హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్త దానం, నేత్ర దానం.. ఆఖరికి అవయవ దానం గురించి కూడా తెలుసు. కానీ, చెప్పుల దానం, బూట్ల దానం గురించి ఎప్పుడైనా విన్నారా? జోక్ అని నవ్వి వదిలేయకండి.. ఎందుకంటే.. ఇది నిజం! మనం వాడి పడేసే బూట్లు, చెప్పులు, సోల్, లేస్‌ల వంటివి సేకరించి తిరిగి వాడుకునేందుకు వీలుగా మరమ్మతు చేసి విరాళంగా అందిస్తోంది గ్రీన్‌సోల్ సంస్థ! సామాజిక బాధ్యతగా ప్రారంభమైన ఈ సంస్థ వ్యాపార రూపం దాల్చుకుంది. రతన్ టాటా, బరాక్ ఒబామాల ప్రశంసలూ అందుకుంది. దీనిపై సంస్థ సీఈఓ శ్రేయాన్స్... ‘సాక్షి’ స్టార్టప్ డైరీతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
నేను, నా స్నేహితుడు రమేశ్ ధామి ఇద్దరం మారథాన్ రన్నర్లమే. ప్రాక్టీస్‌లో, పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనే వాళ్లం. కాకపోతే నెలకు 2–3 జతల బూట్లు పాడైపోయేవి. ఖరీదైన బూట్లను ఊరికే బయట పారేసే బదులు రీ ఫర్నిష్ చేసి తిరిగి వాడుకుంటే బాగుంటుంది కదా అనిపించేది. ఈ ఆలోచనే గ్రీన్‌సోల్‌కు బీజం వేసింది. 2014లో రూ.10 లక్షల పెట్టుబడితో ముంబై కేంద్రంగా గ్రీన్‌సోల్ సంస్థను ప్రారంభించాం. జనం వాడి పడేసే బూట్లను సేకరించి మరమ్మతు చేసి విరాళంగా అందించడం, ఇంకాస్త ఫ్యాషన్‌గా తయారు చేసి విక్రయించటం మా పని.
కార్పొరేట్స్, వ్యక్తిగత విరాళాలు..
వ్యక్తులు లేదా కార్పొరేట్ సంస్థలు ఎవరైనా సరే... పాత బూట్లు, చెప్పులు, సోల్, లేసులను విరాళంగా అందించవచ్చు. షూ మరమ్మతు కోసం అయ్యే ఖర్చు కూడా దాతే ఇవ్వాలి. ఒక్కో జతకు రూ.199 అందించాల్సి ఉంటుంది. బూట్ల సేకరణ కోసం దేశంలో 4 వేల కేంద్రాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 15 పాయింట్లున్నాయి. గతేడాది లక్ష జతల బూట్లను, రూ.20 కోట్లను విరాళంగా సమీకరించాం. టాటా, రోల్స్ రాయిస్, ల్యాండ్ రోవర్, ఎల్ అండ్ టీ, వివంత, నాప్‌టోల్, జస్ట్ డయల్, యాక్సిస్ బ్యాంక్, సిగ్నా టీటీకే, మేక్ మై ట్రిప్ వంటి వందలాది కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కూడా చేసుకున్నాం.
గ్రీన్‌సోల్ చెప్పులు విరాళం, విక్రయం కూడా..
సేకరించిన బూట్లను ముంబైలోని రీఫర్బిష్ కేంద్రంలో మరమ్మతు చేస్తాం. ఒక్క జత తయారు చేసేందుకు అరగంట సమయం పడుతుంది. మరమ్మతు చేసిన చెప్పులను నెలకొకసారి ఒక్కో ప్రాంతంలో చెప్పులులేని ప్రజలకు, గ్రామాల్లోని పాఠశాలలకు అందజేస్తుంటాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62 వేల జతల చెప్పులను దానం చేశాం. ఏప్రిల్‌లో ఏపీ, తెలంగాణల్లో 4 వేల జతల బూట్లను విద్యార్థులకు అందజేశాం. వీటిని అడిడాస్ కంపెనీ స్పాన్సర్ చేసింది. వచ్చే వారం ఒరిస్సాలో 4,500 జతల చెప్పులను విరాళంగా అందించనున్నాం.
ఆన్‌లైన్‌లో కొనుగోలు కూడా..
గ్రీన్‌సోల్ కంపెనీ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చుల కోసం కొన్ని రకాల ఫ్యాషన్ చెప్పులను కూడా తయారు చేస్తాం. వీటి విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును నిర్వహణ ఖర్చులుగా వినియోగిస్తుంటాం. ప్రస్తుతానికైతే ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అమ్మకాలు చేపడుతున్నాం. డిజైన్‌ను బట్టి వీటి ధర రూ.600–1,200గా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల వ్యాపారాన్ని చేశాం. ఈ ఏడాది రూ.20 లక్షల టర్నోవర్‌ను లకి‡్ష్యంచాం.
జనవరి నుంచి విపణిలోకి గ్రీన్‌సోల్ చెప్పులు..
జనవరి నుంచి రిటైల్, హోల్‌సేల్‌లోనూ గ్రీన్‌సోల్ పాదరక్షలను విక్రయించాలని నిర్ణయించాం. ఇందుకోసం స్థానిక రిటైల్ స్టోర్లతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం ముంబైలో గిడ్డంగి ఉంది. ఫిబ్రవరిలో టాటా సహకారంతో జంషెడ్‌పూర్, ఢిల్లీల్లో 1,400 చ.అ.లో రెండు గిడ్డంగులను ప్రారంభించనున్నాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో రూ.10 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు పీఈ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నాం.
రండి.. నడకను దానం చేద్దాం!
Published Sat, Dec 9 2017 1:32 AM | Last Updated on Sat, Dec 9 2017 1:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment