కంపెనీల రవాణా సేవలకు ‘విజిల్‌’ | Whistle Drive Startup Story | Sakshi
Sakshi News home page

కంపెనీల రవాణా సేవలకు ‘విజిల్‌’

Published Sat, Jul 27 2019 1:30 PM | Last Updated on Sat, Jul 27 2019 1:30 PM

Whistle Drive Startup Story - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీలకు పెద్ద సవాలే. వ్యాపార కార్యకలాపాల కంటే ఎక్కువగా ఉద్యోగుల రవాణా సేవల నిర్వహణ కష్టం. ఎంప్లాయిస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ థర్డ్‌ పార్టీకి ఇద్దామంటే? వాహనాలు మాత్రమే ఉంటే సరిపోదు. టెక్నాలజీ, నిర్వహణ కూడా అవసరమే. సొంత వాహనాలు, డ్రైవర్లు, ఏఐ ఆధారిత ట్రాన్స్‌పోర్ట్‌ టెక్నాలజీ మూడు విభాగాలను నిర్వహణ చేసే స్టార్టపే విజిల్‌ డ్రైవ్‌! మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ రాకేశ్‌ మున్ననూరు ‘స్టార్టప్‌ డైరీ’కి వివరించారు.

‘‘మాది కరీంనగర్‌ జిల్లా. నోయిడాలో బీటెక్‌ పూర్తయ్యాక.. టాప్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. జాబ్‌లో చేరితే లాక్‌ అయిపోతానని వచ్చిన ఆఫర్‌ను వదిలేసి.. ఇంటికొచ్చేశా. బీటెక్‌ చేస్తూనే చాలా స్టార్టప్స్‌కు సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, నిర్వహణ, ఇన్వెస్ట్‌మెంట్స్‌ అప్రూవల్స్‌ తదితర విభాగాల్లో పనిచేశా. ఈ అనుభవంతో సొంతంగా స్టార్టప్‌ పెట్టాలని నిర్ణయించుకొని 2016 ఏప్రిల్‌లో హైదరాబాద్‌ కేంద్రంగా విజిల్‌ డ్రైవ్‌.కామ్‌ను ప్రారంభించాం. డ్రైవర్లను అద్దెకిచ్చే సేవలతో ప్రారంభమైన విజిల్‌ డ్రైవ్‌.. ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీలకు క్యాబ్స్, టెక్నాలజీ సేవలందించే కంపెనీగా ఎదిగింది.

28 కంపెనీలు; 12 వేల మంది..
ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్నాం. ఏడీపీ, ఇన్వెస్కో, ఐటీసీ హోటల్స్, రెయిన్‌బో ఆసుపత్రి, ఎల్‌ అండ్‌ టీ వంటి 28 కంపెనీలు, 12 వేల మంది ఉద్యోగులు కస్టమర్లుగా ఉన్నారు. ప్రస్తుతం 700 క్యాబ్స్‌ ఉన్నాయి. ఇందులో 20 శాతం సొంతానివి. విజిల్‌ ఫ్లీట్‌లో 4–7 సీట్ల వాహనాలు, విజిల్‌ షటిల్‌లో వింగర్స్, మినీ బస్‌లు, విజిల్‌ 360 డిగ్రీస్‌లో వాహనాలతో పాటూ టెక్నాలజీ సేవలు కూడా ఉంటాయి. ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్సీ (ఏఐ), బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. వచ్చే ఏడాది కాలంలో 1,500 క్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం రోజుకు క్యాబ్స్‌ 2,500 ట్రిప్పులు, లక్ష కి.మీ. వరకు తిరుగుతున్నాయి.

రూ.15 కోట్ల ఆదాయం లక్ష్యం..
నెల ప్యాకేజ్, ట్రిప్‌ వారీగా ఆదాయం ఉంటుంది. ధరలు నెల ప్యాకేజీ రూ.30 వేల నుంచి రూ.50 వేలు, ట్రిప్‌కు అయితే రూ.350 నుంచి రూ.1,000కు చార్జీలుంటాయి. డ్రైవర్‌ కం ఓనర్‌ క్యాబ్‌ ఆదాయంలో విజిల్‌ డ్రైవ్‌కు 20 శాతం కమీషన్‌ ఉంటుంది. గతేడాది రూ.8 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. 2019–20లో రూ.15 కోట్ల రెవెన్యూను లకి‡్ష్యంచాం. ఈ ఏడాది ముగింపు నాటికి పుణేలో సేవలను ప్రారంభించనున్నాం. 2020 నాటికి విశాఖపట్నం, ముంబై, ఢిల్లీలోకి ఎంట్రీ ఇస్తాం.

రూ.70 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం విజిల్‌ డ్రైవ్‌లో 62 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో ఈ సంఖ్యను 150కి చేర్చుతాం. ప్రస్తుతం ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టేషన్‌ కోసం ఫోర్డ్స్‌ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయి. నెల రోజుల్లో ఎంవోయూ పూర్తవుతుంది. దీంతో ముంబై, కోల్‌కతా వంటి ఇతర నగరాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టే. ఏడాది కాలంలో క్లయింట్ల సంఖ్యను 50కి చేర్చుతాం. ‘‘ఇప్పటికే మా కంపెనీలో కొలీజియం గ్రూప్‌ రూ.5 కోట్ల పెట్టుబడులు పెట్టింది. త్వరలోనే రూ.70  కోట్ల నిధులు సమీకరించనున్నాం. అమెరికాకు చెందిన పలు ఇన్వెస్ట్‌మెంట్‌ నెట్‌వర్క్స్‌తో చర్చలు జరుగుతున్నాయి’’ అని రాకేశ్‌ వివరించారు.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement