4జీ ల్యాప్‌టాప్‌ వస్తోంది! | 4g laptops will coming soon | Sakshi
Sakshi News home page

4జీ ల్యాప్‌టాప్‌ వస్తోంది!

Published Sat, May 12 2018 1:24 AM | Last Updated on Sat, May 12 2018 1:24 AM

4g laptops will coming soon - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: 4జీ ఫోన్లే కాదు. ల్యాప్‌టాప్‌లూ వస్తున్నాయ్‌. కాకపోతే వీటిని తెస్తున్నది మాత్రం హైదరాబాదీ స్టార్టప్‌ ఆర్‌డీపీ. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్‌కూ పరిచయం చేస్తున్న తమ ప్రాజెక్టు ఇప్పటికే 80 శాతం పూర్తయిందని.. 4జీతో పాటూ 24 గంటల బ్యాటరీ బ్యాకప్, ధర కూడా రూ.15 వేల లోపే ఉంటుందని చెప్పారు ఆర్‌డీపీ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ విక్రమ్‌ రెడ్లపల్లి. ఈ ఏడాది ఏకంగా 10 మోడళ్లను విడుదల చేస్తామన్నారు.

డిగ్రీ పూర్తయ్యాక అనంతపురంలో చిన్న కంప్యూటర్‌ సర్వీస్‌ సెంటర్లో పనిచేసిన విక్రమ్‌.. అక్కడే ఏకంగా ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్‌ను తయారు చేసే కేంద్రమే పెట్టేశాడు. ఆర్‌డీపీ భవిష్యత్తు ప్రణాళికలను ఆయన ‘స్టార్టప్‌ డైరీతో పంచుకున్నారు.

‘‘మాది అనంతపురంలోని కదిరి. ఎస్‌కే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ చేశా. అక్కడే కంప్యూటర్‌ సర్వీసెంగ్‌ సెంటర్‌తో పాటు తొలి సైబర్‌ కేఫ్‌ ప్రారంభించా. 2004లోనే స్థానిక కేబుల్‌ ఆపరేటర్లతో కలిసి ఇంటింటికీ ఇంటర్నెట్‌ ఇవ్వాలని ప్రయత్నించా. కానీ, బ్యాండ్‌విడ్త్, శాటిలైట్‌ సమస్యలతో అది సక్సెస్‌ కాలేదు. 2008లో ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు థిన్‌ క్లింట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ తీసుకున్నా.

నాలుగేళ్ల ఈ డిస్ట్రిబ్యూషన్‌లో వ్యాపారం, నెట్‌వర్కింగ్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్‌ ఏంటనేది నేర్చుకున్నా. అదే సమయంలో చైనాలో ఎలక్ట్రానిక్స్‌ ఎక్స్‌పో జరిగింది. విమానం ఎక్కాలనే కోరిక కూడా తీరుతుందని నేరుగా ఎక్స్‌పోకు వెళ్లా. స్థానికంగా ఒకటిరెండు టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందం చేసుకొని సైబర్‌ సొల్యూషన్‌ బ్రాండ్‌ పేరిట వంద కంప్యూటర్లు తయారు చేయించుకొని ఇక్కడ విక్రయించడం మొదలుపెట్టా.

అక్కడి నుంచి సొంతంగా బ్రాండ్‌ ఉండాలని నిర్ణయించుకొని 2012లో ఆర్‌డీపీ పేరిట సొంత కంపెనీ ప్రారంభించా. టెక్నాలజీ తెలిసిన ఎవరికైనా సరే థిన్‌క్లింట్‌ అంటే రిమోట్‌ డెస్క్‌టాప్‌ ప్రొటోకాల్‌ (ఆర్‌డీపీ) అనే. కానీ, సొంతగా కంపెనీ పెట్టాక కూడా ఆర్‌డీపీ అనే ఉంచడానికి కారణం.. అది మా ఇంటి పేరు కూడా కావటమే. థిన్‌క్లింట్‌ లోగో కూడా మార్చి.. ఆర్‌డీపీ అంటే రెడ్లపల్లిగా మార్చేశా. ఇప్పటివరకు ఆర్‌డీపీలో రూ.15 కోట్ల పెట్టుబడి  పెట్టా.

ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్స్‌..
ప్రస్తుతం ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టాబ్లెట్, థిన్‌క్లింట్స్‌ మూడు విభాగాల్లో 16 మోడల్స్‌ ఉన్నాయి. ధరలు రూ.3,500 నుంచి రూ.45 వేల వరకూ ఉన్నాయి. ఎంటర్‌ప్రైజ్, రిటైల్, ఈ–కామర్స్‌ మూడు మాధ్యమాల్లో ఆర్‌డీపీ విక్రయాలుంటాయి. ఎంటర్‌ప్రైజ్‌లో కార్వీ, కేర్‌ ఆసుపత్రి, సేఫ్‌ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రాబ్యాంక్, ఎయిర్‌ ఇండియా వంటి 3 వేలకు పైగా కంపెనీలు మా కస్టమర్లు. రిటైల్‌లో 26 ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్లున్నాయి. సొంత వెబ్‌సైట్‌తో పాటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఈబే వంటి ఈ–కామర్స్‌ సంస్థల్లోనూ మా ఉత్పత్తులను కొనొచ్చు.

తెలుగు రాష్ట్రాల వాటా 35 శాతం..
గత ఆర్ధిక సంవత్సరంలో 62 వేల ఉపకరణాలను విక్రయించాం. ఈ ఏడాది లక్షకు చేరాలని లకి‡్ష్యంచాం. ఏటా 20 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. మా విక్రయాల్లో ల్యాప్‌టాప్‌ వాటా 40 శాతం. మా అమ్మకాల్లో డిస్ట్రిబ్యూషన్ల వాటా 30 శాతం, ఆన్‌లైన్‌ వాటా 15 శాతం వరకూ ఉంది. మన దేశంతో పాటూ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లోనూ విక్రయాలున్నాయి. మా వ్యాపారంలో తెలుగు రాష్ట్రాల వాటా 35 శాతం. ఎగుమతుల వాటా 5 శాతం. ఈ ఏడాది ముగిసేసరికి ప్రాంతీయ డిస్ట్రిబ్యూషన్ల సంఖ్యను 100కు చేర్చాలని లకి‡్ష్యంచాం.

అనంతపురంలో తయారీ కేంద్రం..
ఈ ఏడాది రూ.4 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. ఆయా ఉత్పత్తుల తయారీకి అవసరమైన విడిభాగాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. అనంతపురంలో 7 వేల చదరపు అడుగుల్లో తయారీ కేంద్రం ఉంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 65–70 వేలు. ప్రభుత్వం రాయితీలిస్తే విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో నెలకు 50 వేల ఉత్పత్తి సామర్థ్యంతో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాం. ఐఓటీ, ఏఐ ఆధారిత ఉపకరణాల అభివృద్ధిపై దృష్టిసారించాం. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు, విద్యా సంస్థలు, ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోనున్నాం.

రూ.30 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం సంస్థలో 94 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 15 మంది ఇంజనీర్లు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.30 కోట్ల ఆదాయాన్ని చేరాం. ఈ ఏడాది రూ.80 కోట్లు లకి‡్ష్యంచాం. 2020 నాటికి రూ.150 కోట్లు చేరుకోవాలనేది లక్ష్యం. 2019 నాటికి రూ.100 కోట్ల వాల్యుయేషన్‌తో 6 శాతం వాటాను విక్రయించేందుకు బ్రాండ్‌ క్యాపిటల్‌తో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే ఏడాదిలో రూ.30 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement