చేస్తున్నాం. గృహోపకరణాల్ని కొని నిల్వచేస్తున్నాం. మిగిలిన ఉత్పత్తుల కోసం సంబంధిత తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. మార్చి నాటికి పిల్లలు, వృద్ధులకు అవసరమైన ఉత్పత్తులతో పాటు, జిమ్ ఉపకరణాలను కూడా అద్దెకిస్తాం.
రూ.26 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, గుర్గావ్, నోయిడాలో సేవలందిస్తున్నాం. అక్కడ గిడ్డంగులూ ఉన్నాయి. వచ్చే నెలలో బెంగళూరులో... ఈ ఏడాది ముగిసేలోగా ముంబై, పుణె నగరాల్లో సేవలు ఆరంభిస్తాం. ఇప్పటివరకు 10 వేల మంది మా సేవలను వినియోగించుకున్నారు.
‘ఓయో’ రూమ్స్‌లో వాడే వస్తువులన్నీ మా దగ్గర అద్దెకు తీసుకున్నవే. ప్రస్తుతం నెలకు 1,500 ఆర్డర్లు, రూ.5 లక్షల వ్యాపారాన్ని చేస్తున్నాం. 60 మంది ఉద్యోగులున్నారు. 2 నెలల క్రితం ఈక్విటీ రూపంలో రూ.26 కోట్ల నిధులను సమీకరించాం. సింగపూర్‌కు చెందిన వీసీ సంస్థ థింక్యూవేట్, సీఎక్స్ పార్టనర్‌కు చెందిన అజయ్ రెలాన్ ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది చివర్లో మరో విడత నిధులను సమీకరిస్తాం’’ అని చావ్లా వివరించారు.
హైదరాబాద్ వాటా 30 శాతం..
రెంటికిల్ వెబ్‌సైట్‌లోకి లాగినయ్యాక.. కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత పాన్, ఆధార్ నంబర్లతో పాటూ బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి వివరాలివ్వాలి. కేవైసీ పూర్తయ్యాక.. 5–7 రోజుల వ్యవధిలో ఉత్పత్తులు ఉచితంగా ఇంటికి డెలివరీ అవుతాయి. రిటర్న్స్ కూడా అంతే! అద్దె నెలకు సంబంధిత వస్తువు ధరలో 2–3 శాతం వరకుంటుంది. మా మొత్తం వ్యాపారం, ఆర్డర్లలో హైదరాబాద్ వాటా 30 శాతం వరకూ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment